
తిరువనంతపురం : బీజేపీ సీనియర్ నాయకురాలు మేనకా గాంధీపై కేసు నమోదైంది. మలప్పురం జిల్లా, జిల్లా వాసులను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ మలప్పురానికి చెందిన సుభాష్ చంద్రన్ అనే అడ్వకేట్ గురువారం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మే 29న జరిగిన ఏనుగు ఘటన పాలక్కడ్ జిల్లాలో చోటుచేసుకుందని, మలప్పురం జిల్లాలో కాదని ఆయన స్పష్టం చేశారు. ఏనుగు ఘటనకు కొంతమంది మతం రంగు పులుముతున్నారని ఆయన పేర్కొన్నారు. ముస్లిం ప్రజలు ఎక్కువగా ఉన్న మలప్పురం జిల్లాపై సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ మలప్పురం జిల్లాపై, జిల్లా వాసులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ( ఏనుగు మృతి కేసులో తొలి అరెస్టు )
కాగా, బుధవారం మేనకా గాంధీ ట్విటర్ వేదికగా ఏనుగు ఘటనపై స్పందిస్తూ.. ‘‘మలప్పురం జిల్లాలో జంతువులపై అమానుషంగా ప్రవర్తించే నేర ప్రవృత్తి ఎక్కువ. ఇప్పటివరకు ఒక్క నేరస్తుడిపై కూడా చర్యలు తీసుకోలేదు. ఇలా అయితే వాళ్లు నేరాలు చేస్తూనే ఉంటారు’’ అని పేర్కొన్నారు. (చదవండి: ఏనుగు నోట్లో పైనాపిల్ బాంబ్)