
శ్రుతిమించిన సినీ అభిమానం
ఇద్దరు సినీ హీరోల అభిమానుల మధ్య చోటుచేసుకున్న గొడవ ఓ యువకుడి హత్యకు దారితీసింది.
యువకుడు దారుణ హత్య
కోలారు (కర్ణాటక) : ఇద్దరు సినీ హీరోల అభిమానుల మధ్య చోటుచేసుకున్న గొడవ ఓ యువకుడి హత్యకు దారితీసింది. కోలారు సమీపంలోని నరసాపురం పారిశ్రామిక వాడలో ఆదివారం రాత్రి జరిగిన సంఘటనలో చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన వినోద్ కుమార్ (24) హత్యకు గురయ్యాడు.ఆదివారం కోలారు నగరంలో నిర్వహించిన అవయవదానం కార్యక్రమానికి సినీ నటుడు సుమన్ వచ్చారు. ఈ సందర్భంగా తిరుపతి నుంచి మరో సినీ హీరో అభిమాని వినోద్ కుమార్ తన మిత్రుడు త్రినాథ్‌తో కలసి కారులో కోలారు వచ్చాడు. ఇదే సమయంలో త్రినాథ్ తన స్నేహితుడు సునీల్‌ను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాడు.
అతను మరో సినీ హీరో అభిమాని. అవయవదాన కార్యక్రమం అనంతరం ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూడా విస్తరిస్తామని వినోద్‌కుమార్ వివరిస్తూ తన అభిమాన నటుడికి జై కొట్టాడు. దీనికి సునీల్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో వారి మధ్య గొడవ మొదలైంది. అనంతరం మిత్రులంతా నరసాపురం వద్ద ఉన్న హోటల్ గేట్స్ గ్రాండ్‌కు వెళ్లారు. సునీల్ కూడాతనకు పరిచయం ఉన్న కోలారు వాసి అక్షయ్‌కుమార్‌తో హోటల్‌కు తీసుకెళ్లాడు. మళ్లీ గొడవ జరిగిం ది. దీంతో అక్షయ్‌కుమార్ తన వద్ద ఉన్న కత్తితో వినోద్‌కుమార్‌ను పొడిచాడు. వెంటనే అతన్ని సునీల్, త్రినాథ్‌లు కారులో ఆస్పత్రికి తరలిస్తుండగా..అది అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. వారు మరో కారులో వినోద్‌ను తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. పోలీసులు నిందితుడు అక్షయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.