రాజ్యసభలో గళమెత్తిన తెలుగు ఎంపీలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభలో తెలుగు ఎంపీలు గళమెత్తారు. ప్రాంతాలకు అతీతంగా ప్రత్యేక హోదా కోసం ముక్తకంఠంతో నినదించారు. విభజన చట్టంలోని హామీలకు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఏపీకి ప్రత్యేక హోదాపై జరిగిన చర్చలో పలువురు తెలుగు ఎంపీలు మాట్లాడారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై నాడు ప్రధాని ఇచ్చిన హామీని గౌరవించాలని కాంగ్రెస్ సభ్యుడు రాపోలు ఆనంద్ భాస్కర్ కోరారు. ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరకపోతే మరో కేటగిరి పెట్టి న్యాయం చేయాలని ఆయన సూచించారు.
తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని తెలుగువారందరూ కోరుకుంటున్నారని టీడీపీ ఎంపీ తోటా సీతామహాలక్ష్మి చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని నిలుపుకోవాలని కోరారు. విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేసి ఏపీని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయన్నారు. కాంగ్రెస్ చేసిన తప్పులే బీజేపీ చేయొద్దని మరో ఎంపీ సీఎం రమేశ్ అన్నారు.
తాము ఎప్పుడు రాష్ట్ర విభజనను వ్యతిరేకించలేదని, ఏపీకి న్యాయం చేయాలని కోరామని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. విభజన జరిగిన తీరును వ్యతిరేకించామని చెప్పారు. కాగా, టి. సుబ్బిరామిరెడ్డికి రాజ్యసభ వైస్ చైర్మన్ పీజే కురియన్ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.