పోలీసులపై ఉగ్రవాది చాకు దాడి
♦ తెలంగాణ పోలీసు అధికారి శ్రీనివాస్‌కు తీవ్రగాయాలు
♦ దుండుగుణ్ని అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ
♦ ఉగ్రముఠాలపై కొనసాగుతున్న ఎన్‌ఐఏ దాడులు..
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా దాడులకు కుట్రపన్నినట్లు భావిస్తున్న ఐసిస్ అనుమానిత ఉగ్రవాదులపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) కొరడా ఝళిపిస్తోంది. ఇప్పటికే 14 మందిని పట్టుకున్న అధికారులు శనివారం రాత్రి బెంగళూరులో మరో అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతడు చాకుతో దాడి చేయడంతో ఉగ్రవాద నిరోధక దళం తెలంగాణ విభాగానికి చెందిన శ్రీనివాస్ అనే పోలీసు అధికారి గాయపడ్డారు.
కర్ణాటకలో పట్టుబడిన అనుమానితులు అందించిన సమాచారంలో పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక నగరలో నివసిస్తున్న జావిద్ అలియాస్ రఫీక్ ఖాన్‌ను అదుపులోకి తీసుకోవడానికి ఎన్‌ఐఏ, స్థానిక పోలీసు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఉగ్రవాద నిరోధక విభాగాల అధికారులు ప్రయత్నించారు. అతడు పోలీసులపై దాడి చేయడంతో శ్రీనివాస్ గాయపడ్డారు. అధికారులు రఫీక్‌ను అరెస్ట్ చేసి, శ్రీనివాస్‌ను బెంగళూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అతడు కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. రఫీక్ 2007 నాటి హైదరాబాద్ బాంబు పేలుళ్ల కేసులో అనుమానితుడని పోలీసులు తెలిపారు. తాను మెకానిక్‌నని చెప్పాడని ఇంటి యజమాని తెలిపారు. ఆగ్రా స్వస్థలమని మరొకరికి చెప్పినట్లు తెలుస్తోంది. మూడేళ్లుగా బెంగళూరులో ఉంటున్న రఫీక్ ఆరు నెలల కిందట యాస్మిన్ భాను అనే స్థానిక యువతిని పెళ్లి చేసుకున్నాడు.
14 మంది ‘ఐసిస్’ అనుమానితులు కోర్టుకు...
శుక్ర, శనివారాల్లోతెలంగాణసహా ఆరు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ అధికారులు అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్ అనుబంధ సంస్థ జనూద్ ఉల్ ఖలీఫా-ఏ-హింద్‌కు చెందిన 14 మందిని అరెస్టు చేశారు. వీరిని తొలుత అదుపులోకి తీసుకుని, శుక్రవారం ఐదుగురిని, మిగిలిన వారిని శనివారం అరెస్ట్ చేశారు. విచారణ కోసం ఢిల్లీకి తీసుకొచ్చేందుకు శనివారం ఆయా రాష్ట్రాల్లోని స్థానిక కోర్టుల్లో హాజరుపరచినట్లు కేంద్ర హోం శాఖ ప్రతినిధి ఢిల్లీలో తెలిపారు. కర్ణాటకలో అరెస్టు చేసిన ఆరుగురిని బెంగళూరులోని ఎన్‌ఐఏ కోర్టు ఈ నెల 27వరకు ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగించింది. వీరిని ఢిల్లీకి తరలించినట్టు తెలుస్తోంది. కాగా, ఎన్‌ఐఏ మొత్తం 16 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. లక్నోలో అనుమానితుడు అలీమ్ అహ్మద్‌ను లక్నో కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.