వారిని పాక్ ఏమీ చేయదు..
ముంబై దాడుల కేసులో సయీద్, లఖ్వీలపై లష్కరే, అల్ కాయిదా అంచనా: హెడ్లీ
ముంబై: ముంబై దాడుల సూత్రధారులు హఫీజ్ సయీద్, జకీవుర్ రెహమాన్‌లపై పాకిస్తాన్ పైపై చర్యలు మాత్రమే తీసుకుంటుందని లష్కరే తోయిబా, అల్ కాయిదాలకు తెలుసని దాడుల సూత్రధారి, లష్కరే ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ చెప్పాడు. ఆ దాడుల తర్వాత కొన్ని నెలల్లోలోపు భారత్‌లో మరో ఉగ్ర దాడికి ప్రణాళిక రచించామని శనివారమిక్కడి కోర్టుకు అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపాడు. సోమవారం ప్రారంభమైన అతని వాగ్మూలం శనివారం ముగిసింది. ఈ విచారణను నిందితుడు అబు జుందాల్ న్యాయవాది క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కోర్టు వాయిదా వేసింది. ముంబై దాడుల తర్వాత సయీద్, లఖ్వీల భద్రతపై ఆందోళన చెందానని, దీనిపై లష్కరే కీలక వ్యక్తి సాజిద్ మీర్, అల్ కాయిదా సభ్యుడు అబ్దుల్ పాషా (గతంలో లష్కరే)తో సంప్రదింపులు జరిపానని హెడ్లీ వెల్లడించాడు.
హెడ్లీ ఇంకా ఏం చెప్పాడంటే..
► పాక్ కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎఫ్‌ఐఏ) లష్కరే సభ్యులను విచారిస్తున్న సమయంలో ‘ఓల్డ్ అంకుల్’(సయీద్), ‘యంగ్ అంకుల్’(లఖ్వీ) ఎలా ఉన్నారని మీర్‌ను అడిగా. యంగ్ అంకుల్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారని మీర్ బదులిచ్చాడు. ఓల్డ్ అంకుల్ కూడా ఆరోగ్యంగా ఉన్నాడని అన్నాడు. అన్నీ సర్దుకొంటాయంటూ పాషా చెప్పాడు. సయూద్, లఖ్వీలతో పాటు ఇతర లష్కరే సభ్యులపై పాక్ నామమాత్రపు చర్యలే తీసుకుంటుందని పాషా అంతరార్థం.
► ముంబై దాడులు జరిగిన 8 నెలల తరువాత మీర్ నుంచి నాకో మెయిల్ వచ్చింది... ‘ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్’ చేయాలి అని. దీని అర్థం... భవిష్యత్ దాడులకు భారత్‌లో చోటు వెతకమని! ఈసారి ‘రాహుల్(భట్) సిటీ’లో దాడులు వద్దన్నా. రాహుల్ సిటీ అంటే ముంబై.
► ఇలియాస్ కశ్మీరీ(అల్ కాయిదా) కోరిక మేరకు 2009లో పుష్కర్, గోవా, పుణెల్లో రెక్కీ నిర్వహించా. ఐఎస్‌ఐ మేజర్ ఇక్బాల్ ఆదేశాల మేరకు పుణెలోని భారత సైనిక దక్షిణ దళ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించా.
► శివసేన మాజీ సభ్యుడు రాజారామ్ రెగేతో సంబంధాలు ఏర్పరచుకోవాలని మీర్, ఇక్బాల్ నాకు చెప్పారు. 2008 మే 19న ఓ ఇన్వెస్ట్‌మెంట్ గురించి రెగే మెయిల్ పంపాడు. రాణా ఇన్వెస్ట్‌మెంట్‌కు సంసిద్ధత వ్యక్తం చేశాడు. కానీ ఇక్బాల్ ఉగ్రదాడులకూ సిద్ధంగా లేడు. సైన్యం, పార్లమెంట్‌కు సంబంధించిన సమాచారం మాత్రమే కావాలన్నాడు. రెగే ఆ పని చేయగలుగుతాడా అని అడిగాడు. శివసేన చీఫ్ బాల్ ఠాక్రే, ఆయన కుమారుడు ఉద్ధవ్‌లను అమెరికాకు పిలవాలని రెగేకు సూచించా. ముంబై దాడులతర్వాత అనేకసార్లు పాక్‌కు వెళ్లా. కానీ ఎఫ్‌ఐఏ నన్ను ఎన్నడూ విచారణకు పిలవలేదు.
కాగా, కరాచీలోని కంట్రోల్ రూమ్ నుంచి లష్కరే సభ్యులకు, దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు మధ్య జరిగిన సంభాషణలను హెడ్లీ ముందుంచగా.. అబె కఫా, మీర్, అబు అల్ కమా గొంతులను గుర్తించగలిగాడు.