ఎస్సై సిద్దయ్య (ఫైల్)
కేంద్రం ప్రకటించిన పతకాల్లో రాష్ట్రం రికార్డు
కానిస్టేబుల్ శ్రీనివాసులుకు ప్రతిష్టాత్మకమైన శౌర్యచక్ర
► రాష్ట్రపతి శౌర్య పోలీసు పతకాలు 2, ‘శౌర్య’ పతకాలు 24
► ‘అత్యుత్తమ’ పతకాలు 11, రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం 1
► నల్లగొండకు చెందిన ఎస్సై సిద్దయ్య, కానిస్టేబుల్ నాగరాజుకు మరణానంతరం అవార్డులు
► దేశవ్యాప్తంగా 170 మందికి ‘శౌర్య’ మెడల్
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే అవార్డుల్లో అగ్రస్థానంలో నిలిచింది. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించే అధికారులకు ఇచ్చే శౌర్య పతకాల్లో అత్యధికం కైవసం చేసుకుంది. తెలంగాణ నిఘా విభాగానికి చెందిన కానిస్టేబుల్ కె.శ్రీనివాసులుకు ప్రతిష్టాత్మకమైన శౌర్యచక్ర పతకం లభించింది. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ధైర్యసాహసాలు ప్రదర్శించే భద్రతా దళాల సిబ్బందికి కేంద్రం ఈ అవార్డు ఇస్తుంది. అత్యంత అరుదుగా మాత్రమే పోలీసు విభాగానికి ఇస్తుంది.
కేంద్రం ఆదివారం రాష్ట్రపతి పోలీసు పతకాలతోపాటు అశోక్‌చక్ర, శౌర్యచక్ర అవార్డులను ప్రకటించింది. దేశం మొత్తమ్మీద ఒకరికి అశోక్‌చక్ర లభించగా.. శౌర్యచక్ర పతకాలు 14 మందిని వరించాయి. అందులో శ్రీనివాసులు ఒక్కరే పోలీసు విభాగానికి చెందిన వారు కావడం విశేషం. మిగిలిన 13 మంది భద్రతా దళానికి చెందిన వారే. రాష్ట్ర చరిత్రలో (ఉమ్మడి ఏపీ సహా) కానిస్టేబుల్ స్థాయి వ్యక్తికి ఇంతటి మహోన్నత పథకం లభించిడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరులో ఉగ్రవాది ఆలం జెబ్ అఫ్రిదిని పట్టుకునేందుకు శ్రీనివాసులు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించారు. ఉగ్రవాది కత్తితో పొడవడంతో ప్రాణపాయస్థితిలో బయటపడ్డాడు.
ఇక మొత్తంగా రాష్ట్రానికి రాష్ర్టపతి శౌర్య పోలీస్ పతకాలు 2, శౌర్య పోలీసు పతకాలు 24, రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు 1, అత్యుత్తమ సేవా పతకాలు 11 లభించాయి. నల్లగొండ జిల్లాకు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ దూదేకుల సిద్దయ్య, కానిస్టేబుల్ నాగరాజుకు మరణానంతరం రాష్ర్టపతి శౌర్య పోలీస్ పతకాలు ప్రకటించారు. దేశవ్యాప్తంగా మొత్తం 170 మంది అధికారులకు రాష్ట్రపతి, పోలీసు శౌర్య పతకాలను ప్రకటించగా.. అందులో 26 పతకాలు తెలంగాణ పోలీసు విభాగానికే వచ్చాయి. అవార్డుల చరిత్రతో ఓ రాష్ట్ర పోలీసు విభాగానికి ఒకేసారి ఇన్ని రావడం రికార్డు అని అధికారులు పేర్కొంటున్నారు. దేశ వ్యాప్తంగా ఏడుగురు అధికారులు రాష్ట్రపతి పోలీసు శౌర్య పురస్కారానికి ఎంపిక కాగా అందులో రెండు పురస్కారాలు రాష్ట్రానికే వచ్చాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు 2, అత్యుత్తమ సేవా పతకాలు 14 లభించాయి.
శౌర్యచక్ర
1. కె.శ్రీనివాసులు (కానిస్టేబుల్, నిఘా విభాగం)
రాష్ట్రపతి శౌర్య పోలీస్ పతకాలు
1. దూదేకుల సిద్దయ్య (సబ్ ఇన్‌స్పెక్టర్, నల్లగొండ)
2. నాగరాజు (కానిస్టేబుల్, నల్లగొండ)
రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం
1 రాజీవ్ రతన్, డిజి, ఫైర్ సర్వీసెస్
శౌర్య పోలీస్ పతకాలు
1.ఎం. చంద్రశేఖర్, ఏసీపీ
2.కె. రవీందర్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్
3.సయ్యద్ అబ్దుల్ కరీం, హెడ్ కానిస్టేబుల్
4.మహ్మద్ ముజీబ్, హెడ్ కానిస్టేబుల్
5.మహ్మద్ తాజ్ పాషా, కానిస్టేబుల్
6.ఎస్.రాజవర్ధన రెడ్డి, కానిస్టేబుల్
7.మహ్మద్ ముషరఫ్ బాబా, కానిస్టేబుల్
8.డాక్టర్ టి.ప్రభాకర రావు, ఎస్పీ
9.ఎన్.అనిల్ కుమార్, కానిస్టేబుల్
10.వేమాద్రి రమేశ్, కానిస్టేబుల్
11.కొనతం మధుసూధన్, కానిస్టేబుల్
12.తోడేటి శివ కోటేశ్వరరావు, కానిస్టేబుల్
13.ముత్తినేని శ్రీను, కానిస్టేబుల్
14.అన్నారెడ్డి చిన్న బాల గంగిరెడ్డి, ఇన్‌స్పెక్టర్
15.ఎల్. జానకిరాం, కానిస్టేబుల్
16.రాజేశ్ కుమార్, ఎస్పీ
17.మాద దయానందరెడ్డి, డీఎస్పీ
18.సిహెచ్ ఆర్‌వి.ఫణీందర్, ఇన్‌స్పెక్టర్
19.జి.సత్యనారాయణ, రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్
20.సోనిలాల్ అమృత్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్
21.సయ్యద్ సర్వర్ పాషా, హెడ్ కానిస్టేబుల్
22.గొలనకొండ నరేందర్, కానిస్టేబుల్
23.మహ్మద్ ఖాదిర్, కానిస్టేబుల్
24. వేముల భాస్కర్, ఇన్‌స్పెక్టర్
అత్యుత్తమ సేవా పోలీస్ పతకాలు
1.వై. శ్రీనివాస రావు, కమాండెంట్, 7వ బెటాలియన్, టీఎస్‌ఎస్‌పి, నిజామాబాద్
2.చింతకుంటల నరోత్తమ్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ, మెదక్
3.కృష్ణస్వామి నటరాజన్ బాలాజీ, అసిస్టెంట్ కమాండెంట్, ఖమ్మం
4.పి.మురళీకృష్ణ, అడిషనల్ ఎస్పీ, హైదరాబాద్
5.షేక్ మహ్మద్ నిజాముద్దీన్, ఏసీపీ, హైదరాబాద్
6. ఎ.బాలకోటి, డీఎస్పీ, మహబూబ్‌నగర్
7.ఎ.వి.సత్యనారాయణ, ఇన్‌స్పెక్టర్, హైదరాబాద్
8.డి.వీరంగయ్య, ఏఎస్‌ఐ, హైదరాబాద్
9.వి.పాండురంగారావు, ఏఎస్‌ఐ, హైదరాబాద్
10.మహ్మద్ అబ్దుల్ నయీమ్,హెడ్ కానిస్టేబుల్, హైదరాబాద్
11. డి.బాలకృష్ణ, హెడ్ కానిస్టేబుల్, హైదరాబాద్
పోలీసు శాఖకు అభినందనలు: సీఎం
తెలంగాణ పోలీస్ యంత్రాంగం కనబరిచిన ప్రతిభను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ పోలీసు పతకాల్లో తెలంగాణ పోలీసులు అత్యధిక పతకాలు సాధించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసు శాఖకు మనస్ఫూర్తిగా అభినందించారు. సంఘ వ్యతిరేక శక్తుల ఆటకట్టించటంతోపాటు శాంతిభద్రతల పరిరక్షణ, ఉగ్రవాదాన్ని అణచివేయడంలో తెలంగాణ పోలీసులు పోషిస్తున్న పాత్ర పట్ల జాతి యావత్తూ గర్విస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ పోలీసుల కృషిని గుర్తించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. అవార్డులు పొందిన పోలీసు అధికారులకు అభినందనలు తెలిపారు. గత రెండేళ్లలో ఉగ్రవాద నిర్మూలన కోసం రాష్ట్ర పోలీసు యంత్రాంగం తీసుకున్న చర్యలకు గుర్తింపుగా ఈ పురస్కారాలు లభించాయన్నారు.
ఉగ్రవాదులను మట్టుబెట్టిన 10 మందికి పతకాలు..
గతేడాది నల్లగొండ జిల్లా జానకీపురం ఎన్‌కౌంటర్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సిమీ ఉగ్రవాదులను జిల్లా పోలీసులు మట్టుబెట్టారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసుల పోరాట పటిమను గుర్తించిన కేంద్రం రాష్ట్రపతి అవార్డులకు ఎంపిక చేసింది. అప్పటి జిల్లా ఎస్పీతో పాటు ఒక ఇన్‌స్పెక్టర్, ఆరుగురు కానిస్టేబుళ్లకు, వీర మరణం పొందిన ఎస్‌ఐ సిద్ధయ్య, కానిస్టేబుల్ నాగరాజులకు ఈ అవార్డులను ప్రకటించింది.