మళ్లీ దోవల్-మసూద్ ఫేస్ టు ఫేస్!
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లో జైషే మహమ్మద్ ఉగ్రవాద గ్రూప్ స్థాపకుడు మౌలానా మసూద్ అజార్‌ను రౌండప్ చేయడం, అతని కార్యాలయాలు మూసివేస్తుండటం.. తప్పకుండా ఒక వ్యక్తికి ఆనందం కలిగించి ఉండాలి. ఆయనే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.
1994లో శ్రీనగర్‌లో మసూద్ అజార్‌ను తొలిసారి పట్టుకున్నప్పుడు అతడో చిన్న చేప అని భద్రతా సంస్థలు కొట్టిపారేశాయి. అప్పట్లో 26 ఏళ్ల అజార్ వద్ద ఓ నకిలీ పోర్చుగీసు పాస్‌పోర్టుతో, హర్కతుల్ ముజాహిద్దీన్ మ్యాగజీన్ ప్రతులు దొరికాయి. కానీ అజిత్ దోవల్ రంగంలోకి దిగిన తర్వాతే తెలిసింది మసూద్ పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో.. అతనికి పాకిస్థాన్‌లో భారీ ఎత్తున ఉగ్రవాద నెట్‌వర్క్ ఉంది. కశ్మీర్ లోయలోని ఉగ్రవాద గ్రూపులు హర్కతుల్ అన్సర్, హర్కతుల్ ముజాహిద్దీన్ మధ్య సయోధ్య కుదిర్చి.. కశ్మీర్‌తోపాటు భారత్ అంతటా భారీ ఎత్తున దాడులు జరిపేందుకు మసూద్‌ను పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ పంపింది. అజిత్ దోవల్, ఆయన బృందం ఎంతో శ్రమించి ఈ విషయాలను వెలుగులోకి తేవడంతో మసూద్ గురించి వెల్లడైంది. ఆ తర్వాత 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐసీ 814 నేపాల్‌లోని కట్మాండు నుంచి ఢిల్లీ బయలుదేరుతుండగా.. దానిని హైజాక్ చేసి కాందహార్ తరలించారు. దీంతో బందీలుగా ఉన్న ప్రయాణికులను విడిపించేందుకు దోవల్ ఉగ్రవాదులతో చర్చలు జరిపారు. ఆ తర్వాత ముగ్గురు ఉగ్రవాదులను తీసుకొని అప్పటి విదేశాంగ జశ్వంత్ సిన్హాను వెంటబెట్టుకొని కాందహార్ వెళ్లి బందీలను విడిపించుకొచ్చారు. మసూద్‌తోపాటు అప్పుడు విడుదలైన ఉగ్రవాదులు ఒమర్ షైక్ (ప్రస్తుతం జర్నలిస్టు హత్యకేసులో పాక్‌లో అరెస్టయాడు), ముస్తాక్ జార్గర్.
అప్పుడు అజిత్ దోవల్ బృందంలో ఉన్న అసిఫ్ ఇబ్రహీం ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉగ్రవాదంపై ప్రత్యేక రాయబారిగా వ్యవహరిస్తూ.. దోవల్‌తోపాటే ఉండగా, మరో సభ్యుడు అవినాశ్ మోహనానీ సిక్కీం డీజీపీగా వ్యవహరిస్తున్నారు. పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి, ఆఫ్ఘనిస్థాన్‌లోని మజర్ ఎ షహర్‌లో భారత రాయబార కార్యాలయంపై దాడులకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మసూద్ అరెస్టు నేపథ్యంలో భారత్ తీసుకోవాల్సిన చర్యలపై దోవల్ బృందం ఇప్పుడు మరోసారి కేంద్రానికి మార్గనిర్దేశనం చేస్తోంది.