మన సహనాన్ని చేతగానితనంగా... మన సుహృద్భావాన్ని అశక్తతగా అంచనా వేసుకుని ఎప్పటి కప్పుడు ఉగ్రవాదుల్ని ఉసిగొల్పుతున్న పాకిస్తాన్‌కు చాన్నాళ్ల తర్వాత తొలిసారి మన దేశం కఠిన మైన సందేశాన్ని పంపింది. మంగళవారం వేకువజామున భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్–2000 యుద్ధ విమానాలు అధీనరేఖను దాటి పాక్ భూభాగంలో ఉన్న ఉగ్రవాద శిబిరా లను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించాయి. లేజర్ గైడెడ్ బాంబులు వినియోగించి జరిపిన ఈ దాడుల్లో ఉగ్రవాద శిక్షణ శిబిరాలు పూర్తిగా ధ్వంసంమయ్యాయని, భారీ సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారని మన వాయుసేన ప్రకటించింది. మృతుల్లో ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కొడుకు, అతడి బావమరిది కూడా ఉన్నారని చెబుతున్నారు.
సరిగ్గా పన్నెండు రోజులక్రితం పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్ల వాహనశ్రేణిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాది ఒకడు జరిపిన ఆత్మాహుతి దాడిలో 43మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆనాడే ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్‌ను తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. కానీ ఆ దేశం ఎప్పటిలా పాత పాటే పాడింది. తమ భూభాగం నుంచే ఈ దాడికి పథకరచన సాగిందని ‘నమ్మదగిన సమాచారం’ అందజేస్తే చర్యలు తీసుకోవడానికి సిద్ధమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జవాబి చ్చారు. అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకుని పనిచేస్తున్న జైషే మొహమ్మద్ సంస్థ ఇది తన నిర్వాక మేనని చేసిన ప్రకటనను... దానికి పాక్ సైన్యం అండదండలున్నాయన్న సంగతిని ఆయన విస్మరిం చారు. కనుకనే ఇక తాడో పేడో తేల్చుకోక తప్పదన్న నిర్ణయానికి మన దేశం రాకతప్పలేదు. భారత్ దాడి చేస్తే దానికి ప్రతిగా అణు దాడి చేస్తామని ఇన్నాళ్లూ పాకిస్తాన్ బెదిరించేది. ఆ బెదిరింపులకు జడిసేది లేదని, ఉగ్రవాదులను ఉసిగొల్పడాన్ని మానుకోకుంటే గుణపాఠం తప్పదని తాజా వైమానిక దాడుల ద్వారా మన దేశం స్పష్టం చేసింది.
పదునైన వ్యూహంతో, పక్కా ప్రణాళికతో, మెరికల్లాంటి 40మంది యుద్ధ విమాన పైలెట్లను ఎంచుకుని తగిన శిక్షణనిచ్చి మన వాయుసేన నిర్వహించిన ఈ దాడులు దాని శక్తిసామర్ధ్యాలను మరోసారి ప్రపంచానికి చాటాయి. దాడుల గురించి మొదట్లో బుకాయించడానికి, వాటి తీవ్రతను తగ్గించడానికి పాకిస్తాన్ ప్రయత్నించినా చివరకు భారత్ యుద్ధ విమానాలు భూభాగంలోకి చొచ్చుకొచ్చి దాడులు జరిపాయని అది అంగీకరించక తప్పలేదు. పొరుగు దేశం యుద్ధ విమానాలు విరుచుకుపడితే వైమానిక దళం నిద్రపోతున్నదా అంటూ అక్కడి పౌరులు నిలదీస్తుంటే సైన్యానికి, ఇమ్రాన్ ప్రభుత్వానికి ఊపిరాడటం లేదు. ఎందుకంటే పాక్ సైనిక దళాల చీఫ్ రావల్పిండిలోని ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారని, అధీన రేఖలో దళాల సంసిద్ధత, సన్నాహాల గురించి సంతృప్తి వ్యక్తం చేశారని దాడులకు ముందురోజు... అంటే సోమవారం పాక్ సైన్యానికి చెందిన మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు. తీరా మెరుపు దాడులు విరుచుకుపడేసరికి సత్తా ఏమిటో తేలిపోయింది. ఈ మాదిరి దాడులకు జవాబు చెప్పడం దొంగచాటు దాడులకు ఉసిగొల్పి, ఏం ఎరగనట్టు నటించడమంత సులభం కాదు మరి. స్వీయ ప్రతిష్ట కాపాడుకోవడం కోసం సరి హద్దుల్లోని వేర్వేరు సెక్టార్లలో పాక్ సైన్యం రోజంతా కాల్పుల మోత మోగించిందని, మన జవాన్లు దీటైన జవాబిచ్చారని సమాచారం అందుతోంది.
మన వాయుసేన గురిచూసి దాడిచేసిన బాలాకోట్ పాకిస్తాన్ సైన్యానికి అత్యంత కీలకమైన ప్రాంతం. అక్కడి ఉగ్రవాద శిబిరాలకు తరచు మసూద్ అజర్ వచ్చి ఉపన్యాసాలివ్వడం బహిరంగ రహస్యం. దాడులపై మన దేశం చేసిన ప్రకటన పాకిస్తాన్‌ను ఇరకాటంలో పడేసింది. ఇవి ‘సైనికే తరమైనవని, ముందస్తు నిరోధక చర్యల’ని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే చెప్పారు. ఇవి పాకిస్తాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని లేదా పౌరులకు నష్టం కలిగేలా జరిపిన దాడులు కాదని, కేవలం ఉగ్రవాద శిబిరాలపైనే గురిపెట్టామని ఆయన అనడంతో పాకిస్తాన్‌కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. అక్కడ భారీయెత్తున ఉగ్రవాదులు మరణించారని ఒప్పుకుంటే ఉగ్రవాద శిబి రాలు ఇన్నేళ్లుగా కొనసాగుతున్నట్టు అది అంగీకరించక తప్పదు. అందుకే దాడుల్లో ఎవరూ మర ణించలేదని, తమ విమానాలు సకాలంలో స్పందించి తరిమికొట్టాయని చెప్పుకుంటోంది. తాజా దాడులు సాధారణమైనవి కాదు. దాదాపు 50 ఏళ్ల తర్వాత తొలిసారి మన సైన్యం అధీన రేఖను దాటి దాడులకు సిద్ధపడింది. తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన 1999నాటి కార్గిల్ యుద్ధంలో సైతం అధీన రేఖ దాటి వెళ్లొద్దని నాటి ప్రధాని వాజపేయి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. తాజా దాడులతో ఉగ్రవాదం విషయంలో మన దేశం వైఖరి అత్యంత కఠినంగా మారిందని అర్ధమవుతుంది.
అయితే యుద్ధం కేవలం ఆయుధాలతో మాత్రమే జరగదు. అది బహుముఖాలుగా ఉంటుంది. అవసరమనుకున్నప్పుడు దాడులకు సిద్ధపడుతూనే ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాక్ తీరును ప్రపంచ దేశాలకు తెలియజెప్పడం కొనసాగించాలి. అదీ ఒక రకమైన యుద్ధమే. ఏ సమస్య అయినా అంతిమంగా చర్చల ద్వారా పరిష్కారం కావాల్సిందే. దాన్ని దృష్టిలో ఉంచుకునే మన ప్రతి చర్యా ఉండాలి. తాజా దాడుల నేపథ్యంలో ఇకపై సరిహద్దుల్లో మరింత అప్రమత్తత అవసరం. ఈ దాడులవల్ల అఫ్ఘాన్‌లో జరిగే శాంతియత్నాలకు విఘాతం కలుగుతుందని చెప్పడం ద్వారా అమెరికాను బుట్టలో వేసుకునేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. మరోపక్క యూరప్ యూని యన్(ఈయూ)తోపాటు బ్రిటన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ వంటివి మన వైఖరిని సమర్థించాయి. ఆఖ రికి పాక్ మిత్ర దేశం చైనా సైతం దాడుల ఊసెత్తకుండా ఉగ్రవాదం ప్రపంచ సమస్యని పేర్కొనడం, రెండు దేశాలూ చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాలని సూచించడం గమ నించదగ్గ విషయం. మొత్తానికి ఈ వైమానిక దాడులు పాక్‌కు కనువిప్పు కలిగిస్తే అది ఆ దేశానికే మేలు చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment