కోలకతా: దేశవ్యాప్తంగా బాలికలపై జరుగుతున్న అత్యాచారాల పర్వం ఆందోళనకరంగా పరిణమిస్తోంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. బీర్భూమిలోని తారాపిట్ ఏరియాలోఇంట్లో నిద్రపోతున్న ఓ అమ్మాయిని ఎత్తుకెళ్లి దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. సోదరుడు, అమ్మమ్మతో ఇంట్లో నిద్రపోతున్నబాలిక (10) ను ఎత్తుకెళ్లి రేప్ చేసి అనంతరం హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని పక్కనే ఉన్న సబ్ మెర్సిబుల్ పంప్ దగ్గర పడేసి అక్కడించి పారిపోయారు.
చిన్న గదిలో నిద్రపోతున్న చీకటిలో ఎత్తుకెళ్లిన దుండగులు హత్యాచారానికి పాల్పడ్డారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు నిద్రపోతున్న బాలిక కనిపించకపోవడంతో బాధితురాలి అమ్మమ్మ అప్రమత్తమైంది. గురువారం రాత్రి సుమారు 11 గంటలకు బాలిక తప్పిపోయిన సంగతి గమనించి, బంధువులను అలర్ట్ చేసింది. తెల్లవారేసరికి రక్తపు మడుగులో ఉన్న ఆమె శవం కనిపించడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసు అధికారి కమల్ బైరాగ్య తెలిపారు. స్నిఫర్ డాగ్స్ సహాయంతో విచారణ చేపట్టినట్టు తెలిపారు. కొన్ని ముఖ్యమైన సాక్ష్యాలను సేకరించినట్టు వెల్లడించారు. పోస్ట్ మార్టం నివేదిక తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు.