అలప్పుజా జిల్లాలో పంపా నది ఉధృతికి నీట మునిగిన ఇళ్లు , నెల్లియంపట్టి గ్రామస్థులకు సహాయక సామగ్రిని అందజేస్తున్న వైమానికదళ సభ్యులు ,ఎర్నాకుళంలో నీటమునిగిన ఇంట్లోంచి వృద్ధురాలిని బోటులోకి చేరుస్తున్న సైనికుడు
తిరువనంతపురం : వరద ఉగ్రరూపానికి అతలాకుతలమై పునరావాసం కోసం ఎదురుచూస్తున్న కేరళ కోలుకునేందుకు అన్ని వైపుల నుంచి సాయం వెల్లువెత్తుతోంది. కేంద్రం, ఇతర రాష్ట్రాలు, కార్పొరేట్ సంస్థలే కాకుండా వ్యక్తిగతంగా భారీ ఎత్తున ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఇతర దేశాలు సైతం తమ వంతు చేయూతనిస్తున్నాయి. మలయాళ సీమను ఆదుకుంటామని ఇప్పటికే ప్రకటించిన యూఏఈ తన మాట నిలబెట్టుకుంటూ రూ. 700 కోట్ల సాయాన్ని ప్రకటించింది.
కేరళకు ప్రకటించిన రూ. 600 కోట్ల మధ్యంతర సాయాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. నౌకలు, రైళ్ల ద్వారా పెద్ద ఎత్తున సహాయ సామగ్రి కేరళ చేరుకుంటున్నాయి. దాదాపు 231 మంది(ఆగస్టు నెలలో) ప్రాణాల్ని బలితీసుకోవడంతో లక్షలాది మందిని నిరాశ్రయుల్ని చేసిన ఈ పెను విషాదం నుంచి బయటపడేందుకు మరింత సాయం అందించాలని కేంద్రానికి కేరళ మంగళవారం విజ్ఞప్తి చేసింది.
దారుణంగా దెబ్బతిన్న రాష్ట్ర పునర్నిర్మాణం కోసం రూ. 2,600 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరింది. ముంపులో చిక్కుకున్న చివరి వ్యక్తిని కాపాడేంత వరకూ సహాయ చర్యలు కొనసాగిస్తామని కేరళ ప్రభుత్వం, ఆర్మీ ప్రకటించాయి. ఓనం వేడుకల్ని కేరళ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయగా.. పంపా నది పరిసరాల్లో వరద బీభత్సం దృష్ట్యా భక్తులు ఓనం పూజల కోసం శబరిమలకు రావద్దని దేవస్థానం సూచించింది.
ప్రధాని మోదీకి యూఏఈ క్రౌన్ ప్రిన్స్ ఫోన్
కేరళకు ప్రకటించిన రూ. 600 కోట్ల సాయాన్ని కేంద్రం మంగళవారం విడుదల చేసింది. అలాగే వరద బాధితుల కోసం రాష్ట్రానికి దిగుమతి చేసుకునే సహాయ సామగ్రిపై కస్టమ్స్ పన్ను, ఐజీఎస్టీని రద్దు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ(ఎన్‌సీఎంసీ) భేటీ అనంతరం ఈ ప్రకటన వెలువడింది. కేరళకు ప్రధాని మోదీ రూ. 500 కోట్ల సాయం ప్రకటించగా.. హోం మంత్రి రాజ్‌నాథ్ రూ. 100 కోట్ల సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కేరళకు 100 మిలియన్ డాలర్లు(రూ. 700 కోట్లు) సాయం చేస్తామని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వాగ్దానం చేసిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ తెలిపారు.
ప్రధాని మోదీకి యూఏఈ క్రౌన్ ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్ జయేద్ ఫోన్ చేసి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం సాయం చేస్తామని హామీనిచ్చారని చెప్పారు. విజయన్ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన రాష్ట్ర కేబినెట్.. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద కేరళను కేంద్రం ఆదుకోవాలని అభ్యర్థించింది. కేరళలో మొత్తం రూ. 20 వేల కోట్ల నష్టం జరిగిందని ఇంతకుముందే విజయన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వరద విలయం మిగిల్చిన నష్టంపై చర్చించేందుకు ఆగస్టు 30న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని ఆయన ట్వీట్ చేశారు.
