సయోధ్య... ససేమిరా ! | Will go on hunger strike if Cauvery dispute continues: Uma Bharti | Sakshi
Sakshi News home page

సయోధ్య... ససేమిరా !

Published Fri, Sep 30 2016 1:54 AM | Last Updated on Thu, Sep 27 2018 8:27 PM

సయోధ్య... ససేమిరా ! - Sakshi

సయోధ్య... ససేమిరా !

 = కేంద్రమంత్రి ఉమాభారతి మధ్యవర్తిత్వం విఫలం
 = నిపుణుల పరిశీలనకు ఒప్పుకోని తమిళనాడు
 = ఇరు రాష్ట్రాల ప్రజలు సంయమనంతో నడుచుకోవాలి
 = విరుద్ధంగా ప్రవర్తిస్తే సరిహద్దులో                                    
  నిరాహార దీక్ష కు దిగుతా : ఉమాభారతి హెచ్చరిక
 = మాకు తాగడానికే నీళ్లు లేవంటే వారికి వ్యవసాయానికి
  ఇవ్వాలంటారు.. ఇదెక్కడి న్యాయం : సీఎం సిద్ధు
 = నేడు సుప్రీం కోర్టులో విచారణ

 
 సాక్షి, బెంగళూరు : విడవమంటే పాముకు కోపం... కరవమంటే కప్పకు కోపం అన్న చందంగా తయారైంది కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల పరిస్థితి. కావేరి నీరు విడుదల చేయలేమని కర్ణాటక చట్టసభల్లో తీసుకున్న నిర్ణయం... విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెల్సిందే. కేంద్రం మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం సూచించిన నేపథ్యంలో కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉమా భారతి రంగంలోకి దిగారు. గురువారం ఢిల్లీలో కర్ణాటక తరఫున సీఎం సిద్ధరామయ్యతో పాటు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎంపీ పాటిల్, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అరవింద్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.
 
 తమిళనాడు తరఫున ఆ రాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రి ఎడప్పాడి.ఎస్.పళని స్వామి, ముఖ్య కార్యదర్శి రామ్‌మోహన్‌రావ్ తదితరులు పాల్గొన్నారు. నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కర్ణాటక ప్రభుత్వం తమ రాష్ట్రంలోని కావేరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న నాలుగు జలాశ యాల్లో ప్రస్తుత నీటి మట్టం, తాగునీటి అవసరాలకు కావాల్సిన నీరు తదితర విషయాలన్నింటినీ కేంద్రమంత్రి ఉమా భారతి దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా కర్ణాటకతో పాటు తమిళనాడులో కావేరి విషయమై క్షేత్రస్థాయి పరిశీలనకు నిపుణుల కమిటీని పంపించాలని విన్నవించింది. అయితే ఇందుకు తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేసింది.
 
 ట్రిబ్యునల్ ఆదేశాలతో పాటు సుప్రీంకోర్టు సూచనల మేరకు నీటిని విడుదల చేయాల్సిందేనని ఆ రాష్ట్ర ప్రతినిధులు తేల్చి చెప్పారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదర్చడానికి ఉమాభారతి యత్నించి విఫలమయ్యారు.  సమావేశం అనంతరం కేంద్ర మంత్రి ఉమాభారతి, సీఎం సిద్ధు వేర్వేరుగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండగా కావేరి నదీ జలాల విడుదలకు సంబంధించి నేడు (శుక్రవారం) సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. కాగా కావేరి నీటి విడుదల విషయమై 2013లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై తమిళనాడు దాఖలు చేసిన కోర్టు ధిక్కార కేసు శుక్రవారం విచారణకు రానుంది.
 
 సరిహద్దులో స్వయంగా నిరసనకు దిగుతా :  కేంద్ర ఉమాభారతి
 సుప్రీం కోర్టు సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం కావేరి విషయంలో కేంద్రం మధ్యవర్తిత్వం వహించిందని, అయితే దురదృష్టవశాత్తు ఈ సయోధ్యలో ఎటువంటి పురోగతి కనిపించలేదని కేంద్రమంత్రి ఉమాభారతి పేర్కొన్నారు. నిపుణుల కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించాలన్న కర్ణాటక విన్నపాన్ని  తమిళనాడు వ్యతిరేకించిందన్నారు. ఇంతకంటే తాను ప్రస్తుతానికి ఏమీ చెప్పలేనని, సమావేశంలో జరిగిన విషయాలను అటార్నీ జన రల్ ద్వారా సుప్రీంకోర్టుకు తెలియజేస్తామన్నారు. కావేరి విషయంలో ఇరు రాష్ట్రాల ప్రజలు సంయమనంతో వ్యవహరించాలన్నారు.
 
