Union Minister Uma Bharti
-
సయోధ్య... ససేమిరా !
= కేంద్రమంత్రి ఉమాభారతి మధ్యవర్తిత్వం విఫలం = నిపుణుల పరిశీలనకు ఒప్పుకోని తమిళనాడు = ఇరు రాష్ట్రాల ప్రజలు సంయమనంతో నడుచుకోవాలి = విరుద్ధంగా ప్రవర్తిస్తే సరిహద్దులో నిరాహార దీక్ష కు దిగుతా : ఉమాభారతి హెచ్చరిక = మాకు తాగడానికే నీళ్లు లేవంటే వారికి వ్యవసాయానికి ఇవ్వాలంటారు.. ఇదెక్కడి న్యాయం : సీఎం సిద్ధు = నేడు సుప్రీం కోర్టులో విచారణ సాక్షి, బెంగళూరు : విడవమంటే పాముకు కోపం... కరవమంటే కప్పకు కోపం అన్న చందంగా తయారైంది కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల పరిస్థితి. కావేరి నీరు విడుదల చేయలేమని కర్ణాటక చట్టసభల్లో తీసుకున్న నిర్ణయం... విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెల్సిందే. కేంద్రం మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం సూచించిన నేపథ్యంలో కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉమా భారతి రంగంలోకి దిగారు. గురువారం ఢిల్లీలో కర్ణాటక తరఫున సీఎం సిద్ధరామయ్యతో పాటు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎంపీ పాటిల్, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అరవింద్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు తరఫున ఆ రాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రి ఎడప్పాడి.ఎస్.పళని స్వామి, ముఖ్య కార్యదర్శి రామ్మోహన్‌రావ్ తదితరులు పాల్గొన్నారు. నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కర్ణాటక ప్రభుత్వం తమ రాష్ట్రంలోని కావేరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న నాలుగు జలాశ యాల్లో ప్రస్తుత నీటి మట్టం, తాగునీటి అవసరాలకు కావాల్సిన నీరు తదితర విషయాలన్నింటినీ కేంద్రమంత్రి ఉమా భారతి దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా కర్ణాటకతో పాటు తమిళనాడులో కావేరి విషయమై క్షేత్రస్థాయి పరిశీలనకు నిపుణుల కమిటీని పంపించాలని విన్నవించింది. అయితే ఇందుకు తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రిబ్యునల్ ఆదేశాలతో పాటు సుప్రీంకోర్టు సూచనల మేరకు నీటిని విడుదల చేయాల్సిందేనని ఆ రాష్ట్ర ప్రతినిధులు తేల్చి చెప్పారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదర్చడానికి ఉమాభారతి యత్నించి విఫలమయ్యారు. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి ఉమాభారతి, సీఎం సిద్ధు వేర్వేరుగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండగా కావేరి నదీ జలాల విడుదలకు సంబంధించి నేడు (శుక్రవారం) సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. కాగా కావేరి నీటి విడుదల విషయమై 2013లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై తమిళనాడు దాఖలు చేసిన కోర్టు ధిక్కార కేసు శుక్రవారం విచారణకు రానుంది. సరిహద్దులో స్వయంగా నిరసనకు దిగుతా : కేంద్ర ఉమాభారతి సుప్రీం కోర్టు సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం కావేరి విషయంలో కేంద్రం మధ్యవర్తిత్వం వహించిందని, అయితే దురదృష్టవశాత్తు ఈ సయోధ్యలో ఎటువంటి పురోగతి కనిపించలేదని కేంద్రమంత్రి ఉమాభారతి