గాంధీ విగ్రహం వద్ద మాజీ ప్రధాని దీక్ష
బెంగళూరు: కావేరి జలాల వివాదం కర్ణాటకలో తీవ్ర ఉద్రిక్తతలు రేపుతోంది. ఈ విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని పేర్కొంటూ మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ శనివారం ఆందోళనకు దిగారు. కర్ణాటక విధానసౌధ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య దీక్షవేదిక వద్ద దేవెగౌడను పరామర్శించి సంఘీభావం తెలిపారు.
’కావేరి జలాల విషయంలో ఈ రోజు సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీ కేబినెట్ భేటీ నిర్వహిస్తారని నాకు తెలియవచ్చింది. ప్రధాని ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని నేను కోరుతున్నాను. మేమేమీ నేరగాళ్లం కాదు. రెండురాష్ట్రాల్లోని రిజర్వాయర్లలో ఉన్న నీటిని పరిశీలించేందుకు నిపుణులను ఏర్పాటు చేయాలి’అని దేవెగౌడ పేర్కొన్నారు. కావేరి జలాల విషయంలో ప్రధాని మోదీ కర్ణాటకకు న్యాయం చేస్తారని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 1 నుంచి ఆరోతేదీ వరకు రోజుకు ఆరువేల క్యూసెక్కుల చొప్పున నీటిని తమిళనాడుకు విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కర్ణాటకలో మళ్లీ ఆందోళనలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.