పొద్దున లేస్తే చాలు కుల, మత, వర్గ రహిత సమాజం కావాలంటూ లెక్చర్లు దంచే ‘మహానుభావుల’ను చాలా మందినే చూస్తుంటాం. అందులో ఎంత మందికి నిజంగా సమసమాజ స్థాపన పట్ల చిత్తశుద్ధి ఉందని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం చాలా కష్టం. అయితే తమిళనాడుకు చెందిన స్నేహ అనే న్యాయవాది మాత్రం ఇందుకు మినహాయింపు. మాటలకు పరిమితమై పోకుండా ఏళ్ల పాటు కృషి చేసి.. ‘నో కాస్ట్, నో రిలిజియన్’ సర్టిఫికెట్ సంపాదించి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారామె. ఎవరి హక్కులనో ప్రశ్నించేందుకు తాను ఈ సర్టిఫికెట్ పొందలేదని.. భవిష్యత్ తరాలకు కుల, మత రహిత సమాజాన్ని అందించే మహత్కార్యంలో తనకున్న బాధ్యతను ఈ విధంగా నెరవేర్చుకున్నానన్న ఆమె వ్యక్తిత్వం అందరికీ ఆదర్శనీయం.
బుధవారం సాయంత్రం నుంచి స్నేహ (35), ఆమె భర్త పార్తీబ రాజా ఫోన్ మోగుతూనే ఉంది. కొందరు స్నేహకు శుభాకాంక్షలు చెబుతుంటే.. మరికొంత మంది మాత్రం స్నేహలాగే తాము కూడా కుల, మతరహిత సమాజంలో భాగస్వామ్యం కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ‘నో కాస్ట్, నో రిలిజియన్’ సర్టిఫికెట్ పొందాడానికి అనుసరించాల్సిన విధానాల గురించి అడుగుతూ సందేహాలు తీర్చుకుంటున్నారు.
గర్వంగా ఉంది...
ఈ విషయం గురించి స్నేహ మాట్లాడుతూ... ‘నా జీవితంలోని ముఖ్య లక్ష్యం ఒకటి నెరవేరింది. నా తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్ల ప్రభావంతో చిన్ననాటి నుంచే నాలో కుల, మతాలకతీతంగా ఉండాలనే కోరిక బలపడింది. అనేక అవాంతరాల అనంతరం ఈ రోజు నా చేతిలో నో కాస్ట్, నో రిలిజియన్ సర్టిఫికెట్ ఉంది. అలా అని నేను రిజర్వేషన్‌కు వ్యతిరేకం కాదు. రిజర్వేషన్ విధానాన్ని సమర్థిస్తాను. వెనుకబడిన వర్గాలు అభివృద్ధి చెందేందుకు ఇలాంటివి అవసరం. అయితే ఇందుకు కులమో, మతమో ప్రామాణికం కాకూడదు. ఈ సర్టిఫికెట్ పొందడం ద్వారా ఎవరి హక్కులను లాక్కోవడం లేదు. సమాజ శ్రేయస్సు కోసం, వివక్షకు గురవుతున్న వ్యక్తుల హక్కులను కాపాడాలని ప్రతీ ఒక్కరికీ విఙ్ఞప్తి చేస్తున్నా. ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తుంటే 2017 నుంచి నాకు సానుకూలత లభించింది. ఇప్పుడు సర్టిఫికెట్ వచ్చింది. చాలా గర్వంగా ఉంది. కాస్ట్ సర్టిఫికెట్ ఫార్మాట్‌లోనే నా సర్టిఫికెట్ రూపొందించమని అడిగాను’ అని తిరుపత్తూరు తహశీల్దార్ టీఎస్ సత్యమూర్తి నుంచి నో కాస్ట్, నో రిలిజియన్ సర్టిఫికెట్ అందుకున్న స్నేహ తన ఉద్దేశాన్ని తెలియజేశారు.
తండ్రి చూపిన బాటలో...భర్త ప్రోత్సాహంతో
స్నేహ స్వస్థలం వేలూరు జిల్లాలోని తిరుపత్తూరు. ఆమె తండ్రి కుల, మతాలకు వ్యతిరేకం. అందుకే తన ముగ్గురు కూతుళ్లకి స్నేహ, ముంతాజ్, జెన్నిఫర్ అనే పేర్లు పెట్టారు. తండ్రి ప్రభావంతో స్నేహ కూడా తన సంతానానికి వివిధ మతాచారాలకు సంబంధించిన పేర్లు పెట్టారు. ఈ విషయంలో స్నేహ భర్త పార్తీబ రాజా ఆమెకు పూర్తి మద్దతుగా నిలిచారు.
తన పెద్ద కుమార్తెకు ‘అధిరై నస్రీన్’ అనే బుద్ధిస్టు, ముస్లిం సంప్రదాయాల కలయికకు చెందిన పేరు పెట్టడం గురించి పార్తీబ రాజా మాట్లాడుతూ.. ‘ కుల, మత రహిత సమాజం గురించి ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకే మా కూతురికి ఈ పేరు పెట్టాం. తన పేరు వినగానే ప్రతీ ఒక్కరూ మీ అమ్మానాన్నలు ముస్లింలా అని అడుగుతారు. అప్పుడు మా కూతురు మా ఇద్దరి పేర్లు చెప్పడంతో పాటుగా తనకు ఆ పేరు పెట్టడానికి గల కారణాలు, తన పేరు వెనుక ఉన్న కథను వివరిస్తుంది. ఈ రకంగా వారికి అవగాహన కలుగుతుంది. ప్రసుతం స్నేహ నో కాస్ట్, నో రిలిజియన్ సర్టిఫికెట్ పొందడం ఒక సానుకూల దృక్పథానికి నాంది. ఈ విషయం గురించి చర్చ మొదలైంది. చాలా మంది తమకు కూడా ఇలాంటి సర్టిఫికెట్ కావాలని అడుగుతున్నారు. బహుశా దేశంలోనే ఇలాంటి సర్టిఫికెట్ పొందిన తొలి మహిళ తనేనేమో. ప్రస్తుతం ఆమె సోదరీమణులు కూడా తన బాటలోనే నడిచే ప్రయత్నం చేస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు.
ప్రశంసల జల్లు
నో కాస్ట్, నో రిలిజియన్ సర్టిఫికెట్ పొందడం ద్వారా స్నేహ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘భారతీయుల్లో నిగూఢంగా ఉండే కోరికను మీరు నెరవేర్చుకున్నారు. మనకు అనవసరమైన, సంబంధం లేని విషయాలను త్యజిద్దాం. కులాన్ని పక్కన పెట్టేద్దాం’ అంటూ లోకనాయకుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, కమల్‌హాసన్ ట్వీట్ చేశారు. అదేవిధంగా సినీ నటుడు సత్యరాజ్, నటి, హక్కుల కార్యకర్త రోహిణి స్నేహను ప్రశంసించారు.
-సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్
Dear Sneha,
— Kamal Haasan (@ikamalhaasan) February 13, 2019
You have actuated a long dormant desire among Indians. Let’s discard what never belonged to us. Let’s caste away Caste. From this point, a better tomorrow will be more accessible. Bravo daughter. Lead India forward. https://t.co/tdjngFiHWl
Comments
Please login to add a commentAdd a comment