Mumbai attacks case
-
ఉగ్రవాది సాజిద్ మీర్ బ్లాక్‌లిస్టుపై... మోకాలడ్డిన చైనా
ఐక్యరాజ్యసమితి: చైనా మరోసారి తన దుష్టబుద్ధిని బయటపెట్టుకుంది. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చాలంటూ ఐరాసలో భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనను అడ్డుకుంది. 2008 ముంబై దాడుల కేసులో నిందితుడైన మీర్‌ను భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చింది. ఐరాస భద్రతా మండలికి చెందిన 1267 అల్–ఖైదా శాంక్షన్స్ కమిటీ కింద మీర్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చాలని భారత్, అమెరికా గురువారం ప్రతిపాదించాయి. దీన్ని చైనా అడ్డుకుంది. 26/11 ముంబై దాడుల ఉదంతంలో పాత్రధారి అయిన మీర్ తలపై అమెరికా 5 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. ఉగ్రవాద కార్యకాలాపాలకు నిధులు సమకూరుస్తున్నట్లు రుజువు కావడంతో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఈ ఏడాది జూన్‌లో మీర్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
జైలు నుంచి విడుదలైన 2 రోజులకే..
న్యూయార్క్ : 26/11 ముంబై దాడుల నిందితుడు తహవూర్ రాణాను అమెరికా పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. 2008లో జరిగిన ముంబై దాడులకు సంబంధించి చికాగో వ్యాపారవేత్త తహవూర్ రాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఉగ్రమూకలకు సహాయం చేసిన కేసులో ఆయనకు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది చికాగో కోర్టు. ఈ నేపథ్యంలో రాణా పది సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనుభవించాడు. ఆరోగ్య పరిస్థితులు క్షీణించటం, కరోనా వైరస్ సోకటంతో వారం రోజుల క్రితం అతడు జైలునుంచి విడుదలయ్యాడు. అయితే అతడ్ని అప్పగించాలని భారత్ కోరగా జైలునుంచి విడుదలైన రెండు రోజులకే జూన్ 10న లాస్ ఏంజిల్స్ పోలీసులు రాణాను అదుపులోకి తీసుకున్నారు. భారత్- అమెరికా ద్వైపాక్షిక ఒప్పందాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసిస్టెంట్ యూఎస్ అటార్నీ జాన్ ఎల్ జూలెజియన్ పేర్కొన్నారు. ( కసబ్‌ను గుర్తుపట్టిన ఆ ‘హీరో’ ఫుట్‌పాత్‌పై.. ) కాగా, 2008 నవంబర్ 26న 10 మంది ఉగ్రవాదులు దేశ వాణిజ్య రాజధానిలో చొరబడి కాల్పులకు తెగబడిన ఘటనలో దాదాపు 166 మంది చనిపోయారు. ఈ మారణకాండకు కారణమైన ఉగ్రవాదుల్లో ప్రాణాలతో పట్టుబడింది కసబ్ మాత్రమే. ముంబై దాడుల కేసులో రాణాపై 2018లో ఎన్ఐఏ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. -
వారిని పాక్ ఏమీ చేయదు..
ముంబై దాడుల కేసులో సయీద్, లఖ్వీలపై లష్కరే, అల్ కాయిదా అంచనా: హెడ్లీ ముంబై: ముంబై దాడుల సూత్రధారులు హఫీజ్ సయీద్, జకీవుర్ రెహమాన్లపై పాకిస్తాన్ పైపై చర్యలు మాత్రమే తీసుకుంటుందని లష్కరే తోయిబా, అల్ కాయిదాలకు తెలుసని దాడుల సూత్రధారి, లష్కరే ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ చెప్పాడు. ఆ దాడుల తర్వాత కొన్ని నెలల్లోలోపు భారత్‌లో మరో ఉగ్ర దాడికి ప్రణాళిక రచించామని