పట్నా: ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ విడాకుల వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. తేజ్ ప్రతాప్ భార్య ఐశ్వర్యారాయ్ తండ్రి, ఆర్జేడీ నేత చంద్రికా రాయ్ లాలూ కుటుంబంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ఇబ్బంది పెట్టేందుకు ఇంటికి బాంబులు పంపించేరేమో అని వియ్యంకుల తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఐశ్వర్య అత్తింటి నుంచి వచ్చిన వస్తువులను తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. కాగా తనకు విడాకులు కావాలంటూ తేజ్ ప్రతాప్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పట్నా ఫ్యామిలీ కోర్టులో నమోదైన విడాకుల కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.
ఈ క్రమంలో అత్తింటి వారు తనను తీవ్రంగా హింసించి ఇంటి నుంచి గెంటివేశారని ఐశ్వర్యారాయ్ తన అత్త రబ్రీదేవిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా పెళ్లి సమయంలో తమ కూతురికి ఇచ్చిన ఖరీదైన కానుకలు, వస్తువులు తిరిగి ఇచ్చేయాలంటూ ఐశ్వర్య తల్లి పూర్ణిమా దేవి... వుమన్ హెల్‌్పలైన్ ద్వారా వియ్యంపురాలు రబ్రీదేవికి నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలో లాలూ నివాసం నుంచి రెండు వ్యాన్లు సామాన్లతో గురువారం ఐశ్వర్య పుట్టింటికి చేరుకున్నాయి. అయితే ఐశ్వర్య తండ్రి చంద్రికా రాయ్ మాత్రం వాటిని అన్‌లోడ్ చేయనివ్వలేదు. దీంతో రెండు వాహనాలు రాత్రంతా అక్కడే ఉండిపోయాయి.(‘జుట్టుపట్టి ఈడ్చుకొచ్చి.. ఫోన్ లాక్కొన్నారు’)
ఈ విషయం గురించి చంద్రికా రాయ్ మాట్లాడుతూ... ‘చట్ట ప్రకారం మెజిస్ట్రేట్, పోలీసుల ముందు ఆ సామాన్లను ప్యాక్ చేయాల్సి ఉంటుంది. అలా వాళ్లకు వాళ్లే పంపిస్తే వాటిని నేనెందుకు స్వీకరించాలి. మాకు హాని చేసేందుకు అందులో మద్యం బాటిళ్లు, పేలుడు పదార్థాలు పెట్టారేమో అని లాలూ కుటుంబంపై సందేహం వ్యక్తం చేశారు. ఇక చంద్రికా రాయ్ వ్యాఖ్యలపై లాలూ కుమార్తె, ఎంపీ మిసా భారతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టప్రకారమే తాము సామాన్లను వెనక్కి పంపామని.. అయితే చంద్రికా రాయ్ మాత్రం పబ్లిసిటీ కోసం చిల్లరగా ప్రవర్తిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా బిహార్ మాజీ సీఎం దరోగా రాయ్ మనుమరాలైన ఐశ్వర్యరాయ్‌తో గతేడాది మే 12వ తేదీన తేజ్ ప్రతాప్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే అనతికాలంలోనే వీరి కాపురంలో కలతలు చెలరేగడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.
తండ్రి చంద్రికా రాయ్‌తో ఐశ్వర్యా రాయ్(ఫైల్ ఫొటో)
Comments
Please login to add a commentAdd a comment