పేర్కొన్నారు. నిపుణుల కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించాలన్న కర్ణాటక విన్నపాన్ని తమిళనాడు వ్యతిరేకించిందన్నారు. ఇంతకంటే తాను ప్రస్తుతానికి ఏమీ చెప్పలేనని, సమావేశంలో జరిగిన విషయాలను అటార్నీ జన రల్ ద్వారా సుప్రీంకోర్టుకు తెలియజేస్తామన్నారు. కావేరి విషయంలో ఇరు రాష్ట్రాల ప్రజలు సంయమనంతో వ్యవహరించాలన్నారు. ఇందుకు వ్యతిరేకంగా జరిగితే తానే స్వయంగా రెండు రాష్ట్రాల సరిహద్దులో నిరాహార దీక్షకు దిగుతానని ఆమె హెచ్చరించారు. ‘ఇది బెదిరించడానికి చెబుతున్న విషయం కాదు. పరిస్థితి అర్థమయ్యేలా వివరిస్తూ చేస్తున్న అభ్యర్థన మాత్రమే.’ అన్నారు. ‘తాను సన్యాసం స్వీకరించింది కర్ణాటకలోని పెజావరస్వామిజీ సమక్షంలో’ తన గురువుకు తమిళనాడులో కూడా భక్తులు ఉన్నారు. పూర్వం యద్ధం ఉదయం మాత్రమే ఇరువైపులా కత్తులు దూసుకునేవారు. సూర్యాస్తమయం అలసిన సైనికులకు అటువైపు వారు ఇటువైపు వారు తాగునీరు ఇచ్చేవారు. అందువల్ల తాగునీటి విషయంలో రాజకీయాలు పక్కనపెట్టి ఆలోచించాలన్నారు. వారికి వ్యవసాయ అవసరాలు... మాకు తాగునీటి అవసరాలు : సీఎం సిద్ధు కర్ణాటకలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నందు వల్లే తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులను సమావేశంలో వివరించామని, కర్ణాటకలో 18,75,000 హెక్టార్లను సాగు చేయడానికి తమకు ట్రిబ్యునల్ అనుమతి ఉండగా సరైన వర్షాలు లేకపోవడం వల్ల కేవలం 6,15,000 హెక్టార్లను మాత్రమే సాగులో ఉందన్నారు. అయితే తమిళనాడు కావేరి నదీ పరివాహక ప్రాంతంలో ఇప్పటికే 17 లక్షల హెక్టార్లలో విత్తన ప్రక్రియ ముగిసిందని, ఇక మెట్టూరు డ్యాంలో ఉన్న 43 టీఎంసీల నీరు ప్రస్తుత సాంబా పంటకు సరిపోతుందన్నారు. అంతేకాకుండా వారికి ఇప్పటికే మంచి వర్షాలు పడ్డాయని, ఇక అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ కూడా సాధారణ వర్షాలు పడుతాయని భారత వాతావరణ శాఖ కూడా చెప్పిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయినా తమకు రావాల్సిన కావేరి నీరు ఇవ్వాల్సిందనని తమిళనాడు డి మాండ్ చేయడం సరికాదన్నారు. ఆ నీటిని కూడా సాగుకు వినియోగిస్తామని చెబుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. తాము తాగునీటి కోసమే కావేరి అని వివరిస్తున్నామని వాపోయారు. ఇక సమావేశంలో ఇరు రాష్ట్రాలో క్షేత్రస్థాయి పర్యటనకు నిపుణుల కమిటీ పంపించాలన్న తమ ప్రతిపాదనను వారు ఎందుకు వ్యతిరేకించారో అర్థం కావడం లేదన్నారు. తమకు సుప్రీంకోర్టుపై అపార గౌరవం ఉందని అయితే తమిళనాడుకు వదలడానికి తమ వద్ద కావేరి జలాలు లేవని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కాగా తమిళనాడు ఉమాభారతి సమక్షంలో తమినాడు ప్రతినిధులు రోజుకు 5 వేల క్యూసెక్కులు చొప్పున పది రోజులు నీటిని విడుదల చేయాలని మొదట కోరింది. లేదంటే 3,400 క్యూసెక్కులను పది రోజుల పాటు ఇవ్వాలని కర్ణాటకను కోరింది. అయితే ఈ రెండు విషయాలకు కర్ణాటక ఒప్పుకోలేదని సమాచారం. -
తేలని కృష్ణా పంచాయితీ
-
తేలని కృష్ణా పంచాయితీ: పరస్పర ఫిర్యాదులు
- అపెక్స్ సమావేశంలో హాట్ హాట్ గా వాదనలు - పాలమూరు, డిండికి ఏపీ అభ్యంతరం - అవి పాతవేనన్న తెలంగాణ.. పట్టిసీమ, పోతిరెడ్డిపాడులపై ఫిర్యాదు - కలిసి మాట్లాడుకోవాలని ఉమాభారతి సూచన న్యూఢిల్లీ: కృష్ణానదీ జలాల్లో వాటాల కేటాయింపులు, వాటి ఆధారంగా నిర్మిస్తోన్న ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు కేంద్రానికి పరస్పర ఫిర్యాదులు చేశాయి. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లోని కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన అపెక్స్ సమావేశంలో.. తెలంగాణ నిర్మిస్తోన్న పాలమూరు, డిండి ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు వ్యక్యం చేయగా, అవి రెండూ పాత ప్రాజెక్టులేనని, తమకు దక్కాల్సిన నీటివాటాను పెంచాలని తెలంగాణ వాదించింది. మొత్తంగా ఎజెండాలోని ఐదు అంశాల్లో మూడింటికి ఏకాభిప్రాయం లభించగా, కీలకమైన ప్రాజెక్టులపై మాత్రం స్పష్టత రాలేదు. కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి, తెలంగాణ, ఏపీ సీఎంలు కె.చంద్రశేఖర్ రావు, నారా చంద్రబాబునాయుడులతోపాటు నీటిపారుదల మంత్రులు హరీశ్ రావు, దేవినేని ఉమా మహేశ్వరరావు, ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖల ముఖ్యకార్యదర్శులు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ఇంజనీర్ ఇన్ చీఫ్ లు అపెక్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. భేటీ అనంతరం అనంతరం ఉమాభారతి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించామని, ఇరు పక్షాల వాదలు పూర్తయిన తర్వాత మూడు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని, వ్యక్తిగతంగా దీనినొక విప్లవాత్మక(క్రాంతికారి) భేటీగా భావిస్తున్నానని అన్నారు. టెలీ మెట్రిక్ విధానం ద్వారా నీటి వాడకాన్ని లెక్కించేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. 47 చోట్ల ఈ టెలీమీటర్లను ఏర్పాటుచేయనున్నారు. టెండర్ల ద్వారా త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించాయి. నదీజలాల లభ్యత, పంపిణీపై అధ్యయనానికి సంయుక్త కమిటీ ఏర్పాటుచేసుకోవాలనే ఎజెండా అంశానికి కూడా ఇరు పక్షాలు సరేనన్నాయి. రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి తాత్కాలిక విధానానికి (ప్రస్తుతం అమలవుతోన్న దానికి) అంగీకారం తెలిపాయి. అయితే ఏకాభిప్రాయం కుదరని ప్రాజెక్టుల అంశాలపై రెండు రాష్ట్రాలు కలిసి మాట్లాడుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అపెక్స్ భేటీకి సంబంధించిన నివేదికను ట్రిబ్యూనల్ కు అందజేయనున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. కాగా, నీటి వాటాలపై మరో సమావేశం ఉండదని ఉమాభారతి తెగేసిచెప్పారు. దీంతో తదుపరి అభ్యంతరాలన్నీ ట్రిబ్యూనల్, సుప్రీంకోర్టులకే తెలపాల్సి ఉంటుంది. పాలమూరు, డిండికి ఏపీ 'నో': తెలంగాణ నిర్మించతలపెట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవని అపెక్స్ సమావేశంలో ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపించింది. బ్రిజేష్ ట్రిబ్యూనల్ తీర్పు నోటిఫై అయ్యేంత వరకు పాత విధానంలోనే నీటిని పంచుకునేందుకు, టెలీ మీటర్ల ఏర్పాటుకు, నీటి లభ్యతపై అధ్యయన కమిటీ ఏర్పాటుకు అంగీకరించింది. పాలమూరు, డిండి పాతవే: ఆంధ్రప్రదేశ్ వాదిస్తున్నట్లు పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు కొత్తవి కావని, చాలా ఏళ్ల కిందటే వాటి నిర్మాణాలకు జీవోలు జారీ అయ్యాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఏపీ నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు కొత్తదని, దానికి సీడీబ్ల్యూసీ, బోర్డు అనుమతులు లేవని ఆరోపించింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఏపీ ఎక్కువ నీళ్లను వాడుకుంటున్నదని ఫిర్యాదుచేసింది. ఆర్డీఎస్ ఉల్లంఘనలపై కేంద్రం దృష్టిపెట్టాలని కోరింది. కృష్ణాలో తెలంగాణ వాటా 299 టీఎంసీల నుంచి 389 టీఎంసీలకు పెంచాలని విజ్ఞప్తి చేసింది. ట్రిబ్యూనల్ ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసే వరకు బోర్డు నియంత్రణ అక్కర్లేదని, మొహిలే, గోయల్ లను నిపుణుల కమిటీ నుంచి తొలిగించాలని కోరింది. గోదావరి జలాల్లో తనకున్న 954 టీఎంసీల వాటాను వినియోగించుకునేలా చేపట్టిన ప్రాజెక్టుల రీ డిజైనింగ్ లో ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని తెలంగాణ ప్రభుత్వం అపెక్స్ సమావేశంలో తేల్చిచెప్పింది. సుప్రీం ఆదేశాల మేరకు రూపొందించిన అపెక్స్ ఎజెండాలోని అంశాలివే.. 1) తెలంగాణ నిర్మిస్తోన్న పాలమూరు, డిండి ప్రాజెక్టులపై చర్చకు మొదటిప్రాధాన్యం 2) ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి తాత్కాలిక విధానం 3) రిజర్వాయర్ల పరిధిలో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో లెక్కలు పారదర్శకంగా ఉండేందుకు టెలీమెట్రీ విధానం 4) సంవత్సరంలో(ఒక వాటర్ ఇయర్లో) నీటి వాటాల్లో హెచ్చుతగ్గులుంటే వాటి సర్దుబాటు చేసుకోవడం 5) గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు నీటి తరలిస్తూ ఏపీ ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులపై చర్చ వీటిలో కీలకమైన అంశాలు తప్ప మిగిలిన మూడింటిపై భేటీలో ఏకాభిప్రాయం కుదిరింది. -
తాత్కాలిక నిర్వహణ పద్ధతులే అమలు
కృష్ణా జలాలపై కేంద్ర మంత్రి ఉమాభారతి ప్రకటన సాక్షి, న్యూఢిల్లీ : కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రాజెక్టుల నిర్వహణకు తాత్కాలిక యాజమాన్య పద్ధతులను రెండు రాష్ట్రాల మధ్య కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 2015-16 సంవత్సరానికి విజయవంతమయ్యాయని, 2016-17 సంవత్సరానికి కూడా ఇవి అమల్లో ఉన్నాయని కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి వెల్లడించారు. లోక్‌సభలో గురువారం ప్రశ్నోత్తరాల సందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. కృష్ణా జలాల కేటాయింపుల ప్రకటన వెలువడ్డాకే కొత్త ప్రాజెక్టుల నిర్మాణంపై నిర్ణయం తీసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రతిపాదన వచ్చిందా? అని రేణుక ప్రశ్నించారు. దీనికి మంత్రి ఉమాభారతి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ‘కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ-1) 1976లో మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734 టీఎంసీలు, ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలను కేటాయించింది. 20014లో ఏర్పాటైన కేడబ్ల్యూడీటీ-2 కాలపరిమితిని ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ప్రకారం రెండేళ్ల పాటు పొడిగించాం. ట్రిబ్యునల్ ఒకవేళ కేటాయింపులు జరపని పక్షంలో ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరపాలని, నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు ఆపరేషన్ ప్రొటోకాల్‌ను నిర్ధారించాలని పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-89 చెబుతోంది. రాజోలీబండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎస్) కుడి కాలువను ఏపీ ప్రభుత్వం చేపట్టడంపై ఆందోళన వ్యక్తంచేస్తూ తెలంగాణ ప్రభుత్వం 30 జనవరి 2016న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కి లేఖ రాసింది. అయితే ప్రస్తుతం కృష్ణా నదీ జలాల పంపిణీ వ్యవహారం కేడబ్ల్యూడీటీ-2 పరిధిలో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు నీటి నియంత్రణకు సంబంధించి యాజమాన్య నిర్వహణ ఏర్పాట్లపై ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అది 2015-16లో సంతృప్తికరంగా అమలైంది. 2016-17 సంవత్సరంలోనూ ఆ ఒప్పందం అమల్లో ఉంటుంది’ అని ఉమాభారతి తన సమాధానంలో వివరించారు. -
‘పోలవరం’ నిర్మాణానికి సహకరిస్తాం
♦ కొన్ని చిన్నచిన్న అంశాలను పరిష్కరించాలి ♦ 2018లోగా ప్రాజెక్ట్ పూర్తవుతుందన్న నమ్మకం ఉంది ♦ ఆర్థిక శాఖ చేయూతనిస్తుందని నమ్ముతున్నా ♦ అవసరమైతే నాబార్డు నుంచి రుణం తీసుకుంటాం ♦ కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి వెల్లడి ♦ కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్ సత్వర నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని, అయితే కొన్ని చిన్నచిన్న అంశాలు పరిష్కారం కావాల్సి ఉందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఢిల్లీలో ఉమాభారతితో ఆమె నివాసంలో భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం ఇరువురు సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘పోలవరం జాతీయ ప్రాజెక్టు. జాతికి గర్వకారణం. అది గడువులోగా పూర్తయితే దేశంలో బాక్రానంగల్, ఫరక్కా ప్రాజెక్టుల తరువాత అతిపెద్ద ప్రాజెక్టు అవుతుంది. మేము అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చాం. కొన్ని అంశాలను పరిష్కరించాల్సి ఉంది. పక్షంలోగా పరిష్కరిస్తాం. నేను ఆర్థిక శాఖ వద్దకు వెళతాను. ప్రాజెక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం గడువులోగా పూర్తిచేస్తుందని నమ్ముతున్నా’’ అని ఉమాభారతి వివరించారు. నిధుల కేటాయింపు చాలా స్వల్పంగా ఉందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... ‘‘అది చాలా కరెక్టు. కానీ, 2020 నాటికి 10 లక్షల హెక్టార్లకు సాగునీటి వసతి కల్పించాలని ప్రధానమంత్రి చేసిన ప్రకటన తరువాత మాకు ఆర్థిక శాఖపై నమ్మకం కలిగింది. పోలవరం ప్రాజెక్ట్ 2018లోగా పూర్తవుతుందన్న నమ్మకం ఉంది. ఆర్థిక శాఖ చేయూతనిస్తుందని నమ్ముతున్నా. అవసరమైతే నాబార్డు నుంచి రుణం తీసుకుంటాం’’ అని చెప్పారు. