రాజ్యాంగ ఉల్లంఘనే
ఎంసెట్ విషయంలో టీ సర్కారు మొండి వైఖరి
కేంద్రానికి ఏపీ అఖిలపక్షం నేతలు ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ: ఎంసెట్ అడ్మిషన్లును జాప్యం చేయడంతో పాటు, స్థానికతను నిర్ధారించేందుకు 1956 సంవత్సరాన్ని కటాఫ్ డేట్‌గా పెట్టి తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని ఆంధ్రప్రదేశ్ అఖిలపక్ష నేతలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014కు పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ మంత్రుల ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు బుధవారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతీ ఇరానీ, హోంశాఖ కార్యదర్శిలను కలిసి ఎంసెట్ అడ్మిషన్లు, 1956 కటాఫ్ అంశాలపై నెలకొన్న వివాదాన్ని తెలియచేశారు.
అనంతరం ఏపీభవన్‌లో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు మీడియాతో మాట్లాడారు. ఎంసెట్ అడ్మిషన్లు, 1956 కటాఫ్ తేదీ అంశాలపై త్వరలోనే పరిష్కారాన్ని చూపుతామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారని తెలిపారు. అఖిలపక్ష ప్రతినిధి బృందంలో టీడీపీతో పాటు వైఎస్సార్‌సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి, బుట్టారేణుకా, బీజేపీ ఎంపీ హరిబాబు, వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌లు పాల్గొన్నారని చెప్పారు.