విదేశీ యువతిని వివస్త్రను చేసి..
బెంగళూరులో టాంజానియా యువతిపై దారుణం
బాధ్యులపై చర్యలకు సుష్మ ఆదేశాలు
సాక్షి, బెంగళూరు: ఓ రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి ఓ విదేశీ యువతిని నడిరోడ్డుపై వివస్త్రను చేసి స్థానికులు భౌతిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు, వారి స్నేహితులు, స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం... టాంజానియాకు చెందిన 21 ఏళ్ల యువతి స్థానిక కళాశాలలో బిజినెస్ మేనేజ్‌మెంట్ విద్యార్థిని. ఆదివారం సాయంత్రం అద్దె కారులో వెళ్తుండగా హెసరగట్టకు చేరుకోగానే అదుపుతప్పి 35 ఏళ్ల యువతికి ఢీ కొంది. దీంతో ఆమె మరణించింది. కారు నడుపుతున్న సుందరేషన్ పరారయ్యాడు.
వెనుక కూర్చున్న విద్యార్థి కిందికి దిగగానే స్థానికులు అక్కడికొచ్చి ఆగ్రహంతో దాడికి పాల్పడ్డారు. తాను చెబుతున్నది వినిపించుకోక ఆ యువతి టీ షర్టును చించి వేశారు. ఎలాగో తప్పించుకుని నెమ్మదిగా కదులుతున్న బీఎంటీసీ బస్సు ఎక్కడానికి ప్రయత్నించినా వెంటబడి రోడ్డుపై వేసి చితకబాదారు. విషయం తెలిసి సంఘటనా స్థలానికి చేరుకున్న విద్యార్థిని స్నేహితుల్లో ఒకరు బాధితురాలికి టీ షర్ట్ ఇవ్వడానికి ప్రయత్నించడంతో యువతితో పాటు ఆమెకు సాయం చేయడానికి వచ్చిన వారిపై కూడా భౌతిక దాడికి పాల్పడ్డారు.
అంతేకాకుండా యువతి ప్రయాణిస్తున్న వాహనాన్ని తగులబెట్టారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తమను రక్షించడానికి ఏమాత్రం ప్రయత్నించలేదని బాధితురాలి స్నేహితులు వాపోయారు. ఇదిలా ఉండగా ఆఫ్రికా దేశపు విద్యార్థులు తరుచూ మద్యం మత్తులో వాహనాలు నడపి ప్రాణాలమీదకు తెస్తున్నారని, తమతో ఎప్పుడూ గొడవలు పెట్టుకుంటున్నారని స్థానికులు వాపోతుండటం గమనార్హం. అయితే.. టాంజానియా హై కమిషనర్, విదేశాంగ మంత్రి సుష్మకు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన సుష్మ స్వరాజ్ కూడా కర్ణాటక సీఎం, ఇతర అధికారులతో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.