
పట్నా : ఆర్జేడీ చీఫ్, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా పార్టీ కార్యాలయాన్ని రెజ్లింగ్ రింగ్‌గా మార్చారు. ఈనెల 26న పట్నాలోని పార్టీ కార్యాలయంలో తేజ్ ప్రతాప్, ఆయన సన్నిహితులు దంగల్ (కుస్తీ పోటీ)ను నిర్వహించారు. కుస్తీ పోటీల సంగతి బయటకు పొక్కడంతో స్ధానిక రెజ్లర్లు సైతం ఆయనను కలిసేందుకు ఆర్జేడీ కార్యాలయానికి చేరుకున్నారు.
తేజ్‌ప్రతాప్ కోరిక మేరకు ఆయన మద్దతుదారులు పార్టీ కార్యాలయంలో అప్పటికప్పుడు కుస్తీ పోటీలకు ఏర్పాట్లు చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ పోటీల సందర్భంగా ఐదుగురు స్ధానిక రెజ్లర్లు ఒకరి తర్వాత మరొకరు కుస్తీలో తమ నైపుణ్యాలను ఆర్జేడీ నేత ఎదుట ప్రదర్శించారు. రెజ్లర్స్‌తో తలపడాలని ఈ సందర్భంగా తేజ్ ప్రతాప్ తన మద్దతుదారులను, ఆర్జేడీ కార్యకర్తలను కోరడం విశేషం.
అయితే స్ధానిక రెజ్లర్ల సవాల్‌ను స్వీకరించేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. రెజ్లర్ల దంగల్‌ను ఆసాంతం ఆస్వాదించిన తేజ్ ప్రతాప్ వారిని రూ 5000 నగదు బహుమతితో సత్కరించారు. రెజ్లర్లు తమ కుటుంబాలను పోషించుకునేందుకు వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేందుకు కృషిచేస్తానని వారికి హామీ ఇచ్చారు. భార్య ఐశ్వర్యా రాయ్‌తో విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన తేజ్ ప్రతాప్ గతంలో శ్రీకృష్ణుడి వేషంలో కనిపించడంతో పాటు పట్నా వీధుల్లో సైకిల్‌పై సవారీ చేస్తూ కెమెరామెన్‌ల కంటపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment