30 వేల కోట్లివ్వండి
► ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలంటూ ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి
► కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వండి
► ‘భగీరథ’కు 10 వేల కోట్లు కేటాయించండి
► ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి సడలించండి
► ప్రధాని నివాసంలో భేటీ
► ఎన్టీపీసీ యూనిట్ శంకుస్థాపనకు ఆహ్వానం
► మార్చి తొలి వారంలో వస్తానన్న ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి భారీ ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడుతున్నామని.. వాటి కోసం భారీగా నిధులు అవసరమైనందున రాష్ట్రానికి రూ. 30,571 కోట్లు ప్రత్యేక గ్రాంటుగా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించనున్నామని.. దీనిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరారు. ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని సడలించాలని కోరారు. శుక్రవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో కేసీఆర్ అరగంట పాటు సమావేశమయ్యారు. రామగుండంలో నిర్మించతలపెట్టిన నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు. ఇందుకు అంగీకరించిన ప్రధాని మోదీ... మార్చి మొదటి వారంలో వస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై మోదీకి కేసీఆర్ వినతిపత్రాలు సమర్పించారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టులను నిర్మించతలపెట్టామని.. ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్ సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేస్తోందని ప్రధానికి వివరించారు. రూ.71,436 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు, రూ.4,231 కోట్లతో ప్రాణహిత ప్రాజెక్టు నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఇక 2013లో యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్‌ను ఐటీఐఆర్ పథకం కోసం ఎంపిక చేసిందని, దీనికి సంబంధించిన స్థలాల గురించి సమగ్ర నివేదిక పంపాలని, అవసరమైన నిధులు కేటాయించాలని కోరా రు. 14వ ఆర్థిక సంఘం తెలంగాణ రాష్ట్ర వార్షిక రుణ పరిమితిని జీఎస్‌డీపీపై 0.5% వరకు పెంచడానికి సిఫారసు చేసిందని... ఈమేరకు ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను సడలించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో నెలకొల్పబోయే గిరిజన వర్సిటీని సెంట్రల్ వర్సిటీగా గుర్తించి తగిన నిధులు కేటాయించాలని కోరారు.
మిషన్ భగీరథకు సహాయం చేయండి
రాష్ట్రంలో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించడం కోసం రూ.40 వేల కోట్ల అంచనా వ్యయంతో ‘మిషన్ భగీరథ’ ప్రాజెక్టును చేపట్టామని... దీనికి ప్రత్యేక సహాయం కింద కేంద్రం నుంచి రూ.10 వేల కోట్లు ఆర్థిక సహకారం అందించాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇక రాష్ట్రంలో నెలకొల్పనున్న ఎయిమ్స్‌కు 200 ఎకరాల భూమిని కేటాయించామని... 2016-17 బడ్జెట్‌లో దీనికి నిధులు కేటాయించాలని కోరారు. తెలంగాణలో ఐపీఎస్ అధికారుల కొరత ఉందని, ప్రస్తుతమున్న 112 మంది అధికారుల సంఖ్యను 141కి పెంచాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు విభజన త్వరగా జరిగేలా చూడాలని కోరారు.
రాష్ట్రంలో కరువు పరిస్థితులను అధిగమించేందుకు రూ. 3,064 కోట్లు మంజూరు చేయాలని కోరినా... రూ. 791 కోట్లు మాత్రమే కేటాయించారని, మరిన్ని నిధులు ఇవ్వాలని విన్నవించారు.ఇక రాష్ట్రంలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి భారీ ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడుతున్నామని.. ఇందుకోసం రూ. వేల కోట్లు అవసరమని ప్రధానికి సీఎం కేసీఆర్ వివరించారు. ఈ మేరకు వచ్చే నాలుగేళ్ల కోసం రాష్ట్రానికి రూ. 30,571 కోట్ల ప్రత్యేక గ్రాంటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థకు అవసరమైన అనుమతులన్నింటినీ మంజూరు చేయాలని కోరారు.