ఏప్రిల్‌లో రాష్ట్రానికి ఉమాభారతి
మిషన్ కాకతీయ పనుల పరిశీలన
సాక్షి, హైదరాబాద్: కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఏప్రిల్ రెండో వారంలో రాష్ట్రంలో పర్యటించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న మిషన్ కాకతీయ పనులను ఆమె ఈ సందర్భంగా పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. నిజానికి గత ఏడాదే మిషన్ కాకతీయ పైలాన్ ఆవిష్కరణకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు, మంత్రి హరీశ్‌రావు ఉమాభారతికి పలుమార్లు విన్నవించారు. అయితే సమయాభావంతో ఆమె రాలేకపోయారు. ఆ తర్వాత ఈ ఏడాది రెండో విడత మిషన్ పనుల ప్రారంభానికి ముందు రావాలని కోరగా అందుకు ఆమె సమ్మతించారు. కానీ అదే సమయంలో వరంగల్ ఉప ఎన్నిక ఉండటంతో రాలేదు.
ఇదిలా ఉంటే ఏప్రిల్‌లో ఢిల్లీలో జరగనున్న ‘వరల్డ్ వాటర్ వీక్’ సదస్సుకు రావాలని ఉమాభారతి ఇటీవల స్వయంగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఈ సదస్సులో మిషన్ కాకతీయపై వివరించాలని కోరారు. ఇదే సందర్భంగా రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ పనులను పరిశీలించేందుకు వస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ఏప్రిల్ రెండో వారంలో ఆమె రాష్ట్రానికి రానున్నారని నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి.
454 చెరువులకు రూ.129 కోట్లు: మిషన్ కాకతీయలో భాగంగా రాష్ట్రంలోని 454 చెరువుల పనులకు రూ.129.64 కోట్ల మేరకు మంగళవారం నీటిపారుదల శాఖ పరిపాలనా అనుమతులు ఇచ్చింది. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు.