
కొంచెం బద్ధకం వదిలించుకోవాలి మరీ..
► ఫిట్‌నెస్‌లో ఉత్తరాదికంటే వెనుకబడ్డ దక్షిణాది
► రీబాక్ ఫిట్ ఇండియా సర్వే వెల్లడి
► 7.6 స్కోరుతో ముందంజలో పుణె
► 6.6 స్కోరుతో ఐదోస్థానంలో హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారంతోపాటు వ్యాయామమూ తప్పనిసరి. రకరకాల కాలుష్యాల మధ్య జీవనం సాగిస్తున్న నగర జీవులకైతే ఇది మరీ ముఖ్యం. కానీ దేశంలో మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో వ్యాయామం, శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడంపై అవగాహన తక్కువే అంటోంది ప్రముఖ స్పోర్ట్స్ షూ తయారీ సంస్థ రీబాక్. వ్యాయామం విషయంలో భారతీయుల ఆలోచనలు, అలవాట్లను గుర్తించేందుకు రీబాక్ ఇటీవలే ‘ఫిట్ ఇండియా’ పేరిట ఒక సర్వే నిర్వహించింది. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడంలో ఉత్తరాదివారే బెటర్ అని ఇందులో తేలింది! దేశవ్యాప్తంగా ఎనిమిది మహా నగరాల్లో 20–25 మధ్య వయసున్న 1,500 మందిని సర్వే చేయడం ద్వారా రీబాక్ ఈ ఫలితాలను రాబట్టింది. ఈ సర్వే ద్వారా భారతీయులకు ఫిట్‌నెస్ లేదన్న అపోహలు తొలగిపోయాయని, పది మందిలో కనీసం 6.5 మంది వ్యాయామాలపై అవగాహన కలిగి ఉన్నారని రీబాక్ ఇండియా సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్ సిల్వియా టలోన్ తెలిపారు. అయితే దక్షిణాది నగరాల్లో దీనిపై అవగాహన మరింత పెరగాల్సి ఉందని అన్నారు.
సర్వే వివరాలు స్థూలంగా..
► ఫిట్‌నెస్‌పై అవగాహన విషయంలో పుణె అగ్రస్థానంలో ఉంది. ఈ నగరం స్కోరు 7.6 కాగా... చండీగఢ్ 7.3 స్కోరుతో రెండోస్థానంలో నిలిచింది. కోల్‌కతా (6.71), ఢిల్లీ/ఎన్‌సీఆర్ (6.68), హైదరాబాద్ (6.6), బెంగళూరు (6.34), చెన్నై (6.21) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
► ఈ తరం యువత అత్యధికంగా పాల్గొనే ఫిట్‌నెస్ కార్యక్రమం ‘యోగా’. బెంగళూరులో అత్యధికులు (74 శాతం) యోగా చేస్తున్నట్లు చెబితే... ఈ సంఖ్య చెన్నైలో 71 శాతంగా, హైదరాబాద్‌లో 67 శాతంగా ఉంది.
► వ్యాయామం కోసం ఉండే రకరకాల కొత్త పద్ధతులపై అవగాహన తక్కువ. చెన్నై, బెంగళూరుల్లో పది శాతం కంటే తక్కువ మంది మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ వంటి కొత్త పద్ధతులపై ఆసక్తి చూపారు. ఇతర నగరాల్లో దాదాపు సగం మందికి ఇలాంటి వాటిపై అవగాహన ఉంది.
► వ్యాయామానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు అత్యధికులు యూట్యూ బ్‌పై ఆధారపడు తున్నారు. సర్వే చేసిన వారిలో 69 శాతం మంది హైదరాబాదీలు యూట్యూబ్‌ను ఫాలో అవుతూంటే.. ఈ సంఖ్య బెంగళూరులో 68 శాతం.. చెన్నైలో 58 శాతం మాత్రమే.
► ఫిట్‌నెస్ విషయంలో దక్షిణాది నగరాలు కాస్త వెనకబడి ఉన్నా మారథాన్ పరుగు పోటీల్లో మాత్రం ఇతర నగరాలకంటే మెరుగైన స్థితిలో ఉన్నారు.
► హైదరాబాద్‌లోనూ పరిస్థితి ఏమీ భిన్నంగా లేదని.. యూట్యూబ్‌లో ఫిట్‌నెస్ వీడియోలు చూడటం, వాటిని గుడ్డిగా ఫాలో అయిపోవడం హైదరాబాదీల స్టైలని అంటోంది ఈ సంస్థ