నేను బతికే ఉన్నా.. మరేం పర్లేదు! | Report Says Masood Azhar Writes In Jaish e Mohammed Mouthpiece That He is Alive | Sakshi
Sakshi News home page

నేను బతికే ఉన్నా.. మరేం పర్లేదు!

Published Sat, Mar 16 2019 8:34 PM | Last Updated on Sat, Mar 16 2019 8:52 PM

Report Says Masood Azhar Writes In Jaish e Mohammed Mouthpiece That He is Alive - Sakshi

ఇస్లామాబాద్‌ : ‘నేను బతికే ఉన్నాను... పూర్తి ఆరోగ్యంగా ఉన్నా.. మరేం పర్లేదు. మాపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీతో పోలిస్తే నేను చాలా ఫిట్‌గా ఉన్నా. నాతో ఆయన ఏ ఆట ఆడతానన్నా సరే సిద్ధంగా ఉన్నా. సవాల్‌ విసురుతున్నా’ అంటూ ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌ అధినేత మసూద్‌ అజహర్‌ తన పత్రికలో పేర్కొన్నాడు. మసూద్‌ మరణించాడంటూ ఇటీవల సోషల్‌ మీడియా, పాక్‌ మీడియాలలో వార్తలు ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జైషే మహ్మద్‌ అధికార పత్రిక ఆల్‌-కలాంలో సాది అనే కలం పేరిట కథనం రాసుకొచ్చినట్లు తెలుస్తోంది.

ఈ కథనం ప్రకారం... తన గురించి వస్తున్న వదంతులను నమ్మవద్దని మసూద్‌ పేర్కొన్నాడు. పుల్వామా దాడిని జైషే సాధించిన గొప్ప విజయంగా అతడు అభివర్ణించాడు. దాడికి పాల్పడి 40 మందికి పైగా భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న తమ కమాండర్‌ ఆదిల్‌ అహ్మద్‌ దార్‌ను ప్రశంసిస్తూ.. ‘కశ్మీర్‌లో ఆదిల్‌ ఓ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాడు. తను రగిల్చిన మంట ఇప్పట్లో చల్లారే ప్రసక్తే లేదు’ అంటూ ద్వేషపూరిత కథనంలో పేర్కొన్నాడు. అదే విధంగా ఆఫ్గనిస్తాన్‌ ప్రజల పరిస్థితిపై కూడా మసూద్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఇందుకు సంబంధించి కచ్చితమైన సమాచారం తెలియాల్సి ఉంది.(ఇంతకు మసూద్‌ ఎవరు? ఎక్కడ పుట్టాడు?)

కాగా కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆత్మాహుతికి పాల్పడి ఆదిల్‌ అనే ఉగ్రవాది భారత జవాన్ల కాన్వాయ్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా భారత వైమానిక దళం బాలాకోట్‌లోని జైషే స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌- పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్‌ ఉగ్రవాదాన్ని విడనాడాలంటూ భారత్‌తో పాటు అగ్ర దేశాలన్నీ హెచ్చరిస్తున్నా పాక్‌ తీరు మార్చుకోవడం లేదు. తమ దేశంలో ఆశ్రయం పొందుతున్న మసూద్‌ అజహర్‌ను మాత్రం భారత్‌కు అప్పగించడం లేదు.

మరోవైపు... జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్న భారత్‌కు ఆ దిశగా భారీ ఊరట లభించింది. మసూద్‌ అజర్‌ ఆస్తులను స్తంభింపచేస్తామని శుక్రవారం ఫ్రాన్స్‌ ప్రకటించింది. ఈ దిశగా ఫ్రాన్స్‌ దేశీయ, ఆర్థిక, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్త ప్రకటన చేశాయి. ఉగ్రవాదంతో ప్రమేయమున్న వ్యక్తిగా మసూద్‌ అజర్‌ పేరును ఐరోపా యూనియన్‌ జాబితాలో చేర్చేందుకు ఫ్రాన్స్‌ చొరవ చూపుతుందని అధికారిక ప్రకటన వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement