
భారత నేవీ మాజీ అధికారి అరెస్టు!
తమ దేశంలో గూఢచర్యం, విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై భారత నేవీ మాజీ అధికారిని అరెస్టు చేసినట్లు పాకిస్తాన్ తెలిపింది.
గూఢచర్యానికి పాల్పడుతున్నాడని పాక్ ఆరోపణ
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: తమ దేశంలో గూఢచర్యం, విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై భారత నేవీ మాజీ అధికారిని అరెస్టు చేసినట్లు పాకిస్తాన్ తెలిపింది. ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. పాక్ అరెస్టు చేసినట్లుగా చెబుతున్న కుల్ యాదవ్ భూషణ్ నేవీ నుంచి ముందస్తుగానే పదవీ విరమణ చేశాడని, ప్రస్తుతం ప్రభుత్వానికి, అతనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది. యాదవ్ కమాండర్ హోదాలో ఉన్న అధికారి అని, అతను కరాచీ, బలూచిస్తాన్ ప్రాంతంలో భారత గూఢచర్య సంస్థ ‘రా’ తరఫున పనిచేస్తున్నాడని పాక్ ఆరోపిస్తోంది. బలూచిస్తాన్‌లోని చమన్‌లో గురువారం యాదవ్‌ను అరెస్టు చేసినట్లు పేర్కొంది.
విచారణ కోసం ఆయనను ఇస్లామాబాద్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యదర్శి, ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషనర్ గౌతమ్ బంబావాలేను పిలిపించి తమ నిరసనను తెలియజేశారు. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని ఢిల్లీలో విదేశాంగశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ మీడియాకు తెలిపారు. పాక్ చెబుతున్న వ్యక్తి నేవీనుంచి ముందస్తుగానే పదవీ విరమణ చేసినందున అతనితో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టంచేశారు.