రాజ్యాంగ ధర్మాసనానికి ‘తలాక్’
న్యూఢిల్లీ: ముస్లింలు అనుసరిస్తున్న ట్రిపుల్ తలాక్, బహుభార్యత్వం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు అప్పగించింది. మే 11వ తేదీ నుంచి రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం వెల్లడించింది.
ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వం వంటి అంశాలు ఎంతో కీలకమైనవని, సెంటిమెంట్లతో ముడిపడినవని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ.. వీటిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగిస్తున్నట్టు పేర్కొంది. దీనిపై సవివరమైన విచారణ జరపడం అవసరమంది. ‘ఇప్పుడు కనుక దీనిపై నిర్ణయం చేయనట్లయితే.. సంవత్సరాలు, దశాబ్దాలకు కూడా ఇది జరగదు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.