జోక్యం వద్దు
సాక్షి, చెన్నై: విశ్వాసానికి పెట్టింది పేరుగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం తనకంటూ కొన్ని ఆంక్షలను విధించుకున్నారు. ఈ మేరకు బంధువులు, ఆప్తులకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ప్రభుత్వ, రాజకీయ వ్యవహారాల్లో కానీ, కార్యక్రమాల్లో కానీ జోక్యం చేసుకోవద్దని, సచివాలయం వైపుగా ఎవ్వరూ రావద్దంటూ హితవు పలికారు. అన్నాడీఎంకేలో ఆ పార్టీ అధినేత్రి జయలలితకు అత్యంత నమ్మకస్తుడిగా, విశ్వాస పాత్రుడిగా ఓ పన్నీరు సెల్వం పేరు తెచ్చుకున్నారు. అందుకే తొలిసారిగా అసెంబ్లీకి అడుగు పెట్టిన ఆయన్ను జయలలిత తన ప్రతినిధిగా సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. అనంతరం ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతల్ని ప్రభుత్వ పరంగా అప్పగించారు. అలాగే, పార్టీ పరంగా కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా జయలలిత కారాగార వాసంలోకి వెళ్లడంతో ఇప్పుడు మళ్లీ సీఎం అయ్యారు. తన మీద జయలలిత ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయని రీతిలో ప్రభుత్వాన్ని నడిపించేందుకు పన్నీరు సెల్వం సిద్ధమయ్యారు.
పరిమితులు: జయలలిత సీఎంగా ఉన్న సమయంలో ఉపయోగించిన చాంబర్ నుంచి పన్నీరు సెల్వం పరిపాలన సాగించడం లేదు. గతంలో సమీక్షలకు మందిరంగా ఉన్న ఓ గది నుంచి తన పాలనను సాగించే పనిలో పడ్డారు. కొత్త ఆదేశాలు, కొత్త నిర్ణయాల జోలికి వెళ్లకుండా, అమ్మ ఆజ్ఞ మేరకు నిజాయితీగా ముందుకు సాగుతున్నారు. అలాగే, తాను అమ్మగా పిలుచుకునే జయలలిత బెయిల్ మీద బయటకు వచ్చే వరకు కాబోలు మాసిన గడ్డంతో ప్రత్యక్షం అవుతున్నారు. ఒక సీఎం ఇలా ఉండాలి, అలా ఉండాలి అన్నట్టుగా ఇది వరకు ఆ కుర్చీలో ఉన్న వాళ్లు వ్యవహరించారు. అయితే, వారందరికన్నా భిన్నంగా ఏదో ఒక బాధ్యతను మాత్రమే తాను నిర్వర్తిస్తున్నట్టుగా ముందుకు సాగుతున్నారు.
సమీక్షా సమావేశాల్లో తనను ఫోకస్ చేసుకోకుండా గ్రూపు ఫొటోలను, లాంగ్ షాట్ ఫొటోలను మీడియాకు పంపిస్తుండడం బట్టి చూస్తే, జయలలిత మీద తనకున్న విశ్వాసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అలాగే, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న జయలలిత ఫొటోల్ని తొలగించాలన్న ఆదేశాలు ఇంత వరకు ఆయన ఇవ్వకపోవడం గమనార్హం. కేవలం రోజు వారి కార్యక్రమాల మీద దృష్టి పెడుతూ ముందుకు సాగుతున్న పన్నీరు సెల్వం తన కంటూ కొన్ని ఆంక్షల్ని విధించుకున్నట్టుగా సచివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. బరువెక్కిన హృదయంతో బాధ్యతలు చేపట్టిన పన్నీరు సెల్వం సీఎం హోదాకు తగ్గ వసతులు కాకుండా, ఇది వరకు మంత్రిగా తనకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో వాటినే అనుకరిస్తూ ముందుకు వెళ్తుండడం విశేషం.
తన వాళ్లకు హెచ్చరిక: తన కంటూ కొన్ని పరిమితులు విధించుకున్న పన్నీరు సెల్వం బంధువులు, ఆప్తులకు కొన్ని హెచ్చరికలు చేశారు. తన పేరు చెప్పుకుని చెలామణి అయితే, మాత్రం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కుటుంబీకులకు సైతం ఇదే హితవు పలికినట్లు సచివాలయ వర్గాలు, అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎవరూ పాల్గొనద్దని, ఎలాంటి జోక్యం చేసుకోవద్దని చెప్పారు. రాజకీయంగా ఎలాంటి కార్యక్రమాలు వద్దు అని, ఎవరూ రాజకీయ వ్యాఖ్యలు, మీడియాతో ఏది బడితే అది మాట్లాడడం వంటి చర్యలకు పాల్పడొద్దని సూచించారు. అలాగే, కుటుంబీకుల వద్ద ఉన్న మొబైల్ ఫోన్ల కనెక్షన్లను సైతం తొలగించారు. తన పిల్లలు కూడా ఇది వరకు ఎలా వ్యవహరించే వారో, అలాగే నడచుకునే విధంగా ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం గమనించాల్సిందే.