
వరదలతో కకావికలమై, తీవ్రమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కేరళ ప్రజలకు ఆపన్నహస్తం అందించేందుకు వివిధ టెక్ కంపెనీలు ముందుకొచ్చాయి. కష్టకాలంలో కేరళ వాసులను ఆదుకునేందుకు మేమున్నామంటూ ఈ కంపెనీలు, సంస్థలు తమ స్థాయిలో సహాయం అందిస్తున్నాయి. సామాజిక మాధ్యమంలో దిగ్గజాలైన గూగుల్, ఫేస్‌బుక్, ట్విటర్ మొదలుకుని, అమెజాన్,పేటీఎం, వంటి టెక్ కంపెనీలు, బిగ్‌బాస్కెట్, జొమాటో, ఓలా, ట్రూకాలర్ వంటి ఇతర కంపెనీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వివిధ సహాయాలు చేపడుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చడం, ఆహార పదార్థాల పంపిణీ, సహాయ శిబిరాల నిర్వహణ, విరాళాల సేకరణ వంటి కార్యక్రమాలకు అవసరమైన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చాయి.
గూగుల్...
గూగుల్ సంస్థ ‘పర్సన్ ఫైండర్ టూల్’ ను యాక్టివేట్ చేసింది.ఈ టూల్‌లో యూజర్లు కనిపించకుండా పోయిన వారి వివరాలు నింపవచ్చు లేదా ఎవరి జాడ అయినా తెలిస్తే వారికి సహాయపడేలా ఏర్పాటుచేశారు. గూగుల్ వెబ్‌సైట్ ద్వారా ఈ టూల్ అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ‘ప్లస్ కోడ్’ ఫీచర్ ద్వారా పది నుంచి 11 డిజిటల్ కోడ్‌లను వరద బాధితుల రక్షకులకు పంపించవచ్చు. వరదల్లో చిక్కుకున్న వారి జాడ తెలియజేసి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇది దోహదపడుతోంది. గూగుల్ మ్యాప్‌లో వారి జాడను కనుక్కున్నాక, వారి చిరునామా కూడా డిస్‌ప్లే అవుతుంది. కేరళ వరదల సందర్భంగా గూగుల్ మ్యాప్స్ లొకేషన్, ఆఫ్‌లైన్‌లోనూ కోడ్‌ను ఎస్సెమెస్ ద్వారా లేదా ఏదైనా నెంబర్‌కు కూడా ఫోన్ చేసి చెప్పవచ్చు. ఆన్‌లైన్‌లో షేర్ చేయాలంటే ప్లస్‌కోడ్ ఎంటర్‌చేసి నగరం పేరును గూగుల్ మ్యాప్స్ లేదా సెర్చ్ యాప్‌లోని సెర్చ్ బాక్స్ క్లిక్ చేయవచ్చు. గూగుల్ మ్యాప్స్‌లో సహాయ శిబిరాలు, ఆహారం, నీరు, మందులు, ఇతర నిత్యావసరాలు, వాలంటీర్లు, అంబులెన్స్‌లు, జీప్‌ల ద్వారా రెస్క్యూకు సంబంధించిన కేంద్రాలను గుర్తించేలా వాటిని పిన్ చేశారు.
ఫేస్‌బుక్...
యూజర్లు తాము సురక్షితంగా ఉన్నామా లేదా ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఫేస్‌బుక్ లైవ్ ‘సేఫ్టీ చెక్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. వరదలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారాన్ని ఒకచోట అందుబాటులోకి వచ్చేలా ‘క్రైసిస్ రెస్పాన్స్ పేజీ’ క్రియేట్ చేసింది. ఈ పేజీలోని విపత్తు విరాళాల మీట ద్వారా 487 మంది విరాళాలిచ్చినట్టు ఆ సంస్థ తెలియజేసింది. సహాయకార్యక్రమాల్లో నిమగ్నమైన ‘గూంజ్’ అనే స్వచ్ఛందసంస్థ ద్వారా రూ. 1.75 కోట్ల మేర ఫేస్‌బుక్ విరాళాలు అందజేసింది. భారత్‌లో 20 కోట్లకు పైగా యూజర్లున్న గూంజ్ లేదా సీఎండీఆర్‌ఎఫ్‌ల ద్వారా విరాళాలు అందజేయాల్సిందిగా ఫేస్‌బుక్ సూచిస్తోంది.
అమెజాన్ ఇండియా...
ఆక్స్‌ఫామ్, వరల్డ్ విజన్ ఇండియా, హాబిటాట్ ఫర్ హ్యుమానిటీ, గూంజ్, తదితర స్వచ్ఛందసంస్థల భాగస్వామ్యంతో అమెజాన్ ఇండియా సంస్థ పనిచేస్తోంది. ఈ సంస్ధ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ఎన్జీవోల జాబితాలోంచి మనకిష్టమైన దాన్ని ఎన్నుకుని, దాని ద్వారా ఏయే వస్తువులు విరాళం అందజేయాలనుకుంటున్నారో తెలియజేయవచ్చు. దానికి అయినా బిల్లును చెల్లించాక దానిని ఎవరికి పంపాలో చిరునామా పేర్కొనాలి. అమెజాన్‌తో పాటు ఆయా ఎన్జీవో సంస్థలు విరాళాలుగా పంపిస్తున్న వస్తువులు ఎంపికచేసిన సహాయశిబిరాలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నాయి.
