ఢిల్లీ లో ముగిసిన ఎన్నికల ప్రచారం
ఢిల్లీ: గతకొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారంతో వేడెక్కిన ఢిల్లీ చల్లబడింది. గురువారంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీలో ప్రధానంగా బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), కాంగ్రెస్ లు ప్రచారంతో హోరెత్తించాయి. బీజేపీ ప్రచార సారథిగా ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలిలో ఆకట్టుకునే యత్నం చేశారు. ప్రధానంగా ఆప్ నే లక్ష్యంగా చేసుకుని ప్రధాని విమర్శలు గుప్పించారు.
అయితే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఎన్నికల్లో తన మార్క్ ప్రచారం నిర్వహించి మరోసారి ఆకట్టుకునే యత్నం చేశారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ప్రచారంలో కాస్త వెనుకబడినట్లు కనిపించింది. ఈ నెల ఏడో తేదీన ఢిల్లీలో ఎన్నికలు జరుగుతుండగా, 10 వ తేదీ కౌంటింగ్ జరుగనుంది.