‘రాష్ట్రంలోని 14 జిల్లాలకు గాను 13 దారుణంగా నష్టపోయాయి. వాటి పునర్నిర్మాణం కోసం బహిరంగ మార్కెట్‌లో రుణం తీసుకునే సామర్థ్యాన్ని పెంచాలని కేంద్రాన్ని కోరతాం. ప్రస్తుత పరిమితి ప్రకారం.. స్థూల రాష్ట్ర ఉత్పత్తి(జీఎస్‌డీపీ)లో 3 శాతం మేర రుణాలు తీసుకునేందుకు కేరళకు అనుమతుంది. దానిని 4.5 శాతంగా పెంచితే అదనంగా బహిరంగ మార్కెట్‌లో రూ. 10,500 కోట్లను సేకరించే అవకాశముంటుంది’ అని చెప్పారు. అలాగే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ వ్యవసాయ రుణాల చెల్లింపుపై ఏడాదికాలం మారటోరియం ప్రకటించాలని నిర్ణయించింది.
ఇంకా జలదిగ్బంధంలో నాలుగు జిల్లాలు
కేరళలో 10 లక్షల మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటుండగా.. వారిలో 2.12 లక్షల మంది మహిళలు, లక్ష మంది 12 ఏళ్లలోపు చిన్నారులు ఉన్నారు. కాగా మే 30 నుంచి ఇంతవరకూ వర్షాలు, వరదలతో కేరళలో 373 మంది మరణించారని జాతీయ విపత్తు నిర్వహణ విభాగం(ఎన్‌డీఎంఏ) ప్రకటించింది. 87 మంది గాయపడగా.. 32 మంది ఆచూకీ తెలియడం లేదని, మొత్తం 54.11 లక్షల మందిపై వరద ప్రభావం పడిందని వెల్లడించింది. ఒక్క ఆగస్టు నెలలో 231 మంది ప్రాణాలు కోల్పోయారు.
గత రెండు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టినా.. ఎర్నాకులం, త్రిస్సూర్, పతనంతిట్ట, అలప్పుజా, కొల్లాం జిల్లాల్లో చాలా ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధలోనే ఉన్నాయి. వరద ముంపులో చిక్కుకున్నవారిని దాదాపుగా రక్షించినా.. చివరి వ్యక్తిని కాపాడేంత వరకూ సహాయక చర్యలు ఆగవని రాష్ట్ర ప్రభుత్వం, రక్షణ బలగాలు తెలిపారు. గత ఐదు రోజుల్లో మొత్తం 1.63 లక్షల మందిని కాపాడారు.
వరదలతో దెబ్బతిన్న ఇళ్ల శిథిలాలను, చెత్తను తొలగించడం సహాయక సిబ్బందిగా సవాలుగా మారింది. అంటు వ్యాధుల వ్యాప్తిని అడ్డుకునేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తినేందుకు సిద్ధంగా ఉన్న ఆహారపదార్థాలు, వైద్యులు, నర్సులు కేరళకు ఇప్పుడు ఎంతో అవసరమని కేంద్ర మంత్రి కేజే అల్ఫోన్స్ విజ్ఞప్తి చేశారు. దెబ్బతిన్న ఇళ్ల పునర్నిర్మాణం కోసం ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, కార్పెంటర్స్ తదితర నిపుణులు అవసరముందని అన్నారు.
ఓనం వేడుకలు రద్దు
కేరళ ప్రజలు ఏటా ఎంతో అట్టహాసంగా జరుపుకునే ఓనం పండుగ సంబరాలు వరదలకు ఆవిరైపోయాయి. ఓనం సందర్భంగా ఆగస్టు 25న నిర్వహించే అన్ని కార్యక్రమాల్ని ప్రభుత్వం, వివిధ సంస్థలు రద్దు చేశాయి. పండుగ కోసం సేకరించిన నిధుల్ని వరద సాయం కోసం వెచ్చించనున్నారు. బక్రీద్‌ను సాదాసీదాగా జరుపుకోనున్నారు. ‘ఏం మిగల్లేదు.. మొత్తం పోగొట్టుకున్నాం. ఎదురుచూసేందుకు ఇంకేముంది. నా కొడుకు జబ్బుపడ్డాడు.
