
‘పోలవరం’ నిర్మాణానికి సహకరిస్తాం
♦ కొన్ని చిన్నచిన్న అంశాలను పరిష్కరించాలి
♦ 2018లోగా ప్రాజెక్ట్ పూర్తవుతుందన్న నమ్మకం ఉంది
♦ ఆర్థిక శాఖ చేయూతనిస్తుందని నమ్ముతున్నా
♦ అవసరమైతే నాబార్డు నుంచి రుణం తీసుకుంటాం
♦ కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి వెల్లడి
♦ కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్ సత్వర నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని, అయితే కొన్ని చిన్నచిన్న అంశాలు పరిష్కారం కావాల్సి ఉందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఢిల్లీలో ఉమాభారతితో ఆమె నివాసంలో భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం ఇరువురు సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘పోలవరం జాతీయ ప్రాజెక్టు. జాతికి గర్వకారణం. అది గడువులోగా పూర్తయితే దేశంలో బాక్రానంగల్, ఫరక్కా ప్రాజెక్టుల తరువాత అతిపెద్ద ప్రాజెక్టు అవుతుంది. మేము అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చాం. కొన్ని అంశాలను పరిష్కరించాల్సి ఉంది. పక్షంలోగా పరిష్కరిస్తాం. నేను ఆర్థిక శాఖ వద్దకు వెళతాను.
ప్రాజెక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం గడువులోగా పూర్తిచేస్తుందని నమ్ముతున్నా’’ అని ఉమాభారతి వివరించారు. నిధుల కేటాయింపు చాలా స్వల్పంగా ఉందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... ‘‘అది చాలా కరెక్టు. కానీ, 2020 నాటికి 10 లక్షల హెక్టార్లకు సాగునీటి వసతి కల్పించాలని ప్రధానమంత్రి చేసిన ప్రకటన తరువాత మాకు ఆర్థిక శాఖపై నమ్మకం కలిగింది. పోలవరం ప్రాజెక్ట్ 2018లోగా పూర్తవుతుందన్న నమ్మకం ఉంది. ఆర్థిక శాఖ చేయూతనిస్తుందని నమ్ముతున్నా. అవసరమైతే నాబార్డు నుంచి రుణం తీసుకుంటాం’’ అని చెప్పారు. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరానికి కేంద్రం అంతగా సహకరించడం లేదన్న విమర్శలపై ఏమంటారని ప్రశ్నించగా... ‘‘ఇది టీమిండియా. కేంద్రం, రాష్ట్రం వేర్వేరు దేశాలేం కాదు’’ అని వ్యాఖ్యానించారు. పరిష్కరించాల్సిన అంశాలేమిటి? అని అడగ్గా... ‘‘కొన్ని చిన్నచిన్న అంశాలు ఉన్నాయి. నిపుణుల కమిటీ అక్కడికి వెళ్లాల్సి ఉంది. అది ప్రాజెక్టు పురోగతికి అంతరాయం కలిగించేది కాదు’’ అని తెలిపారు.
కేంద్రం సహకరిస్తే పూర్తవుతుంది: బాబు
‘‘జలవనరుల శాఖ కార్యదర్శి పోలవరం ప్రాజెక్టును సందర్శించి వచ్చారు. వారు సంతృప్తి వ్యక్తంచేశారు. ప్రాజెక్ట్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కేంద్రం నుంచి వచ్చిన అధికారుల బృందం కూడా సంతృప్తి వ్యక్తంచేసింది. ఈ ప్రాజెక్టును 2018లోగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఉమాభారతి మొదటి నుంచీ ప్రాజెక్ట్ పట్ల సానుకూలంగా ఉన్నారు. ఈరోజు మరోసారి కోరగా తప్పనిసరిగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా సహకరిస్తామన్నారు.
ఇది మంచి పరిణామం. ఇంకా ఏడు కోట్ల క్యూబిక్ మీటర్ల పనులు కావాలి. అన్నింటికీ డెడ్‌లైన్ పెట్టాం. ఆర్థిక వనరులు ఉంటే అనుకున్నదానికంటే ముందుగానే పూర్తి చేసుకుంటాం’’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. నిధుల వినియోగపత్రాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి.. ఏమంటారు? అని మీడియా ప్రశ్నించగా... ‘‘కరెక్టు కాదు. ఎప్పటికప్పుడు ఇస్తున్నాం. జలవనరుల శాఖలోగానీ, ఆర్థిక శాఖలో గానీ, ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో)లోగానీ సమన్వయం చేసుకోవాల్సి ఉంది. కేంద్రం సహకరిస్తే 2018లోగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుంది’’ అని స్పష్టం చేశారు.