శ్రీనగర్ : కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు. బెంగాల్‌కు చెందిన ఐదుగురు వలస కూలీలను పొట్టనబెట్టుకున్నారు. దక్షిణ కశ్మీరులోని కుల్గాం జిల్లాలో మంగళవారం ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా మరొక కూలీ తీవ్రంగా గాయపడ్డారు. కాగా వీరందరూ పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్ ప్రాంతం నుంచి వచ్చిన దినసరి కూలీలని కశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ పేర్కొన్నారు. తమ పని ముగించుకొని ఇంటికి వెళ్లాలని సోపోర్ బస్టాండ్‌కు వచ్చిన సమయంలో ఉగ్రవాదులు వీరిపై దాడికి తెగబడ్డారని డీజీపీ తెలిపారు.
కాగా, ఉగ్రవాదులు అనంత్‌నాగ్ జిల్లాలో ట్రక్కు డ్రైవర్‌ను పొట్టన బెట్టుకున్న మరుసటి రోజే ఈ దారుణానికి ఒడిగట్టారని పేర్కొన్నారు. చనిపోయిన ఐదుగురిలో షేక్ కమ్రూద్దీన్, షేక్ మహ్మద్ రఫీక్, షేక్ ముర్న్సులిన్ గా గుర్తించినట్లు తెలిపారు. దాడిలో తీవ్రంగా గాయపడిన జహోరుద్దీన్‌ను చికిత్స కోసం అనంత్‌నాగ్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో కశ్మీర్ ప్రాంతంలో భద్రతా బలగాలతో భారీ గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
యూరోపియన్ పార్లమెంటరీ కమిటీ జమ్మూ కశ్మీర్ పర్యటనకు వచ్చిన రోజే ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడడం గమనార్హం. మరోవైపు ఈ దాడిని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తీవ్రంగా ఖండించారు. అమాయక ప్రజలను బలిగొంటున్న ఉగ్రవాదులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చనిపోయిన ఐదుగురికి తన ప్రగాడ సానభూతిని ప్రకటించిన మమత వారి కుటుంబాలకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment