బెంగళూరు: పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్ మరో ఘనత సాధించింది. గాల్లో ప్రయాణిస్తూనే ఐఏఎఫ్ ఐఎల్78 అనే ట్యాంకర్ విమానం నుంచి 1,900 కేజీల ఇంధనాన్ని నింపుకుంది. దీంతో యుద్ధ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపగలిగే సామర్థ్యం ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది. భూమికి 20,000 అడుగుల ఎత్తులో తేజస్(ఎస్‌ఎస్పీ8) యుద్ధవిమానం రష్యన్ తయారీ ఐఎల్–78 ఎంకేఐ ఆయిల్ ట్యాంకర్ విమానం నుంచి 1,900 కేజీల ఇంధనాన్ని నింపుకుంది.
గంటకు 500 కి.మీ వేగంతో దూసుకుపోతూ తేజస్ ఈ ఫీట్‌ను సాధించింది. ఇటీవల ట్యాంకర్ విమానంతో డాకింగ్(గాల్లో అనుసంధానం కావడం) ప్రక్రియను పూర్తిచేసిన తేజస్ తాజాగా ఇంధనాన్ని నింపుకుని చరిత్ర సృష్టించింది. దీంతో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్) అభివృద్ధి చేసిన ఈ ఫైటర్ జెట్‌కు ఫైనల్ ఆపరేషనల్ క్లియరెన్స్(ఎఫ్‌ఓసీ) జారీచేసేందుకు మార్గం సుగమమైంది. 123 తేజస్ మార్క్–1 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత వాయుసేన(ఐఏఎఫ్) గతేడాది డిసెంబర్‌లో హాల్‌కు రూ.50,000 కోట్ల విలువైన ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment