
వీడని ఉత్కంఠ..
- ఇంకా ఆచూకీ తెలియని ఎయిర్‌ఫోర్స్ విమానం
- గాలింపు మరింత తీవ్రం చేస్తామన్న కోస్ట్‌గార్డ్స్
న్యూఢిల్లీ/చెన్నై: బంగాళాఖాతంలో గల్లంతైన భారత వాయుసేన విమానం ఏఎన్ 32 ఆచూకీపై ఉత్కంఠ కొనసాగుతోంది. నాలుగు రోజులుగా తమ వారి క్షేమ సమాచారం తెలియని బాధిత కుటుంబాల్లో ఆవేదన తీవ్రమవుతోంది. గాలింపును ముమ్మరం చేశామని, అయితే, విమానానికి సంబంధించిన శకలాలేవీ లభించలేదని కోస్ట్‌గార్డ్ కమాండర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజన్ బర్గోత్రా సోమవారం తెలిపారు. గాలింపు ప్రాంత విస్తీర్ణాన్ని పెంచుతున్నామని, కొన్ని శిథిలాలు లభించాయి కానీ అవి గల్లంతైన విమానానివి కావని తెలిపారు. విమానం నుంచి ఎమర్జెన్సీ సిగ్నల్స్ రాకపోవడం ఆందోళనకర అంశమేనని, సంబంధిత ఎమర్జెన్సీ లొకేటర్ ట్రాన్స్‌మిటర్ ఉత్పత్తిదారులతో ఈ అంశంపై చర్చించనున్నామని చెప్పారు.
ఉపరితలంపై గాలింపు అనంతరం సముద్రం లోతుల్లో గాలింపు జరుపుతామన్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ(ఎన్‌ఐఓటీ), నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సాయం తీసుకుంటున్నామని, అవసరమైతే ఎన్‌ఐఓటీకి చెందిన సాగర్ నిధి నౌకను గాలింపు కోసం వాడుతామని, ఆ నౌక మారిషస్ నుంచి బయలుదేరిందని తెలిపారు. గాలింపునకు సహకరించని ప్రతికూల వాతావరణం.. ఆదివారం నుంచి నెమ్మదించిందన్నారు. విమాన గాలింపు చర్యల్లో నావికాదళానికి చెందిన 13 నౌకలు, కోస్ట్‌గార్డ్ విభాగానికి చెందిన 4 నౌకలతో పాటు 18 విమానాలు పాల్గొంటున్నాయని నేవీ ప్రధానాధికారి అడ్మిరల్ సునీల్ లాంబ తెలిపారు.
ఏఎన్ 32 సేవలు అపూర్వం
ఏఎన్32 విమాన సామర్థ్యంపై వస్తున్న విమర్శలపై ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా స్పందించారు. గత 30 ఏళ్లుగా వైమానిక దళంలో ఏఎన్ 32 విమానాలు గొప్పగా సేవలందిస్తున్నాయని, గల్లంతైన విమానానికి గత ఏడాదే పూర్తిస్థాయి మరమ్మతులు చేశామన్నారు. విమాన చోదకులుగా సమర్థులే ఉన్నారన్నారు.