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరానికి కేంద్రం అంతగా సహకరించడం లేదన్న విమర్శలపై ఏమంటారని ప్రశ్నించగా... ‘‘ఇది టీమిండియా. కేంద్రం, రాష్ట్రం వేర్వేరు దేశాలేం కాదు’’ అని వ్యాఖ్యానించారు. పరిష్కరించాల్సిన అంశాలేమిటి? అని అడగ్గా... ‘‘కొన్ని చిన్నచిన్న అంశాలు ఉన్నాయి. నిపుణుల కమిటీ అక్కడికి వెళ్లాల్సి ఉంది. అది ప్రాజెక్టు పురోగతికి అంతరాయం కలిగించేది కాదు’’ అని తెలిపారు. కేంద్రం సహకరిస్తే పూర్తవుతుంది: బాబు ‘‘జలవనరుల శాఖ కార్యదర్శి పోలవరం ప్రాజెక్టును సందర్శించి వచ్చారు. వారు సంతృప్తి వ్యక్తంచేశారు. ప్రాజెక్ట్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కేంద్రం నుంచి వచ్చిన అధికారుల బృందం కూడా సంతృప్తి వ్యక్తంచేసింది. ఈ ప్రాజెక్టును 2018లోగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఉమాభారతి మొదటి నుంచీ ప్రాజెక్ట్ పట్ల సానుకూలంగా ఉన్నారు. ఈరోజు మరోసారి కోరగా తప్పనిసరిగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా సహకరిస్తామన్నారు. ఇది మంచి పరిణామం. ఇంకా ఏడు కోట్ల క్యూబిక్ మీటర్ల పనులు కావాలి. అన్నింటికీ డెడ్‌లైన్ పెట్టాం. ఆర్థిక వనరులు ఉంటే అనుకున్నదానికంటే ముందుగానే పూర్తి చేసుకుంటాం’’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. నిధుల వినియోగపత్రాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి.. ఏమంటారు? అని మీడియా ప్రశ్నించగా... ‘‘కరెక్టు కాదు. ఎప్పటికప్పుడు ఇస్తున్నాం. జలవనరుల శాఖలోగానీ, ఆర్థిక శాఖలో గానీ, ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో)లోగానీ సమన్వయం చేసుకోవాల్సి ఉంది. కేంద్రం సహకరిస్తే 2018లోగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుంది’’ అని స్పష్టం చేశారు. -
ఏప్రిల్‌లో రాష్ట్రానికి ఉమాభారతి
మిషన్ కాకతీయ పనుల పరిశీలన సాక్షి, హైదరాబాద్: కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఏప్రిల్ రెండో వారంలో రాష్ట్రంలో పర్యటించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న మిషన్ కాకతీయ పనులను ఆమె ఈ సందర్భంగా పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. నిజానికి గత ఏడాదే మిషన్ కాకతీయ పైలాన్ ఆవిష్కరణకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు, మంత్రి హరీశ్‌రావు ఉమాభారతికి పలుమార్లు విన్నవించారు. అయితే సమయాభావంతో ఆమె రాలేకపోయారు. ఆ తర్వాత ఈ ఏడాది రెండో విడత మిషన్ పనుల ప్రారంభానికి ముందు రావాలని కోరగా అందుకు ఆమె సమ్మతించారు. కానీ అదే సమయంలో వరంగల్ ఉప ఎన్నిక ఉండటంతో రాలేదు. ఇదిలా ఉంటే ఏప్రిల్‌లో ఢిల్లీలో జరగనున్న ‘వరల్డ్ వాటర్ వీక్’ సదస్సుకు రావాలని ఉమాభారతి ఇటీవల స్వయంగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఈ సదస్సులో మిషన్ కాకతీయపై వివరించాలని కోరారు. ఇదే సందర్భంగా రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ పనులను పరిశీలించేందుకు వస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ఏప్రిల్ రెండో వారంలో ఆమె రాష్ట్రానికి రానున్నారని నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. 454 చెరువులకు రూ.129 కోట్లు: మిషన్ కాకతీయలో భాగంగా రాష్ట్రంలోని 454 చెరువుల పనులకు రూ.129.64 కోట్ల మేరకు మంగళవారం నీటిపారుదల శాఖ పరిపాలనా అనుమతులు ఇచ్చింది. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు.