నిలక్కళ్ వద్ద వాహనాల్లో ఆడవాళ్లు ఉన్నారో లేదో చెక్‌చేస్తున్న అయ్యప్ప మహిళా భక్తులు
తిరువనంతపురం: మాస పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం బుధవారం సాయంత్రం నుంచి ఐదు రోజులపాటు తెరుచుకోనుంది. అన్ని వయసుల స్త్రీలను ఆలయంలోకి అనుమతించాలంటూ సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక ఆలయాన్ని భక్తుల కోసం తెరవడం ఇదే ప్రథమం. తీర్పుకు వ్యతిరేకంగా కేరళలో పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్వామియే శరణమయ్యప్ప అంటూ భజన చేస్తూ మహిళలు సహా అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లేందుకు ప్రధాన ద్వారమైన నిలక్కళ్ వద్దకు చేరి నిషేధిత వయస్సుల్లోని స్త్రీలను కొండ ఎక్కనివ్వకుండా అడ్డుకుంటున్నారు.
10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు శబరిమల ఆలయానికి వెళ్లకుండా ఇన్నాళ్లూ నిషేధం ఉండగా, వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఆలయ ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పునివ్వడం తెలిసిందే. సుప్రీం తీర్పును నిరసిస్తూ త్రివేండ్రంలో ఓ మహిళ బహిరంగంగా ఉరివేసుకునేందుకు ప్రయత్నించగా ఆమెను కాపాడారు. తీర్పు వచ్చాక తొలిసారిగా బుధవారమే ఆలయం తెరచుకోనుంది.
ఆలయ భాగస్వామ్య పక్షాలతో మంగళవారం ట్రావెన్‌కోర్ దేవస్థాన మండలి భేటీ అయినప్పటికీ ఏకాభిప్రాయం లేకపోవడంతో కేరళలో నిరసనలను తగ్గించేందుకు తోడ్పడే పెద్ద నిర్ణయాలేవీ తీసుకోలేకపోయింది. తీర్పును పునఃసమీక్షించాల్సిందిగా సుప్రీంకోర్టును తాము కోరేది లేదని కేరళలోని వామపక్ష ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పడం, అటు కేంద్రం నుంచి కూడా స్పందన లేకపోవడంతో నిరసనలు తాజాగా మరింత తీవ్రరూపం దాల్చాయి. ఓ భక్తురాలు మాట్లాడుతూ ‘నిషేధిత వయసులో ఉన్న ఏ మహిళనూ ముందుకు వెళ్లనివ్వం. వారు ఆలయంలోకి ప్రవేశించలేరు’ అని చెప్పారు.
కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావాలి: ఎంపీ
సుప్రీం కోర్టు తీర్పు నుంచి తప్పించుకునేందుకు కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావాలని పత్తనంతిట్ట కాంగ్రెస్ ఎంపీ ఆంటోనీ డిమాండ్ చేశారు. శబరిమల ఆలయం పత్తనంతిట్ట నియోజకవర్గం పరిధిలోనే ఉంటుంది. సుప్రీం తీర్పుకు వ్యతిరేంగా ఎరుమేలిలో ఓ ధర్నాను ఆంటోనీ మంగళవారం ప్రారంభించారు. ఈ ధర్నాలో అన్ని మతాల మహిళలూ పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ ‘మరో నెలలో శబరిమల యాత్ర ప్రారంభం కానుంది. యాత్రికులకు సౌకర్యాలు కల్పించడం కోసం ఈ నియోజకవర్గంలోని వ్యాపారులు ఏటా ఈ సమయానికల్లా ఏర్పాట్లు చేసుకుంటూ ఉండేవారు. కానీ ఈసారి అందరూ నిరసనల్లో పాల్గొనడానికే వెళ్తున్నారు’ అని ఎంపీ చెప్పారు.
వెళ్లకుండా అడ్డుకోనివ్వం: సీఎం
అయ్యప్ప గుడికి వెళ్తున్న మహిళలను నిలక్కళ్ వద్ద భారీ సంఖ్యలో అయ్యప్ప భక్తు లు అడ్డుకుంటున్నారు. ప్రైవేటు వాహనాలేగాక కేఎస్‌ఆర్టీసీ బస్సుల్లోకి ఎక్కి నిషేధిత వయస్సుల్లో ఉన్న స్త్రీలను దించి వేస్తున్నారు. ఆలయానికి వెళ్తున్న భక్తులను అడ్డుకునేందుకు తాము ఎవరినీ అనుమతించబోమని కేరళ సీఎం విజయన్ చెప్పారు. ‘భక్తులను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కోర్టు తీర్పును అమలు చేస్తాం’ అని అన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధరన్ పిళ్లై అన్న మాటలను ప్రస్తావించిన విజయన్.. రాష్ట్రం లో సమస్యలు, కల్లోలం సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. శబరిమలకు వెళ్లే నిషేధిత వయసుల్లోన్ని స్త్రీలను రెండు ముక్కలు చేసి ఓ భాగాన్ని సీఎంకు, మరో భాగాన్ని ఢిల్లీకి పంపాలంటూ బీజేపీ నేత, నటుడు కొల్లాం తులసి చేసిన వ్యాఖ్యలను సీఎం ఖండించారు. అన్ని వయసుల మహిళలను అనుమతిస్తే సామూహిక ఆత్మహత్యలు చోటుచేసుకుంటాయని శివసేన పార్టీ రాష్ట్ర విభాగం కూడా హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment