విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్
సాక్షి, న్యూఢిల్లీ : గత నాలుగేళ్లలో మోదీ సర్కార్ అంతర్జాతీయ వ్యవహారాల్లో అనూహ్య విజయాలు సాధించిందని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. పలు దేశాల్లో వివిధ ప్రాంతాల్లో నివసించే 90,000 మంది భారతీయులను ప్రభుత్వం కాపాడిందని చెప్పారు. వివిధ దేశాల్లో ప్రధాని మోదీ పర్యటనల సందర్భంగా పలువురు భారతీయులను తీవ్ర శిక్షల నుంచి రక్షించారని గుర్తుచేశారు. విదేశాల్లో భారతీయులు ప్రస్తుతం ప్రశాంతంగా నివసిస్తున్నారన్నారు. ప్రపంచం నలుచెరుగులా భారత్ ప్రతిష్టను మోదీ సర్కార్ ఇనుమడింపచేసిందని చెప్పుకొచ్చారు.
2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్ మూడు ఎగుమతి నియంత్రిత వ్యవస్థల్లోకి అడుగుపెట్టిందని అన్నారు. నాలుగేళ్లలో మోదీ సర్కార్ సాధించిన విజయాలను సోదాహరణంగా వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతో సంబంధాలను మెరగుపరుచుకునే క్రమంలో 192 దేశాలకు గాను 186 దేశాలకు ప్రభుత్వం చేరువైందని చెప్పారు. రష్యాతో భారత్ సంబంధాలు క్షీణించాయని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ప్రదాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌లు ఇటీవల జరిపిన చర్చలు ఫలవంతమైన విషయం ప్రస్తావించారు.
కాగా మానససరోవర్ సరస్సులో మునిగేందుకు చైనా అధికారులు తమను అనుమతించడం లేదని ఒకరు తనకు ట్వీట్ చేసిన విషయం వెల్లడించారు. సరస్సులో నిర్థిష్టంగా కేటాయించిన ప్రదేశంలోనే పవిత్ర స్నానం ఆచరించే అవకాశం ఉంటుందని, నదిలో ఎక్కడైనా స్నానం చేసే అవకాశం ఉండదని చెప్పారు. డోక్లాం ప్రతిష్టంభన నెలకొన్న ప్రాంతంలో యథాతథ స్థితి కొనసాగుతున్నదని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌తో చర్చలకు తాము వ్యతిరేకం కాదని అయితే ఉగ్రవాదం, చర్చలు ఒకే సమయంలో సాగబోవని తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment