ఢిల్లీ: టీ.జేఏసీ తలపెట్టనున్న బంద్ లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పిలుపునిచ్చారు. బంద్ ను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 7 వ తేదీన టీ.జేఏసీ బంద్ కు పిలుపు నిచ్చిన నేపథ్యంలో తన మద్దతు ప్రకటిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ బంద్ ను విజయవంత చేయాలని తెలంగాణ ప్రజలను కోరారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో అదే రోజున హైదరాబాద్ నగరంలో ఏపీఎన్జీవోలు సభ ఏర్పాటుకు ముందుకు వెళుతున్న తరుణంలో టీ.జేఏసీ బంద్ కు పిలుపునిచ్చింది.
శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు 24 గంటలపాటు బంద్కు పిలుపు ఇస్తున్నట్లు కోదండరామ్ తెలిపారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్లో చేయతలపెట్టిన శాంతి ర్యాలీని రద్దు చేసినట్లు చెప్పారు. శాంతి ర్యాలీకీ బదులుగానే బంద్ అని, సీమాంధ్ర సభకు వ్యతిరేకంగా బంద్ కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, అందుకు నిరసనగానే బంద్కు పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. మొత్తం వ్యవస్థను నిలిపివేస్తామని హెచ్చరించారు. ఎక్కడికక్కడే శాంతి ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహిస్తామని చెప్పారు. విభజనకు సహకరిస్తే ఏపీఎన్జీవోల సభను తామే విజయవంతం చేస్తామన్నారు.