వణుకు పుట్టిస్తున్న గజరాజు!
గువహటి: ఏనుగుల బీభత్సంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. అస్సాంలోని గోల్పారా జిల్లాలో శుక్రవారం రాత్రి ఓ గజరాజు నానా బీభత్సం సృష్టించడంతో పాటు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు సహా మరో చిన్నారిపై దాడిచేసి వారి చావుకు కారణమైంది. దీంతో ఆగ్రహించిన గెంద్రపారా గ్రామస్తులు ఏనుగుల దాడుల నుంచి తమను కాపాడాలంటూ వారు శనివారం ఉదయం రోడ్డుపై బైఠాయించారు. అటవీ అధికారుల వైఫల్యంతోనే ఏనుగులు గ్రామాల్లోకి వస్తున్నాయని ఆరోపించారు.
ఆ ముగ్గురి మృతదేహాలతో జాతీయ రహదారి 37పై అడ్డంగా కూర్చుని నిరసన తెలిపారు. అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబసభ్యులకు నష్టపరిహారం ఇప్పించి వారికి న్యాయం చేయాలని కోరారు. గత కొన్ని రోజుల నుంచి ఈ ప్రాంతంలో గజరాజులు తిరుగుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని గెంద్రపారా వాసులు తెలిపారు. ఇంత దారుణం జరిగినా ఏనుగును పట్టుకునేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని అధికారులు ఇప్పటికైనా మేల్కోని తమ సమస్య పరిష్కారం చేయాలన్నారు.