నిన్న ప్రశంస నేడు విమర్శ
సాక్షి, చెన్నై : దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్ మద్దతు కోసం బీజేపీ అధిష్టానం తీవ్రంగానే కుస్తీలు పడుతోంది. రాష్ట్రంలోని కమలనాథులు అయితే, పొగడ్తల వర్షం కురిపించే పనిలో పడ్డారు. తన రూటే సపరేటు అని చెప్పుకొచ్చే కథానాయకుడు బీజేపీ వర్గాల పొగడ్తలకు పడిపోలేదు. ఏకంగా తనకు సీఎం అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఆఫర్ చేసినా ఖాతరు చేయలేదు. ‘‘నా దారి రహదారి.. బె టర్ డోండ్ కమ్ ఇన్ మై వే...’’ అన్నట్టుగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు పరామర్శ పేరిట మద్దతు లేఖాస్త్రం సంధించి బీజేపీ వర్గాలకు షాక్ ఇచ్చారు. అయితే, బీజేపీ పెద్దలు ఈ విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని, రజనీ తన వెంటనే అన్నట్టుగా ప్రశంసించారు. అయితే డీఎంకే వర్గాలకు, కాంగ్రెస్ నేతలకు తన అపాయింట్ మెంట్ ఇచ్చి బీజేపీ వర్గాలకు రజనీ షాక్ ఇచ్చారు.
దీంతో నిన్న మొన్నటి వరకు రజనీకాంత్‌ను స్తుతిస్తూ వ్యాఖ్యలు చేసినోళ్లు ఇప్పుడు విమర్శలకు సిద్ధమయ్యూరు. ఢిల్లీ వేదికగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ రజనీపై విమర్శ ఎక్కు బెట్టడం గమనించాల్సిన విషయం.విమర్శ: రాష్ట్ర పార్టీకి కొత్త ఇన్‌చార్జ్‌గా రాజీవ్ ప్రతాప్ రూడీ నియామకంతో ఢిల్లీకి రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ పరుగులు తీశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితుల్ని, రాష్ట్ర కమిటీ ఎంపిక వివరాలు, సర్వ సభ్యసమావేశం ఏర్పాటుకు సంబంధించిన వివరాలను ఆయనకు వివరించారు. కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కలుసుకుని ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలకు సంబంధించిన ఫిర్యాదు చేశారు. అనంతరం తమిళ మీడియా ముందుకు వచ్చిన ఆమె రాష్ట్రంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా చేపట్టనున్న కార్యక్రమాల్ని వివరించారు.
నవంబరులో పార్టీ సభ్యత్వానికి శ్రీకారం చుట్టనున్నామని, కోటి మంది సభ్యుల్ని చేర్చడం లక్ష్యంగా ముందుకు సాగనున్నామని వివరించారు. 2016లో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రజనీ రాజకీయ ప్రవేశం, బీజేపీకి మద్దతు గురించి మీడియా ప్రశ్నలు సంధించగా, ఆయన దయతో తాము పార్టీని నడపడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న వాళ్లను పెద్దోళ్లు చేసేంత సాహసం తాము చేయబోమన్నట్టుగా పరోక్ష వ్యాఖ్యలతో వ్యంగ్యాస్త్రం సంధించడం గమనార్హం. శ్రీరంగం ఉప ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలబెడతారా? అని ప్రశ్నిస్తే, చర్చించి నిర్ణయం వెల్లడిస్తామంటూనే, తాము ఎవరి దయతో ముందుకు సాగడం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండంటూ ముగించారు. అయితే, ఆమె వ్యాఖ్యల్ని రజనీ అభిమానులు ఏ మేరకు పరిగణనలోకి తీసుకుని స్పందిస్తారోనన్నది వేచి చూడాల్సిందే.