దేవెగౌడ నిరాహార దీక్ష
సాక్షి, బెంగళూరు: కావేరి జలాల వివాదంపై ప్రధాని మోదీ మధ్యవర్తిత్వం వహించి సమస్యను పరిష్కరించాలనే ప్రధాన డిమాండ్‌తో మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ నేత దేవెగౌడ శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో అనూహ్యంగా నిరాహార దీక్షకు దిగారు. కురువృద్ధుడు, 84 ఏళ్ల దేవెగౌడ మండుటెండలో విధానసౌధ సమీపంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద దీక్షలో కూర్చున్నారు. కావేరి క్షేత్రస్థాయి పరిశీలనకు తమిళనాడుతో పాటు కర్ణాటకకు కూడా కేంద్రం నిపుణులను పంపించాలనేది ఆయన డిమాండ్. దీక్ష సమాచారం అందుకున్న కేంద్రమంత్రి అనంత్ కుమార్ రాత్రి 8 గంటల ప్రాంత ంలో శిబిరం వద్దకు చేరుకుని ప్రధాని మెదీని మధ్యవర్తిత్వం వహించే విషయంలో ఒప్పిస్తానని హామీ ఇవ్వడంతో ఆయన రాత్రి 8.45 నిముషాలకు దీక్ష విరమించారు.
అంతకు ముందు ఉదయం దీక్ష విషయం తెలుసుకున్న సీఎం సిద్ధరామయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయన పోరాటానికి సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే భేటీ సమయంలో దేవెగౌడ భావోద్వేగానికి లోనై కంటతడిపెట్టారు. ప్రధాని మోదీ మధ్యవర్తిత్వం వహించే విషయంపై స్పష్టత వచ్చేవరకు తాను నిరవధిక నిరాహార దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు. కనీసం నా చావు తరువాతైనా నరేంద్ర మోదీ మధ్యవర్తిత్వం వహిస్తారేమోనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, అంతకు ముందు దేవెగౌడ మీడియాతో మాట్లాడుతూ...ఇప్పటి వరకూ కావేరి నదీ జలాల పంపకం విషయమై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు కర్ణాటకకు మరణశాసనం లాంటివని ఆవేదన వ్యక్తం చేశారు.
కర్ణాటక ప్రజలు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉత్పన్నమవుతుంటే తమిళనాడుకు వ్యవసాయానికి కావేరి నదీ జలాలను వదలాలని చెప్పడం ఎంతవరకూ సమంజసమని దేవెగౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో కేంద్ర మంత్రులు సదానందగౌడ, అనంతకుమార్‌లు ఆయన్ను కలిసి దీక్షను విరమింపజేయాలని కోరారు. ఈ విషయంలో తాము ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆయన తన దీక్షను ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించారు.
కాగా దీక్షకు ముందు ఆయన బెంగళూరులోని బసవన గుడిలోని కారంజి ఆంజనేయ దేవస్థానంలో, కే.ఆర్ రోడ్డులోని కోటే వెంకటరమణ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇదిలా ఉండగా 84 ఏళ్ల వయస్సున్న దేవెగౌడ ఆమరణ నిరాహార దీక్షకు దిగడం పట్ల పార్టీలకు అతీతంగా అందరు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వెంటనే ఈ విషయంలో కలుగజేసుకోవాలని డిమాండ్ చేశారు. జేడీఎస్ కార్యకర్తలు తమ నాయకుడికి ఏమవుతుందోనని ఆందోళన చెందారు.