  ఇందుకు వ్యతిరేకంగా జరిగితే తానే స్వయంగా రెండు రాష్ట్రాల సరిహద్దులో నిరాహార దీక్షకు దిగుతానని ఆమె హెచ్చరించారు.  ‘ఇది బెదిరించడానికి చెబుతున్న విషయం కాదు. పరిస్థితి అర్థమయ్యేలా వివరిస్తూ చేస్తున్న అభ్యర్థన మాత్రమే.’ అన్నారు. ‘తాను సన్యాసం స్వీకరించింది కర్ణాటకలోని పెజావరస్వామిజీ సమక్షంలో’ తన గురువుకు తమిళనాడులో కూడా భక్తులు ఉన్నారు. పూర్వం యద్ధం ఉదయం మాత్రమే ఇరువైపులా కత్తులు దూసుకునేవారు. సూర్యాస్తమయం అలసిన సైనికులకు అటువైపు వారు ఇటువైపు వారు తాగునీరు ఇచ్చేవారు. అందువల్ల తాగునీటి విషయంలో రాజకీయాలు పక్కనపెట్టి ఆలోచించాలన్నారు.
 
 వారికి వ్యవసాయ అవసరాలు...
 మాకు తాగునీటి అవసరాలు : సీఎం సిద్ధు
 కర్ణాటకలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నందు వల్లే తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులను సమావేశంలో వివరించామని, కర్ణాటకలో 18,75,000 హెక్టార్లను సాగు చేయడానికి తమకు ట్రిబ్యునల్ అనుమతి ఉండగా సరైన వర్షాలు లేకపోవడం వల్ల కేవలం 6,15,000 హెక్టార్లను మాత్రమే సాగులో ఉందన్నారు.  అయితే తమిళనాడు  కావేరి నదీ పరివాహక ప్రాంతంలో ఇప్పటికే 17 లక్షల హెక్టార్లలో విత్తన ప్రక్రియ ముగిసిందని, ఇక మెట్టూరు డ్యాంలో ఉన్న 43 టీఎంసీల నీరు ప్రస్తుత సాంబా పంటకు సరిపోతుందన్నారు.
 
  అంతేకాకుండా వారికి ఇప్పటికే మంచి వర్షాలు పడ్డాయని, ఇక అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ కూడా సాధారణ వర్షాలు పడుతాయని భారత వాతావరణ శాఖ కూడా చెప్పిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయినా తమకు రావాల్సిన కావేరి నీరు ఇవ్వాల్సిందనని తమిళనాడు డి మాండ్ చేయడం సరికాదన్నారు. ఆ నీటిని కూడా సాగుకు వినియోగిస్తామని చెబుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. తాము తాగునీటి కోసమే కావేరి అని వివరిస్తున్నామని వాపోయారు. ఇక సమావేశంలో ఇరు రాష్ట్రాలో క్షేత్రస్థాయి పర్యటనకు నిపుణుల కమిటీ పంపించాలన్న తమ ప్రతిపాదనను వారు ఎందుకు వ్యతిరేకించారో అర్థం కావడం లేదన్నారు.
 
 తమకు సుప్రీంకోర్టుపై అపార గౌరవం ఉందని అయితే తమిళనాడుకు వదలడానికి తమ వద్ద కావేరి జలాలు లేవని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కాగా తమిళనాడు ఉమాభారతి సమక్షంలో తమినాడు ప్రతినిధులు రోజుకు 5 వేల క్యూసెక్కులు చొప్పున పది రోజులు నీటిని విడుదల చేయాలని మొదట కోరింది. లేదంటే  3,400 క్యూసెక్కులను పది రోజుల పాటు ఇవ్వాలని కర్ణాటకను కోరింది. అయితే ఈ రెండు విషయాలకు కర్ణాటక ఒప్పుకోలేదని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement