
వారణాసి జైల్లో ఖైదీల వీరంగం!
♦ సూపరింటెండెంట్ నిర్బంధం.. ఏడు గంటల తర్వాత విడుదల
♦ డిప్యూటీ జైలర్ సహా గార్డులపై దాడి
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లా జైల్లో ఖైదీలు శనివారం రణరంగం సృష్టించారు. కొన్ని బ్యారక్‌లకు లోపలి నుంచి తాళం వేసి ఏకంగా జైలు సూపరింటెండెంట్ ఆశిష్ తివారీని నిర్బంధించారు. అలాగే డిప్యూటీ జైలు సూపరింటెండెంట్ అజయ్ రాయ్ సహా ప్రిసన్ గార్డులపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. జిల్లాలోని చౌకాఘాట్‌లో ఉన్న కంటోన్మెంట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాసిరకం ఆహారం అందించడాన్ని ప్రశ్నించినందుకు ఇద్దరు సహచరులను గార్డులు కొట్టారని ఆరోపిస్తూ గార్డులపై ఖైదీలు మెరుపు దాడికి దిగారు. గార్డుల నుంచి తుపాలకు లాక్కొని కొన్ని రౌండ్లు కాల్పులు జరిపారు.
ఖైదీలతో చర్చించేందుకు వచ్చిన సూపరింటెండెంట్‌ను ఉదయం 9:30 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ ను తీవ్రంగా కొట్టారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు భారీగా జైలు వద్ద మోహరించారు. జిల్లా మేజిస్ట్రేట్ రాజ్‌మణి యాదవ్, జిల్లా ఎస్పీ ఆకాశ్ కుల్‌హరి, ఇతర ఉన్నతాధికారులు జైలు వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. సూపరింటెండెంట్‌ను విడిపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
స్థానిక సమాజ్‌వాదీ పార్టీ నేతల ద్వారా మధ్యవర్తిత్వం జరిపారు. చర్చలు ఫలప్రదం కావడంతో సాయంత్రం 4:30 గంటలకు సూపరింటెండెంట్‌ను ఖైదీలు విడిచిపెట్టారు. దీంతో ఖైదీల డిమాండ్‌కు అనుగుణంగా సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్‌ల పదవులను వేరే వారితో భర్తీ చేశారు. ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. కాగా, జైలు సామర్థ్యం 845 ఖైదీలుకాగా ప్రస్తుతం అందులో సుమారు 1,600 మంది ఖైదీలు ఉన్నట్లు తెలియవచ్చింది.