ఏనుగుతో సెల్ఫీ తెచ్చిన తంటా...!
తిరువనంతపురంః సెల్ఫీల పిచ్చి రోజురోజుకూ ముదిరి పాకాన పడుతోంది. యాండ్రాయిడ్ ఫోన్ల పుణ్యమాని జనంలో సెల్ఫీల పిచ్చి ముదిరిపోతోంది. ఫ్రెంట్ కెమెరాతో ఎవరికి వారు ఫొటోలు తీసుకునే అవకాశాన్ని కల్పించిన ఆధునిక పరిజ్ఞానం.. మితిమీరిన పోకడలతో తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతోంది. రైల్వే ట్రాక్ లు, సఫారీలు, రహదార్లు, ఎత్తైన కొండలు, సముద్ర తీర ప్రాంతాలు ఒక్కటేమిటి సెల్ఫీల బాగోతానికి ప్రతి వస్తువూ పదార్థంగానే మారుతోంది. ప్రమాదపుటంచులకు ప్రాణాలను నెట్టేస్తోంది. తాజాగా తిరువనంతపురంలో జరిగిన ఏనుగు దాడి అందుకు మరోసారి తార్కాణంగా నిలుస్తోంది.
సింహం పడుకుందికదాని జూలుతో జడేయాలనుకోవద్దంటూ ఓ సినీ హీరో చెప్పిన చందంగా మారింది కేరళలోని తిరువనంతపురం వద్ద జరిగిన ఘటన. ఏనుగు కనిపించింది కదాని దాంతో సెల్ఫీ దిగుదామని ప్రయత్నించాడు ఓ యువకుడు. అయితే అప్పటికే ఆలయాల వేడుకల్లో తీవ్రంగా విశ్రాంతి తీసుకుంటున్నసదరు జంబోకు కోపం తలకెక్కిందో ఏమో 37 ఏళ్ళ వయసున్న అతడిపై దాడికి దిగింది. సంఘటనలో తీవ్ర గాయాలపాలైన అతడు స్థానిక వైద్య కళాశాల ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ అరటిపళ్ళ గెలను తీసుకుని ఏనుగు దగ్గరకు వెళ్ళిన వ్యక్తి దానికి దగ్గరగా నిలబడి వరుసగా సెల్ఫీలు తీసుకోవడం ప్రారంభించాడు. దీంతో ఆగ్రహించిన జంబో.. తొండంతో అతడిపై దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన ఆ సెల్ఫీ ప్రేమికుడు రక్షించమంటూ అరుపులు ప్రారంభించడంతో దగ్గరల్లో ఉన్న జనం అతడ్ని కాపాడి ఆస్పత్రిలో చేర్పించారు.