శనివారమిక్కడి కోర్టుకు అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపాడు. సోమవారం ప్రారంభమైన అతని వాగ్మూలం శనివారం ముగిసింది. ఈ విచారణను నిందితుడు అబు జుందాల్ న్యాయవాది క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కోర్టు వాయిదా వేసింది. ముంబై దాడుల తర్వాత సయీద్, లఖ్వీల భద్రతపై ఆందోళన చెందానని, దీనిపై లష్కరే కీలక వ్యక్తి సాజిద్ మీర్, అల్ కాయిదా సభ్యుడు అబ్దుల్ పాషా (గతంలో లష్కరే)తో సంప్రదింపులు జరిపానని హెడ్లీ వెల్లడించాడు. హెడ్లీ ఇంకా ఏం చెప్పాడంటే.. ► పాక్ కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎఫ్ఐఏ) లష్కరే సభ్యులను విచారిస్తున్న సమయంలో ‘ఓల్డ్ అంకుల్’(సయీద్), ‘యంగ్ అంకుల్’(లఖ్వీ) ఎలా ఉన్నారని మీర్‌ను అడిగా. యంగ్ అంకుల్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారని మీర్ బదులిచ్చాడు. ఓల్డ్ అంకుల్ కూడా ఆరోగ్యంగా ఉన్నాడని అన్నాడు. అన్నీ సర్దుకొంటాయంటూ పాషా చెప్పాడు. సయూద్, లఖ్వీలతో పాటు ఇతర లష్కరే సభ్యులపై పాక్ నామమాత్రపు చర్యలే తీసుకుంటుందని పాషా అంతరార్థం. ► ముంబై దాడులు జరిగిన 8 నెలల తరువాత మీర్ నుంచి నాకో మెయిల్ వచ్చింది... ‘ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్’ చేయాలి అని. దీని అర్థం... భవిష్యత్ దాడులకు భారత్‌లో చోటు వెతకమని! ఈసారి ‘రాహుల్(భట్) సిటీ’లో దాడులు వద్దన్నా. రాహుల్ సిటీ అంటే ముంబై. ► ఇలియాస్ కశ్మీరీ(అల్ కాయిదా) కోరిక మేరకు 2009లో పుష్కర్, గోవా, పుణెల్లో రెక్కీ నిర్వహించా. ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్ ఆదేశాల మేరకు పుణెలోని భారత సైనిక దక్షిణ దళ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించా. ► శివసేన మాజీ సభ్యుడు రాజారామ్ రెగేతో సంబంధాలు ఏర్పరచుకోవాలని మీర్, ఇక్బాల్ నాకు చెప్పారు. 2008 మే 19న ఓ ఇన్వెస్ట్మెంట్ గురించి రెగే మెయిల్ పంపాడు. రాణా ఇన్వెస్ట్‌మెంట్‌కు సంసిద్ధత వ్యక్తం చేశాడు. కానీ ఇక్బాల్ ఉగ్రదాడులకూ సిద్ధంగా లేడు. సైన్యం, పార్లమెంట్‌కు సంబంధించిన సమాచారం మాత్రమే కావాలన్నాడు. రెగే ఆ పని చేయగలుగుతాడా అని అడిగాడు. శివసేన చీఫ్ బాల్ ఠాక్రే, ఆయన కుమారుడు ఉద్ధవ్లను అమెరికాకు పిలవాలని రెగేకు సూచించా. ముంబై దాడులతర్వాత అనేకసార్లు పాక్‌కు వెళ్లా. కానీ ఎఫ్ఐఏ నన్ను ఎన్నడూ విచారణకు పిలవలేదు. కాగా, కరాచీలోని కంట్రోల్ రూమ్ నుంచి లష్కరే సభ్యులకు, దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు మధ్య జరిగిన సంభాషణలను హెడ్లీ ముందుంచగా.. అబె కఫా, మీర్, అబు అల్ కమా గొంతులను గుర్తించగలిగాడు. -
అల్‌కాయిదా కూడా కుట్రపన్నింది
ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్‌పై దాడి చేయాలనుకుంది ♦ సిద్ధి వినాయక ఆలయం, నేవల్ ఎయిర్ స్టేషన్, విమానాశ్రయం కూడా ♦ ముంబై దాడుల లక్ష్యాల్లో ఉండాలని ఐఎస్ఐ, లష్కరే భావించాయి ♦ 26/11 దాడులపై మరిన్ని సంచలనాలు వెల్లడిస్తున్న డేవిడ్ హెడ్లీ ముంబై: 26/11 ముంబై దాడుల్లో కీలక పాత్ర పోషించి ఇటీవలే అప్రూవర్‌గా మారిన ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ అమెరికా నుంచి వీడియో లింక్ ద్వారా ముంబైలోని ప్రత్యేక కోర్టుకు ఇస్తున్న వాంగ్మూలాల్లో నాలుగో రోజు శుక్రవారం మరిన్ని సంచలన అంశాలు వెల్లడయ్యాయి. భారత్‌పై ఉగ్రదాడి చేయాలని అల్‌కాయిదా కూడా ఆసక్తి చూపిందని హెడ్లీ వెల్లడించారు. నేషనల్ డిఫెన్స్ కాలేజ్ లక్ష్యంగా దాడులు చేయాలని భావించిందన్నారు. నిత్యం రద్దీగా ఉండే సిద్ధి వినాయక ఆలయం, నేవల్ ఎయిర్ స్టేషన్, విమానాశ్రయాలను ముంబై దాడుల్లో లక్ష్యంగా చేసుకోవాలని లష్కరే, ఐఎస్ఐ ఆలోచించాయని, అయితే, ఆయా ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టంగా ఉంటుందని చెప్పి తాను వారిని అడ్డుకున్నానని చెప్పారు. భవిష్యత్‌లో శివసేన భవన్‌పై దాడి చేయాలని కాని, ఆ పార్టీ అధినేత( నాటి పార్టీ అధ్యక్షుడు బాల్ ఠాక్రేనుద్దేశించి)ను హతమార్చాలని కానీ లష్కరే ఆలోచించే అవకాశముందనే అభిప్రాయంతో శివసేన నేత రాజారామ్ రెగెతో సన్నిహితం కావడం కోసం తాను ప్రయత్నించానన్నారు. ‘ముంబై మారణ హోమం తరువాత 2009 ఫిబ్రవరిలో అల్‌కాయిదా కీలక నేత ఇల్యాస్ కశ్మీరీని కలిశాను. భారత్‌లో దాడులు చేయాలనుకుంటున్నామని, అందువల్ల మరోసారి ఇండియా వెళ్లాలని ఆయన నాకు సూచించారు. పలు ప్రాంతాలను.. ముఖ్యంగా ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్(ఎన్డీసీ)ని లక్ష్యంగా చేసుకోవాలనుకుంటున్నట్లు ఆయన నాకు చెప్పారు’ అని హెడ్లీ వెల్లడించారు. ఎన్డీసీని లక్ష్యంగా చేసుకోవడం వల్ల.. బ్రిగేడియర్ నుంచి జెనరల్ హోదాల వరకు.. అక్కడ ఉండే అనేకమంది సైన్యాధికారులను హతమార్చే అవకాశం ఉన్నందువల్ల వారికి అది ముఖ్యమైన లక్ష్యంగా మారిందని హెడ్లీ తెలిపారు. ‘ఎన్డీసీపై దాడి విజయవంతమైతే.. గతంలో భారత్, పాక్‌ల మధ్య జరిగిన యుద్ధాల్లో చనిపోయిన భారత సైన్యాధికారుల సంఖ్యను మించిపోయేలా మారణహోమం సృష్టించవచ్చని అల్‌కాయిదా మరో సభ్యుడు అబ్దుల్ రెహ్మాన్ పాషా నాకు వివరించారన్నారు. హెడ్లీ వెల్లడించిన మరికొన్ని అంశాలు.. ► అల్‌కాయిదా నేత ఇల్యాస్ కశ్మీరీ ఆదేశాల మేరకు పుష్కర్, గోవా, పుణెల్లోని చాబాద్ హౌజ్‌ల వద్ద రెక్కీ నిర్వహించాను. ఎన్డీసీ తరువాత అవే అల్‌కాయిదా ముఖ్య లక్ష్యాలు. ► బార్క్(బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్)లోని కీలక, రహస్య సమాచారాన్ని అందించగల ఉద్యోగులను ఐఎస్ఐ కోసం రిక్రూట్ చేయాలని మేజర్ ఇక్బాల్ నన్ను ఆదేశించారు. 2008 జులైలో బార్క్లోనికి వెళ్లి, ఆ ప్రాంగణాన్ని వీడియో తీసాను. ► ముంబైని మొత్తం సర్వే చేసిన తరువాత లష్కరే చీఫ్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ, సాజిద్ మిర్, అబు కాఫా, అబ్దుల్ రెహ్మాన్ పాషా, మేజర్ ఇక్బాల్‌లను పాకిస్తాన్లో పలుమార్లు కలిశాను. ► ముంబై దాడులకు ముందు ముంబైలోని చాబాద్ హౌజ్ వద్ద రెక్కీ చేశాను. అందులో ఇజ్రాయెల్ పౌరులు, యూదులు ఉంటారని, అది ముఖ్యమైన లక్ష్యమని సాజిద్ మిర్, అబ్దుల్ రెహ్మాన్ పాషా చెప్పారు. ► ముంబై దాడుల్లో పాల్గొనే ఉగ్రవాదులకు సంబంధించి రెండు ప్రత్యామ్నాయాలపై ఆలోచన చేశారు. లక్ష్యాల వద్దకు చేరుకుని, చివరివరకు మారణహోమం సృష్టించడం ఒక ప్రత్యామ్నాయం(స్ట్రాంగ్‌హోల్డ్ ఆప్షన్) కాగా.. దాడుల అనంతరం తప్పించుకుని పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు వెళ్లి, పోరాటం కొనసాగించడం(ఎగ్రెస్ ఆప్షన్) రెండో ప్రత్యామ్నాయం. అయితే మొదటిదాన్నే అమలు చేయాలని జకీ సాబ్(లష్కరే చీఫ్) ఆదేశించారు. ► దాడుల్లో పాల్గొంటున్న ఉగ్రవాదులకు ప్రత్యక్షంగా ఆదేశాలిచ్చేందుకు కరాచీలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. డిగ్రీ పూర్తి చేసినందుకు కంగ్రాట్స్.. 26/11గురించి నా మొదటి భార్య షాజియాకు చెప్పాను. దాడుల అనంతరం శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె ఈమెయిల్ చేసింది. ‘గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినందుకు కంగ్రాట్స్. కార్యక్రమం చాలా బాగా జరిగింది’ అని ఆమె కోడ్ బాషలో మెయిల్ చేసింది. ‘థాంక్యూ జానూ.. ఈ మార్కులు సాధించేందుకు కష్టపడి చదివాను’ అని రిప్లై ఇచ్చాను. వాంగ్మూలంపై వాగ్యుద్ధం.. న్యూఢిల్లీ: గుజరాత్ పోలీసుల చేతిలో ఇషత్ ్రజహాన్ నకిలీ ఎన్‌కౌంటర్‌కు గురైందన్న వాదనకు వ్యతిరేకంగా.. ఆమె లష్కరే ఆత్మాహుతి దళ ఉగ్రవాది అంటూ హెడ్లీ స్పష్టం చేసిన నేపథ్యంలో.. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య విమర్శనాస్త్రాల తీవ్రత పెరిగింది. భవిష్యత్తులో ప్రత్యర్థి కాగలడని ముందే ఊహించిన కాంగ్రెస్.. మోదీపై మొదట్నుంచీ ఉన్న వ్యతిరేకతతో వాస్తవాలకు మసిపూసిందని బీజేపీ ఆరోపించింది. దానిపై, ఉగ్రవాదుల మాటలను నమ్మడం బీజేపీ ఎప్పడ్నుంచి ప్రారంభించిందంటూ కాంగ్రెస్ తిప్పి కొట్టింది. హెడ్లీ వాంగ్మూలంతో ముంబై దాడుల్లో పాక్ పాత్ర పూర్తిగా బట్టబయలైందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు.పాక్‌లోని ఉగ్ర సంస్థలు శివసేనను శత్రువుగా భావించడం తమ పార్టీకి గర్వకారణమని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. శివసేన భవన్‌లోకి అనుమతించాలన్న డేవిడ్ హెడ్లీ అభ్యర్థనను అప్పుడే తోసిపుచ్చానని శివసేన మాజీ సభ్యుడు రాజారాం రెగే తెలిపారు. -
హెడ్లీ వాంగ్మూలం వాయిదా
ముంబై: వీడియో లింక్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ముంబై దాడుల కేసులో అప్రూవర్‌గా మారిన డేవిడ్ కోల్మన్ హెడ్లీ నుంచి వాంగ్మూలం తీసుకోవడాన్ని ప్రత్యేక కోర్టు గురువారానికి వాయిదా వేసింది. రెండు రోజులుగా వీడియో లింక్ ద్వారా ముంబై కోర్టు ముందు వాంగ్మూలం ఇస్తుండడం తెలిసిందే. బుధవారం వీడియో లింక్‌లో సాంకేతిక సమస్య తలెత్తంగా విచారణ గంట పాటు వాయిదావేశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో గురువారానికి వాయిదా వేశారు. కాగా, కట్టుకథలను ప్రచారం చేస్తూ.. పాక్ ప్రతిష్టను దెబ్బతీయడానికి భారత్ ప్రయత్నిస్తోందని ముంబై దాడులప్పుడు పాక్ హోంమంత్రిగా ఉన్న రెహ్మాన్ మాలిక్ ఆరోపించారు. -
ఉగ్రమూకలకు అండ ఐఎస్ఐనే..!
