
తాత్కాలిక నిర్వహణ పద్ధతులే అమలు
కృష్ణా జలాలపై కేంద్ర మంత్రి ఉమాభారతి ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రాజెక్టుల నిర్వహణకు తాత్కాలిక యాజమాన్య పద్ధతులను రెండు రాష్ట్రాల మధ్య కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 2015-16 సంవత్సరానికి విజయవంతమయ్యాయని, 2016-17 సంవత్సరానికి కూడా ఇవి అమల్లో ఉన్నాయని కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి వెల్లడించారు. లోక్‌సభలో గురువారం ప్రశ్నోత్తరాల సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎంపీ బుట్టా రేణుక అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. కృష్ణా జలాల కేటాయింపుల ప్రకటన వెలువడ్డాకే కొత్త ప్రాజెక్టుల నిర్మాణంపై నిర్ణయం తీసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రతిపాదన వచ్చిందా? అని రేణుక ప్రశ్నించారు.
దీనికి మంత్రి ఉమాభారతి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ‘కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ-1) 1976లో మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734 టీఎంసీలు, ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలను కేటాయించింది. 20014లో ఏర్పాటైన కేడబ్ల్యూడీటీ-2 కాలపరిమితిని ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ప్రకారం రెండేళ్ల పాటు పొడిగించాం. ట్రిబ్యునల్ ఒకవేళ కేటాయింపులు జరపని పక్షంలో ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరపాలని, నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు ఆపరేషన్ ప్రొటోకాల్‌ను నిర్ధారించాలని పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-89 చెబుతోంది.
రాజోలీబండ డైవర్షన్ స్కీమ్(ఆర్‌డీఎస్) కుడి కాలువను ఏపీ ప్రభుత్వం చేపట్టడంపై ఆందోళన వ్యక్తంచేస్తూ తెలంగాణ ప్రభుత్వం 30 జనవరి 2016న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)కి లేఖ రాసింది. అయితే ప్రస్తుతం కృష్ణా నదీ జలాల పంపిణీ వ్యవహారం కేడబ్ల్యూడీటీ-2 పరిధిలో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు నీటి నియంత్రణకు సంబంధించి యాజమాన్య నిర్వహణ ఏర్పాట్లపై ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అది 2015-16లో సంతృప్తికరంగా అమలైంది. 2016-17 సంవత్సరంలోనూ ఆ ఒప్పందం అమల్లో ఉంటుంది’ అని ఉమాభారతి తన సమాధానంలో వివరించారు.