వరదల్లో ఇల్లు కొట్టుకుపోయింది. ఈ క్యాంపు నుంచి నా కొడుకు, కోడలు, మనవడితో ఎక్కడికెళ్లాలో తెలియడం లేదు’ అని అమ్మిణి(55) ఏడుస్తూ చెప్పింది. పంపా నదిలో వరద తగ్గుముఖం పట్టనందున ఓనం పండుగ సందర్భంగా శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్లవద్దని భక్తులకు అధికారులు సూచించారు.
అలాగే పంపా పరిసర ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయని, గుడికి వెళ్లే దారిలో అనేక చెట్లు నేలకూలాయని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు పేర్కొంది. శబరిమల దారి మొత్తం బురదతో నిండిపోయిందని, అందువల్ల కొండ ఎక్కడం చాలా ప్రమాదకరమని తెలిపింది. ఓనం పూజల కోసం ఆలయాన్ని ఆగస్టు 23న తెరిచి ఆగస్టు 28 మూసివేస్తారు. మరోవైపు, జమ్మూ కశ్మీర్ బ్యాంకు ఉద్యోగులు కేరళకు రూ. 11 కోట్ల సాయం ప్రకటించారు.
అన్ని వైపుల నుంచి చేయూత
కేరళ విజ్ఞప్తి మేరకు కేంద్ర ఆహార, ప్రజా సరఫరా విభాగం 89,540 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇచ్చేందుకు ఓకే చెప్పింది.వినియోగదారుల వ్యవహారాల శాఖ మరో 100 మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాల్ని పంపగా మరిన్ని నిల్వలు పంపేందుకు రెడీఅవుతోంది. రైల్వే 24 లక్షల లీటర్ల మంచినీటిని, 2.7 లక్షల వాటర్ బాటిల్స్‌ను పంపింది. మరో 14 లక్షల లీటర్ల నీటిని ఎర్నాకులం రైల్వే స్టేషన్ నుంచి సరఫరాకు ఏర్పాట్లు చేస్తోంది. రైళ్ల రాకపోకల్ని పునరుద్ధరించడంతో అన్ని రాష్ట్రాల నుంచి కేరళకు ఉచితంగా రైల్వే శాఖ సరకులను చేరవేస్తోంది.
కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే కోటి క్లోరిన్ మాత్రల్ని పంపింది. అదనంగా 3 కోట్ల మాత్రల్ని పంపనుంది. 30 టన్నుల బ్లీచింగ్ పౌడర్, 1.76 లక్షల శానిటరీ న్యాప్కిన్లు కేరళ చేరాయి. ట్యుటికొరిన్ పోర్టు నుంచి సహాయ సామగ్రితో మంగళవారం ఒక నౌక చేరుకుంది. ఇప్పటికే 50 వేల మెట్రిక్ టన్నుల పెట్రోలు, డీజిల్‌తో ముంబై పోర్టు నుంచి ఒక నౌక కేరళ చేరుకోగా ఐఎన్‌ఎస్ దీపక్ నౌక 800 మెట్రిక్ టన్నుల మంచినీళ్లు, 18 టన్నుల నిత్యావసరాలతో కొచ్చి పోర్టుకు చేరింది.
యూఏఈ సాయం నిరాకరణ?
కేరళలో పునరావాసం కోసం యూఏఈ ప్రభుత్వం ప్రకటించిన రూ. 700 కోట్ల సాయాన్ని కేంద్రం నిరాకరించే వీలుందని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. ‘ప్రస్తుతం కేంద్రం విదేశాల నుంచి ఆర్థిక సాయాన్ని అంగీకరించట్లేదు. యూఏఈ సాయానికీ అదే వర్తిస్తుంది’ అని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
విదేశాల్లోని భారతీయులు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు పంపవచ్చని.. వాటిపై ఎలాంటి పన్ను ఉండదని విదేశాంగశాఖ వివరణిచ్చింది. ‘విదేశీ సాయం నియంత్రణ చట్టం(ఎఫ్‌సీఆర్‌ఏ) కింద గుర్తింపు పొందిన లాభాపేక్ష లేని సంస్థలు, ఎన్జీవోలకు విదేశీ సాయం అందితే వాటిపై పన్ను ఉండదు. గుర్తింపు లేని ఎన్జీవోలకు నిధులు అందితే మాత్రం వాటిపై పన్ను చెల్లించాలి’ అని విదేశాంగ శాఖ అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment