న్యూఢిల్లీ: అన్నదాతల బలవన్మరణాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణలో అక్టోబర్ వరకూ 69 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఈ మేరకు లోక్‌సభకు కేంద్ర వ్యసాయ శాఖ సహాయ మంత్రి డాక్టర్ సంజీవ్ కుమార్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రాష్ట్రాలు ఇచ్చిన సమాచారం మేరకు.. మహారాష్ట్రలో ఏప్రిల్ నాటికి 204, కర్ణాటకలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 19, గుజరాత్‌లో అక్టోబరు వరకు 3, ఆంధ్రప్రదేశ్‌లో జూన్ వరకు 3 (టీడీపీ అధికారంలోకి వచ్చాక రైతుల ఆత్మహత్యల వివరాలను ఇవ్వలేదు), కేరళలో మరో 3 ఆత్మహత్యలు జరిగాయన్నారు. దేశవ్యాప్తంగా ఏప్రిల్ వరకూ 300 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వ్యవసాయ రంగం పురోగతికి రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
సుప్రీం జడ్జిల సంఖ్యను పెంచబోం: సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్రం తెలిపింది. అయితే, దేశంలోని 24 హైకోర్టుల్లోని న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఈ మేరకు న్యాయశాఖ మంత్రి డి.వి. సదానంద గౌడ లోక్‌సభకు మంగళవారం వెల్లడించారు.
‘పరువు’కు 14 మంది బలి: అక్టోబర్ నాటికి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన పరువు హత్యల్లో 14 మంది మృతి చెందారు. వీటిలో యూపీలో 7, పంజాబ్‌లో 2, హరియాణా, గుజరాత్, ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడులలో ఒక్కోటి జరిగాయని హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభకు తెలిపారు.
‘సింధురత్న’ ఘటనపై చర్యలు: ఐఎన్‌ఎస్ సింధురత్న జలాంతర్గామిలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి ఏడుగురు అధికారుల తప్పిదం ఉన్నట్టుగా గుర్తించినట్టు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ రాజ్యసభకు లిఖిత పూర్వకంగా వెల్లడించారు.
దేశంలో ‘ఎబోలా’ లేదు: దేశంలో ఇప్పటి వరకు ఎబోలా కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా రాజ్యసభకు లిఖిత పూర్వకంగా వెల్లడించారు. దేశంలోకి ఎబోలా వైరస్ ప్రవేశించకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని, ఎబోలా ప్రభావిత దేశాల నుంచి భారత్‌కు వస్తున్న ప్రయాణికులను విమానాశ్రయాల వద్ద స్క్రీనింగ్ చేస్తున్నట్టు తెలిపారు.
30 విమానాలు కూలాయి: దేశంలో 2011 నుంచి ఇప్పటి వరకు వాయు సేనకు చెందిన 30 విమానాలు కూలిపోయాయి. దీనివల్ల రూ. 1,160 కోట్ల నష్టం వాటిల్లిందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ రాజ్యసభ కు వెల్లడించారు.
3,784 కోట్ల విదేశీ విరాళాలు: దేశంలోని వివిధ స్వచ్ఛంద సంస్థల(ఎన్‌జీవో)కు 2013-14 మధ్య కాలంలో రూ. 3,784 కోట్ల విదేశీ విరాళాలు అందాయి. వీటిలో ఏపీలోని స్వచ్ఛంద సంస్థలకు రూ. రూ.480 కోట్లు అందాయని హోం శాఖ సహాయ మంత్రి వెల్లడించారు.
15 గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు: దేశంలో కొత్తగా 15 గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసినట్టు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేష్ శర్మ రాజ్యసభకు వెల్లడించారు.
472 మంది నక్సల్స్ లొంగుబాటు: ఈ ఏడాది ఇప్పటి వరకు 472 మంది నక్సలైట్లు లొంగిపోయారని, గత మూడేళ్లతో పోలిస్తే లొంగిపోయిన వారి సంఖ్య ఈ ఏడాదే ఎక్కువని హోం శాఖ సహాయ మంత్రి లోక్‌సభకు తెలిపారు.
రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో తెలంగాణ
Published Wed, Nov 26 2014 4:08 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement