వ్యక్తిగత విషయాలు భార్య షేర్ చేసిందని..
పూణె:
సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలు షేర్ చేసిందని విచక్షన కోల్పోయిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ భార్యను హత్య చేసి ఆ తర్వాత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హడాస్పుర్ సమీపంలో మంజ్రీ బడ్రక్లోని శివ్ పార్క్ అపార్ట్ మెంట్లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రాకేష్ గంగుర్డే(34) తన భార్య సోనాలీ(28)కి మధ్య గత కొన్ని రోజులుగా వాగ్వాదం నడుస్తోందని సూసైడ్ నోట్లో వెల్లడించాడు. తమ వివాహానికి సంబంధించిన సమాచారంతోపాటూ, వ్యక్తిగత విషయాలను ఫేస్ బుక్ ఫ్రెండ్స్కి సోనాలి షేర్ చేసినట్టు రాకేష్ తెలిపాడు.
నాసిక్ జిల్లాలోని సతనా తాలుకాకు చెందిన వీరి వివాహం నాలుగేళ్ల కింద జరిగింది. వారికి ఇంకా సంతానం కలుగలేదు. ఆమ్మ నుంచి సోనాలీ ఫోన్ కలవడంలేదని బుధవారం సాయంత్రం సమాచారం వచ్చిందని బనెర్లో నివసించే సోనాలీ సోదరుడు హర్ష పవార్ పోలీసులకు తెలిపారు. తాను కూడా ఎంత ప్రయత్నించినా ఫోన్ ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో గురువారం ఫ్లాట్కి వెళ్లానని చెప్పారు. డోర్ కొట్టినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. పోలీసులు తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లేసరికి ఇద్దరి మృతదేహాలు కనిపించాయి.
వివాహబంధం సాఫీగా కొనసాగే సమయంలోనే సోనాలీ కుటుంబనియంత్రణకు సంబంధించి వ్యక్తిగత విషయాలను కూడా తన స్నేహితులతో షేర్ చేసుకున్న విషయాన్ని రాకేష్ గమనించాడు. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయని అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ కిరణ్ లోందే తెలిపారు.
రాకేష్ గొంతునులిమి సోనాలిని హత్య చేసి, అనంతరం నైలాన్ తాడుతో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని లోందే పేర్కొన్నారు. మరాఠిలో రాకేష్ రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రాకేష్ పై సోనాలీ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఇంతకు ముందు వారిరివురి మధ్య ఎలాంటి గొడవలు జరగలేదని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యాంతమయ్యారు. మృతదేహాలను పోస్ట్ మార్టం అనంతరం ఇరువురి కుటుంబసభ్యులకు అప్పగించారు.