
పట్నా : బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నికల ప్రచార సభలో మాట్లాడేందుకు తనకు అవకాశం దొరకని కారణంగా తండ్రిని గుర్తు చేసుకుని ఉద్వేగానికి గురయ్యారు. బిహార్‌లో కాంగ్రెస్, ఆర్జేడీ ఇతర పార్టీలతో కలిసి మహాఘట్ బంధన్ పేరిట కూటమిగా ఏర్పడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం రాహుల్ గాంధీ తమ పార్టీ అభ్యర్థి శత్రుఘ్న సిన్హాతో కలిసి పాటలీపుత్రలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్జేడీ నేతలు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ కూడా హాజరయ్యారు. అయితే తేజ్ ప్రతాప్‌కు మాత్రం మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.
ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన తేజ్ ప్రతాప్.. ‘ మా నాన్న గారు నాతో పాటు లేకపోవడం వల్ల ఈరోజు మాట్లాడేందుకు నాకు అవకాశం దొరకలేదు. మిస్ యూ పప్పా’ అంటూ ట్వీట్ చేశారు. ఈ విషయం గురించి తేజస్వీని ప్రశ్నించగా తనకు తెలియదన్నారు. సమయం లేకపోవడం వల్లే బహుశా తన సోదరుడికి అవకాశం రాకపోయి ఉండవచ్చునన్నారు. కాగా గత కొంత కాలంగా తేజ్ ప్రతాప్, తేజస్వీల మధ్య విభేదాలు వచ్చాయంటూ వార్తలు ప్రచారమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తేజ్ ప్రతాప్ ఇటీవలే ఆర్జేడీ విద్యార్థి విభాగం నుంచి వైదొలిగారు. అంతేకాకుండా లాలూ- రబ్రీ మోర్చా పేరిట సొంత పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. భార్య ఐశ్వర్యా రాయ్‌తో విడాకుల విషయంలో కూడా కుటుంబ సభ్యులతో తేజ్ ప్రతాప్ విభేదించారు. ఇక లాలూ ప్రసాద్ ప్రస్తుతం దాణా కుంభకోణం కేసులో రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.
मेरे आदरणीय पिता के अनुपस्थिति की वजह से मुझे आज बोलने नहीँ दिया गया।#IMissYouPapa😭😭 pic.twitter.com/w5F6uIzckb
— Tej Pratap Yadav (@TejYadav14) May 16, 2019
Comments
Please login to add a commentAdd a comment