తేజ్, ఐశ్వర్యల నిశ్చితార్థం
పాట్నా : ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహం మరో రెండు రోజుల్లో జరుగబోతోంది. ఆర్‌జేడీ శాసనసభ్యుడు చంద్రికా రాయ్ కూతురు ఐశ్వర్య రాయ్‌ను ఆయన మనువాడబోతున్నారు. ఈ పెళ్లి వేడుకలో భాగంగా బుధవారం రాత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌కు మెహందీ వేడుక నిర్వహించారు. సాధారణంగా అమ్మాయిలకు నిర్వహించే ఈ మెహందీ వేడుకను, తేజ్ ప్రతాప్‌కు నిర్వహించడం విశేషం. ఈ ఇరువురి వివాహం మే 12న పాట్నా వెటరినరీ కాలేజీ గ్రౌండ్స్‌లో అంగరంగ వైభవంగా జరుగనుంది.
కొడుకు పెళ్లి కోసం ప్రస్తుతం జైలులో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఐదు రోజుల పెరోల్ లభించింది. గతం వారం క్రితమే లాలూ ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి, రాంచి జైలుకి వెళ్లారు. గత నెల 19న తేజ్, ఐశ్వర్యల నిశ్చితార్థం మౌర్య హోటల్‌లో సుమారు 200 మంది అతిథుల మధ్య ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి లాలూ జైలులోనే ఉన్నారు.
మే 12న జరుగబోతున్న ఈ వివాహానికి వందల మంది వీవీఐపీలు హాజరు కాబోతున్నారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బిహార్ సీఎం నితీష్ కుమార్, ఆయన మంత్రి వర్గ సభ్యులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించినట్టు సన్నిహిత వర్గాలు చెప్పాయి. తేజ్‌ను మనువాడబోతోన్న ఐశ్వర్య బీహార్ మాజీ సీఎం దరోగా ప్రసాద్ రాయ్ మనవరాలు. ఆమె తండ్రి చంద్రికా రాయ్, బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. పాట్నాలోనే హైస్కూల్ వరకు చదువుకున్న ఐశ్వర్య.. తర్వాత ఉన్నత చదువులు మొత్తం ఢిల్లీలో పూర్తి చేసింది. అయితే తేజ్ ప్రతాప్ 12వ తరగతి చదివారు.
Comments
Please login to add a commentAdd a comment