పేటీఎమ్...
కేరళ వరద సహాయం కోసం చేసే విరాళాలను నేరుగా సీఎండీఆర్‌ఎఫ్ ఖాతాకే పంపించేలా పేటీఎమ్ ఓ బటన్‌ను యాక్టివేట్ చేసింది. మొబైల్ ఫోన్లలో ఈ యాప్ లేటెస్ట్ వర్షన్ యాక్టివేట్ చేసుకుంటే హోమ్‌పేజీలోనే విరాళాల బటన్‌ను గమనించవచ్చు.
ట్విటర్...
కేరళ ఫ్లడ్స్, కేరళ ఫ్లడ్ 2018 తదితర హ్యాష్‌ట్యాగ్‌లను ట్విటర్ వరద సహాయక కార్యక్రమాలకు ఉపయోగిస్తోంది. వరదల వల్ల ప్రభావితమైన వాళ్లు ఈ హ్యాష్‌ట్యాగ్‌ల ద్వారా ఉపయుక్తమైన సమాచారాన్ని పొందవచ్చు.
జొమాటో...
వరద బాధితులకు ఆహారాన్ని అందించేందుకు ‘అక్షయపాత్ర’ ఫౌండేషన్‌తో జొమాటో కలిసి పనిచేస్తోంది. ముగ్గురు, ఆరుగురు లేదా పదిమందికి వెజ్, నాన్‌వెజ్ ఆహారాన్ని యూజర్లు పంపించేందుకు వీలుగా జొమాటో ఆర్డర్ ఫుడ్ ఆన్‌లైన్ సెక్షన్‌లో హెల్ప్ కేరళ బ్యానర్‌ను యాక్టివేట్ చేసింది. ఆహారాన్ని పంపించే మనుషుల సంఖ్యను బట్టి రూ.90–300 వరకు చెల్లించేందుకు వీలు కల్పించారు. ఒకవేళ ఆ యాప్‌లో హెల్ప్‌కేరళ బ్యానర్ కనిపించకపోతే అంగమలి, కొచ్చికి యూజర్ల లొకేషన్‌ను మార్చుకుంటే ఆ పేజీని చూడవచ్చు.
ట్రూకాలర్...
పేటీఎమ్ మాదిరిగానే ట్రూకాలర్ కూడా తన ప్లాట్‌ఫామ్‌ను సీఎండీఆర్‌ఎఫ్‌కు లింక్ చేసింది. ట్రూకాలర్ పే యాప్ ద్వారా యూజర్లు విరాళాలు పంపించే వీలు కల్పించింది. అందుకోసం ముందుగా యూజర్లు తమ బ్యాంక్ ఖాతాను యూపీఐడీకి లింక్ చేసుకోవాలి.
బిగ్‌బాస్కెట్...
బిగ్‌బాస్కెట్ కూడా ‘గూంజ్’ స్వచ్ఛందసంస్ధ ద్వారా కలిసి సహాయకార్యక్రమాలు చేపడుతోంది. వరద బాధితుల కోసం ఆయా వస్తువులు, పదార్థాలను ఆన్‌లైన్‌లో యూజర్లు కొనుగోలు చేస్తే వాటిని ఈ సంస్థ ద్వారా చేరవేస్తోంది. అయిదురకాల నిత్యావసర వస్తువులతో కూడిన ప్యాకెట్లను తయారుచేసిన బిగ్‌బాస్కెట్ ,వాటిని యూజర్లు కొనుగోలు చేసి కేరళ వరదబాధితులకు సహాయంగా అందించేందుకు సహాయపడుతోంది.
ఎయిర్‌టెల్, ఐడియా ఇతర టెల్కోలు...
కేరళలోని ప్రీపెయిడ్ కస్టమర్లకు డేటా, కాల్ ప్రయోజనాలు కల్పిస్తూ ఎయిర్‌టెల్, జియో, ఐడియా, ఇతర టెలికాం కంపెనీలు చర్యలు తీసుకున్నాయి. పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు బిల్లు చెల్లించే సమయాన్ని పొడిగించి, వారికందించే సేవల్లో అంతరాయం ఏర్పడకుండా చూస్తున్నాయి. ఐడియా వినియోగదారులు ‘1948’ సర్వీసును ఉపయోగించి ఎస్‌ఎంఎస్ ద్వారా జాడ తెలియకుండా పోయిన వారు చివరిసారి ఎక్కడున్నారో తెలుసుకునే వీలు కల్పించింది. ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రూ.10 ఎమర్జెన్సీ టాక్‌టైమ్ క్రెడిట్ చేస్తోంది. దీనిద్వారా ఏడురోజుల పాటు 1 జీబీ డేటాను పొందవచ్చు. ఎయిర్‌టెల్, జియో, బీఎస్‌ఎన్‌ఎల్, వొడాఫోన్ కూడా ఇలాంటి ప్రోత్సాహకాలనే ప్రకటించాయి.
Comments
Please login to add a commentAdd a comment