♦ ముంబై దాడులపై అప్రూవర్ హెడ్లీ నిర్ధారణ ♦ ఐఎస్ఐ నుంచి లష్కరే, జైషే, హిజ్బుల్‌కు ఆర్థిక, సైనిక, నైతిక సహకారం ♦ లష్కరే చీఫ్ లఖ్వీకి ఆదేశాలిచ్చింది ఐఎస్ఐ అధికారి బ్రిగేడియర్ రియాజ్ ♦ సిద్ధి వినాయక ఆలయం వద్ద కూడా రెక్కీ నిర్వహించా ♦ మొదట ‘తాజ్’లో రక్షణ రంగ శాస్త్రవేత్తల సదస్సుపై దాడికి ప్లాన్ చేశారు ♦ ఐఎస్ఐ, పాక్ ఆర్మీ.. రెండింటి కోసం పనిచేశా ముంబై: 26/11 ముంబై దాడుల కేసులో అప్రూవర్‌గా మారిన డేవిడ్ కోల్మన్ హెడ్లీ(55).. ఆ దాడుల్లో పాక్ ప్రమేయాన్ని నిర్ధారించే సంచలన వాస్తవాలను వెల్లడిస్తున్నాడు. భారత ఆర్థిక రాజధాని ముంబైపై ముష్కరుల దాడికి అండదండలు అందించింది పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐనేనని,ఆ దాడులకు సంబంధించి లష్కరే తోయిబా చీఫ్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీకి ఆదేశాలిస్తూ, పర్యవేక్షించింది స్వయంగా ఐఎస్ఐ అధికారైన బ్రిగేడియర్ రియాజ్ అని వెల్లడించాడు. పాక్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద సంస్థలు లష్కరే, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్లకు ఆర్థిక, సైనిక, నైతిక సహకారం ఐఎస్ఐ నుంచే అందుతోందన్నాడు. ముంబై దాడులకు ముందు తాను ముంబైలోని ప్రఖ్యాత సిద్ధి వినాయక ఆలయం నేవల్ ఎయిర్ స్టేషన్ వద్ద కూడా రెక్కీ చేశానన్నాడు. ఆ రెండు చోట్ల రెక్కీకి లష్కరేలో తన బాస్ సాజిద్ మిర్ తనను ఆదేశించారని తెలిపాడు. ‘సిద్ధి వినాయక వీడియో తీయాలని ప్రత్యేకంగా చెప్పాడు’ అని వివరించాడు. తాను లష్కరేతో పాటు పాక్ ఆర్మీ , ఐఎస్ఐ కోసమూ పని చేశానన్నాడు. భారత సైన్యంలోని కీలక సమాచారాన్ని సంపాదించాలని, భారత సైనికులను తమ గూఢచారులుగా నియమించేందుకు ప్రయత్నించాలని ఐఎస్ఐ అధికారి మేజర్ ఇక్బాల్ తనను ఆదేశించారని వెల్లడించాడు. వరుసగా రెండో రోజు మంగళవారం ప్రత్యేక కోర్టు జడ్జికి వీడియో లింక్ ద్వారా 4 గంటల పాటు హెడ్లీ వాంగ్మూలం ఇచ్చారు. లష్కరే లఖ్వీ ఫొటో చూపగా, అది లఖ్వీదేనన్నాడు. ముంబై దాడుల కేసులో అమెరికాలో హెడ్లీ 35 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. దాడులతో ఐఎస్ఐకి , తమ సైన్యానికి కానీ, తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదంటూ పాకిస్తాన్ ఇన్నాళ్లూ చేసిన బుకాయింపుల నిజరూపం హెడ్లీ చెబుతున్న వివరాలతో తేటతెల్లం కానుంది. నేడూ వాంగ్మూలం కొనసాగనుంది. కాగా, ముంబై దాడుల దోషులను చట్టం ముందు నిలిపేందుకు పూర్తి సహకారం భారత్‌కు అందిస్తామని అమెరికా పేర్కొంది. హెడ్లీ చెప్పిన మరికొన్ని వివరాలు.. ► 2007 నవంబర్, డిసెంబర్లలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో లష్కరే భేటీ ఏర్పాటు చేసింది. లష్కరే కీలక సభ్యులు సాజిద్ మిర్, అబూ కాఫా కూడా హాజరయ్యారు. ముంబైలో దాడులు చేయాలని నిర్ణయించారు. తాజ్ హోటల్ వద్ద రెక్కీ బాధ్యతను నాకు అప్పగించారు. త్వరలో తాజ్‌లో రక్షణ రంగ శాస్త్రవేత్తల సదస్సు జరగనుందని, సదస్సు లక్ష్యంగా దాడులు చేద్దామని సాజిద్ మిర్, కాఫా ప్రతిపాదించారు. హోటల్ భవన నమూనానూ రూపొందించారు. అయితే, దాడికి కావాల్సిన ఆయుధాలతో పాటు, దాడులకు పాల్పడే ఉగ్రవాదులను ముంబైలోకి చేరవేయడంలో సమస్యలు తలెత్తడంతో ఆ ప్రణాళికను విరమించుకున్నారు. సదస్సు ఎప్పుడు జరుగుతుందనే విషయంలో కచ్చితమైన సమాచారం లేకపోవడమూ మరో కారణం. ► ఐఎస్ఐ, లష్కరే సమన్వయంతో పనిచేస్తుంటాయి. నేను విన్న విషయాల ఆధారంగానే ఈ అభిప్రాయానికి వచ్చాను. ► ముంబై దాడుల బాధ్యత మొత్తం లష్కరే గ్రూప్ అంతటిది. అయితే, ఆ సంస్థ చీఫ్ లఖ్వీ కనుక దాడులకు సంబంధించిన ఆదేశాలు ఆయన నుంచి వచ్చి ఉండవచ్చు. ► ముంబైకి మొదటిసారి 2006, సెప్టెంబర్ 14న వచ్చాను. పలు ప్రాంతాలను సర్వే చేశాను. 2007లో పలుమార్లు హోటల్ తాజ్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద రెక్కీ నిర్వహించాను. 2008లో మహారాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం, నేవల్ ఎయిర్ స్టేషన్లపై రెక్కీ నిర్వహించాను. ఉగ్రవాదులు ఎక్కడెక్కడెక్క దిగాలో నేనే నిర్ణయించాను. ► పాక్ ఆక్రమిత కశ్మీర్ పనిచేస్తున్న యునెటైడ్ జీహాద్ కౌన్సిల్లో లష్కరే, జైషే, హిజ్బుల్, హర్కత్ తదితర ఉగ్రసంస్థలు భాగస్వాములు. ► పాక్ సైన్యంలోని అధికారులు కల్నల్ హమ్జా, కల్నల్ షా, సామిర్ అలీ నాకు బాగా తెలుసు. ► పాక్ మాజీ సైన్యాధికారి రెహ్మాన్ పాషాను 2003లో కలిశాను. అప్పుడు ఆయన లష్కరే కోసం పనిచేస్తున్నాడు. రెండేళ్ల తర్వాత అల్‌కాయిదాలో చేరారు. ఒక లష్కరే భేటీకి ప్రధాన వక్తగా వచ్చినప్పుడు జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజర్‌ను చూశాను. ► లష్కరేను నిషేధించిన అమెరికా నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయడంపై లఖ్వీ సాబ్తో, హఫీజ్ సయీద్ సాబ్తో చర్చించాను. కానీ ఐఎస్ఐ సహా పలు పాక్ ప్రభుత్వ సంస్థలు అందులో భాగం కావాల్సి వస్తుందన్న ఆలోచనతో ఆ ప్రయత్నాన్ని విరమించాం. ► డబ్బు కోసం మోసం చేశానని లాహోర్ పోలీస్ స్టేషన్లో నా భార్య ఫైజా 2007 డిసెంబర్లో నాపై కేసు వేసింది. ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నానని, లష్కరేతో సన్నిహిత సంబంధాలున్నాయని 2008లో ఇస్లామాబాద్‌లోని అమెరికా ఎంబసీలో ఫిర్యాదు చేసింది. -
నేడు ముంబై కోర్టులో హెడ్లీ సాక్ష్యం
ముంబై: ముంబై దాడుల కేసులో అప్రూవర్‌గా మారిన పాకిస్తానీ-అమెరికన్, లష్కరే తోయిబా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ సోమవారం ముంబై కోర్టుకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సాక్ష్యం ఇవ్వనున్నాడు. దాడుల కుట్రపై మరిన్ని వివరాలు బయటికొచ్చే అవకాశముంది. భారత న్యాయ చరిత్రలో భారతీయ కోర్టు ముందు ఒక ‘విదేశీ ఉగ్రవాది’ సాక్ష్యం ఇవ్వనుండడం ఇదే తొలిసారి అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ తెలిపారు.