- మధ్యప్రదేశ్‌లో ముస్లిం మహిళలపై దుశ్చర్య
- రాజ్యసభలో బీజేపీపై విరుచుకుపడిన కాంగ్రెస్, బీఎస్పీ
మంద్‌సౌర్(ఎంపీ) : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గోసంరక్షణ పేరిట దాడులు కొనసాగుతున్నాయి. గుజరాత్ ఘటన మరిచిపోకముందే మధ్యప్రదేశ్‌లోనూ దాడి జరిగింది. మంద్‌సౌర్‌లో గోమాంసాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణపై ఇద్దరు ముస్లిం మహిళలను స్థానికులు తీవ్రంగా కొట్టారు. మంద్‌సౌర్ ఎస్పీ మనోజ్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఆవు మాంసం తరలిస్తున్నారన్న అనుమానంతో ఇద్దరు ముస్లిం మహిళలను మన్‌సౌ రైల్వేస్టేషన్‌లో కొడుతున్నారని మంగళవారం తమకు ఫోన్ కాల్ వచ్చిందన్నారు. ఓ మహిళతో సహా ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికి చేరుకుని ఆ మహిళలను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారు జావ్రా నుంచిమాంసాన్ని తరలిస్తున్నారని.. అది గేదె మాంసమని తేలిందన్నారు. వారిద్దరినీ అరెస్టు చేసి, కోర్టు ఆదేశం ప్రకారం జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు. నిందితులు స్థానికులతో వాదించగా స్వల్ప ఘర్షణ చోటుచేసుకుందని రాష్ట్ర హోం మంత్రి భూపేంద్ర సింగ్ చెప్పారు.
హోరెత్తిన రాజ్యసభ.. ఈ ఘటనపై బుధవారం రాజ్యసభలో బీఎస్పీ, కాంగ్రెస్ నిరసన తెలిపి, బీజేపీని దుయ్యబట్టాయి. గుజరాత్‌లో దళిత యువకులను కొట్టిన ఘటన తర్వాత కూడా మధ్యప్రదేశ్‌లో గో రక్షణ బృందాలు మహిళలను కొట్టడం దారుణమని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. ఈ ఘటనకు పోలీసులు మౌన ప్రేక్షకులుగా మారారని ఆరోపించారు. బీఎస్పీ సభ్యులు వెల్‌లోకి వెళ్లి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలిచ్చారు. వీరిని కాంగ్రెస్ సభ్యులు కూడా అనుసరించారు. గోరక్షణ పేరుతో దళితులపై దాడి ఘటనపై ప్రధాని ఎందుకు స్పందించలేదని ఆనంద్ శర్మ(కాంగ్రెస్) ప్రశ్నించారు.
గోమాంసం తరలిస్తున్నారని దాడి
Published Thu, Jul 28 2016 2:49 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement