jaish e mohammed
-
ఉగ్రవాది ఖతం.. బాంబులు మిస్సింగ్!
-
ఉగ్రవాది ఖతం.. కానీ, బాంబులు మిస్సింగ్!
శ్రీనగర్: పుల్వామాలో బుధవారం జరిగిన భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో బాంబు తయారీలో నిపుణుడైన ఫౌజీ భాయ్ అలియాస్ అబ్దుల్ రెహమాన్ కూడా ఉన్నట్టు కశ్మీర్ రేంజ్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఫౌజీ భాయ్ ఎన్కౌంటర్ భద్రతా బలగాలకు పెద్ద విజయమని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, రెహమాన్ తయారు చేసిన మూడు కారు బాంబుల్లో ఒకదానిని భద్రతా బలగాలు పేల్చివేయగా... మరో రెండింటి ఆచూకీ తెలియాల్సి ఉంది. బుడ్గాం, కుల్గాం ప్రాంతాల్లో ఆ బాంబులు ఉండొచ్చని, వాటి జాడ కోసం ముమ్మర తనిఖీలు కొనసాగుతున్నాయని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. (చదవండి: పెనుముప్పుగా నిబంధనల ఉల్లంఘన..!) కాగా, పుల్వామా తరహా ఉగ్రదాడి జరగనుందనే ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. 20 కిలోల శక్తిమంతమైన ఐఈడీని మోసుకెళ్తున్న శాంట్రో వాహనాన్ని మే 27న సీజ్ చేశాయి. ఐఈడీని తరలిస్తున్న టెర్రరిస్టు సమీర్ అహ్మద్ దార్ తృటిలో తప్పించుకుపోయాడు. ఇక ఐఈడీ వాహనాన్ని తరలించడం ప్రమాదమని భావించిన బాంబు స్క్వాడ్ నిపుణులు దానిని అక్కడే పేల్చివేశారు. గతేడాది పుల్వామా వద్ద భద్రతా బలగాలపై ఆత్మహుతి దాడికి పాల్పడ్డ అదిల్ దార్‌కు సమీర్ అహ్మద్ దార్ బంధువని తేలింది. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. (చదవండి: పుల్వామాలో భారీ ఎన్కౌంటర్) -
నాడు 170 మంది ఉగ్రవాదులు హతం
న్యూఢిల్లీ: బాలాకోట్‌లోని జైషే ఉగ్రస్థావరంపై భారత వాయుసేన(ఐఏఎఫ్) చేసిన దాడిలో ఎవ్వరూ చనిపోలేదని బుకాయిస్తున్న పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న తెల్లవారుజామున ఐఏఎఫ్ చేపట్టిన వైమానికదాడిలో 130 నుంచి 170 జైషే ఉగ్రవాదులు చనిపోయారని ఇటాలియన్ జర్నలిస్ట్ ఫ్రాన్సెక్సా మారినో తెలిపారు. ఐఏఎఫ్ దాడిలో ఘటనాస్థలిలోనే భారీ సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోగా, మరికొందరు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారని వెల్లడించారు. ఈ దాడిలో గాయపడ్డ ఉగ్రమూకలకు పాక్ మిలటరీ డాక్టర్లు వైద్యం చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ మారినో రాసిన కథనాన్ని ‘స్ట్రింగర్ ఆసియా’ అనే వెబ్సైట్ ప్రచురించింది. మృతుల కుటుంబాలకు పరిహారం.. ఫిబ్రవరి 26 తెల్లవారుజామున ఐఏఎఫ్ యుద్ధవిమానాలు బాలాకోట్‌లోని ఉగ్రస్థావరంపై బాంబుల వర్షం కురిపించాయని మారినో తెలిపారు. ‘ఈ దాడిలో 11 మంది శిక్షకులు సహా 170 మంది వరకూ చనిపోయారు. దాడి జరిగిన కొద్దిసేపటికే అక్కడకు చేరుకున్న పాక్ ఆర్మీ క్షతగాత్రులను షింకియారీ ప్రాంతంలో ఉన్న హర్కతుల్ ముజాహిదీన్ క్యాంప్‌కు తరలించింది. స్థానికుల సమాచారం ప్రకారం ఇంకా 45 మంది ఉగ్రవాదులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. కోలుకున్నవారిని ఆర్మీ అదుపులోకి తీసుకుంది. ఈ మొత్తం విషయం బయటకు పొక్కకుండా జైషే నేతలు మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించారు. ఇప్పుడు జైషే క్యాంపును తాలిమున్ ఖురాన్(మదర్సా)గా మార్చేశారు. ప్రస్తుతం స్థానిక పోలీసులకు కూడా ఇక్కడ అనుమతి లేదు’ అని చెప్పారు. అవసరమైతే బాలాకోట్‌లో భారత జర్నలిస్టులను అనుమతిస్తామని పాక్ ప్రకటించిన నేపథ్యంలో మారినో ఈ కథనం రాయడం గమనార్హం. -
పాకిస్తాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
వాషింగ్టన్: భారత్‌పై మళ్లీ ఉగ్రవాదులు దాడులు జరిపితే తీవ్ర చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ‘‘ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలుగా మారిన ప్రాంతాల (పాక్)పై సహనాన్ని ప్రదర్శించేదే ప్రసక్తే లేదన్నారు. భారత్‌లో ఇంకొక్క ఉగ్రదాడి జరిగినా పాక్ తీవ్ర పరిణామాలకు సిద్ధంగా ఉండాలి’ అని వైట్‌హౌజ్‌కు చెందిన ఒక అధికారి బుధవారం మీడియాతో పేర్కొన్నారు. ‘పాకిస్థాన్‌లోని టెర్రరిస్ట్ గ్రూపులపై అమెరికా కఠిన చర్యలు తీసుకోడానికి వెనుకాడదు. ఉగ్రవాద నిర్మూలనకు పాక్ సరైన చర్యలు చేపట్టాలి. ప్రధానంగా జైష్-ఏ-మహ్మద్, లష్కర్-ఏ-తయిబా లాంటి ఉగ్రవాద సంస్థలను నిర్వీర్యం చేయాలి. ఉగ్రదాడులతో తిరిగి భారత ఉపఖండంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చూడాలనేదే మా అభిమతం’ అని ఆయన తెలిపారు. ‘పాకిస్థాన్ తగు చర్యలు తీసుకోకుంటే ఇండియాలో మళ్లీ దాడులు జరిగే అవకాశముంది. దీనివల్ల ఇరు దేశాల మధ్య తిరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదముంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో భారత వైమానిక దాడుల అనంతరం ఉగ్రవాదులు, వారి శిబిరాల మీద పాక్ ఎలాంటి చర్యలు తీసుకుందోనని వేచి చూస్తాం’ అని తెలిపారు. ఉగ్రవాదాన్ని అరికట్టాల్సిందే ‘ఉగ్రవాదాన్ని తుదమొట్టించడానికి అంతర్జాతీయ సమాజం ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరముందని అమెరికా భావిస్తోంది. పాక్ కూడా ఉగ్రవాద సంస్థల మీద కొన్ని చర్యలు తీసుకుంది. కొన్ని ఉగ్ర గ్రూపుల నిర్వీర్యం చేయడంతోపాటు జైషే మహ్మద్ సంస్థ పరిపాలనా కార్యకలాపాలను నియంత్రించే దిశగా నడుం బిగించింది. కానీ టెర్రరిస్ట్‌లను అరెస్ట్ చేయడం.. తర్వాత కొన్ని రోజులకు వారిని వదిలేయడం, దేశంలో ఎక్కడికైనా తిరిగే హక్కు, స్వేచ్ఛగా ర్యాలీలు చేసుకునే అనుమతులను ఉగ్ర నాయకులకు కల్పించడం పాక్‌కు పరిపాటి అయిపోయింది. అందుకే ఇంకొన్నాళ్లు పాకిస్థాన్ తీసుకునే చర్చలను నిశితంగా పరిశీలిస్తాం. పాక్‌కు ఉన్న ఆర్థిక అవసరాల దృష్ట్యా ఆ దేశం ఉగ్రవాద నిర్మూలన చర్యలను వేగవంతం చేసి, అంతర్జాతీయ సమాజం ముందు బాధ్యతాయుత దేశంగా నిలబడాలి. లేని పక్షంలో పాక్‌కు ఆర్థిక కష్టాలు తప్పవు. భారత్‌లో ఉగ్రవాదుల అటాక్, బాలాకోట్‌లో ఇండియన్ ఆర్మీ వాయు దాడులతో దాయాది దేశాల ఆర్మీలు ఇంకా హై అలర్ట్‌గానే ఉన్నాయి. ఇంకొక్క దాడి ఆ పరిస్థితులను ఇంకా క్లిష్టతరం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాంటి వాటికి తావివ్వొద్దనే తాము ముందస్తుగా పాక్‌ను హెచ్చరిస్తున్నాం. ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పుడు అటు ఇస్లామాబాద్‌తో ఇటు న్యూఢిల్లీతో మేము సంప్రదింపులు జరిపి.. ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం చేశాం’ అని సదరు వైట్‌హౌజ్ అధికారి తెలిపారు. -
నేను బతికే ఉన్నా.. మరేం పర్లేదు!
ఇస్లామాబాద్ : ‘నేను బతికే ఉన్నాను... పూర్తి ఆరోగ్యంగా ఉన్నా.. మరేం పర్లేదు. మాపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీతో పోలిస్తే నేను చాలా ఫిట్‌గా ఉన్నా. నాతో ఆయన ఏ ఆట ఆడతానన్నా సరే సిద్ధంగా ఉన్నా. సవాల్ విసురుతున్నా’ అంటూ ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ తన పత్రికలో పేర్కొన్నాడు. మసూద్ మరణించాడంటూ ఇటీవల సోషల్ మీడియా, పాక్ మీడియాలలో వార్తలు ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జైషే మహ్మద్ అధికార పత్రిక ఆల్-కలాంలో సాది అనే కలం పేరిట కథనం రాసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ కథనం ప్రకారం... తన గురించి వస్తున్న వదంతులను నమ్మవద్దని మసూద్ పేర్కొన్నాడు. పుల్వామా దాడిని జైషే సాధించిన గొప్ప విజయంగా అతడు అభివర్ణించాడు. దాడికి పాల్పడి 40 మందికి పైగా భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న తమ కమాండర్ ఆదిల్ అహ్మద్ దార్‌ను ప్రశంసిస్తూ.. ‘కశ్మీర్లో ఆదిల్ ఓ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాడు. తను రగిల్చిన మంట ఇప్పట్లో చల్లారే ప్రసక్తే లేదు’ అంటూ ద్వేషపూరిత కథనంలో పేర్కొన్నాడు. అదే విధంగా ఆఫ్గనిస్తాన్ ప్రజల పరిస్థితిపై కూడా మసూద్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఇందుకు సంబంధించి కచ్చితమైన సమాచారం తెలియాల్సి ఉంది.(ఇంతకు మసూద్ ఎవరు? ఎక్కడ పుట్టాడు?) కాగా కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆత్మాహుతికి పాల్పడి ఆదిల్ అనే ఉగ్రవాది భారత జవాన్ల కాన్వాయ్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా భారత వైమానిక దళం బాలాకోట్‌లోని జైషే స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ ఉగ్రవాదాన్ని విడనాడాలంటూ భారత్‌తో పాటు అగ్ర దేశాలన్నీ హెచ్చరిస్తున్నా పాక్ తీరు మార్చుకోవడం లేదు. తమ దేశంలో ఆశ్రయం పొందుతున్న మసూద్ అజహర్‌ను మాత్రం భారత్‌కు అప్పగించడం లేదు. మరోవైపు... జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న భారత్‌కు ఆ దిశగా భారీ ఊరట లభించింది. మసూద్ అజర్ ఆస్తులను స్తంభింపచేస్తామని శుక్రవారం ఫ్రాన్స్ ప్రకటించింది. ఈ దిశగా ఫ్రాన్స్ దేశీయ, ఆర్థిక, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్త ప్రకటన చేశాయి. ఉగ్రవాదంతో ప్రమేయమున్న వ్యక్తిగా మసూద్ అజర్ పేరును ఐరోపా యూనియన్ జాబితాలో చేర్చేందుకు ఫ్రాన్స్ చొరవ చూపుతుందని అధికారిక ప్రకటన వెల్లడించింది. -
చావుదెబ్బ
మన సహనాన్ని చేతగానితనంగా... మన సుహృద్భావాన్ని అశక్తతగా అంచనా వేసుకుని ఎప్పటి కప్పుడు ఉగ్రవాదుల్ని ఉసిగొల్పుతున్న పాకిస్తాన్‌కు చాన్నాళ్ల తర్వాత తొలిసారి మన దేశం కఠిన మైన సందేశాన్ని పంపింది. మంగళవారం వేకువజామున భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్–2000 యుద్ధ విమానాలు అధీనరేఖను దాటి పాక్ భూభాగంలో ఉన్న ఉగ్రవాద శిబిరా లను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించాయి. లేజర్ గైడెడ్ బాంబులు వినియోగించి జరిపిన ఈ దాడుల్లో ఉగ్రవాద శిక్షణ శిబిరాలు పూర్తిగా ధ్వంసంమయ్యాయని, భారీ సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారని మన వాయుసేన ప్రకటించింది. మృతుల్లో ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కొడుకు, అతడి బావమరిది కూడా ఉన్నారని చెబుతున్నారు. సరిగ్గా పన్నెండు రోజులక్రితం పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనశ్రేణిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాది ఒకడు జరిపిన ఆత్మాహుతి దాడిలో 43మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆనాడే ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్‌ను తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. కానీ ఆ దేశం ఎప్పటిలా పాత పాటే పాడింది. తమ భూభాగం నుంచే ఈ దాడికి పథకరచన సాగిందని ‘నమ్మదగిన సమాచారం’ అందజేస్తే చర్యలు తీసుకోవడానికి సిద్ధమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జవాబి చ్చారు. అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకుని పనిచేస్తున్న జైషే మొహమ్మద్ సంస్థ ఇది తన నిర్వాక మేనని చేసిన ప్రకటనను... దానికి పాక్ సైన్యం అండదండలున్నాయన్న సంగతిని ఆయన విస్మరిం చారు. కనుకనే ఇక తాడో పేడో తేల్చుకోక తప్పదన్న నిర్ణయానికి మన దేశం రాకతప్పలేదు. భారత్ దాడి చేస్తే దానికి ప్రతిగా అణు దాడి చేస్తామని ఇన్నాళ్లూ పాకిస్తాన్ బెదిరించేది. ఆ బెదిరింపులకు జడిసేది లేదని, ఉగ్రవాదులను ఉసిగొల్పడాన్ని మానుకోకుంటే గుణపాఠం తప్పదని తాజా వైమానిక దాడుల ద్వారా మన దేశం స్పష్టం చేసింది. పదునైన వ్యూహంతో, పక్కా ప్రణాళికతో, మెరికల్లాంటి 40మంది యుద్ధ విమాన పైలెట్లను ఎంచుకుని తగిన శిక్షణనిచ్చి మన వాయుసేన నిర్వహించిన ఈ దాడులు దాని శక్తిసామర్ధ్యాలను మరోసారి ప్రపంచానికి చాటాయి. దాడుల గురించి మొదట్లో బుకాయించడానికి, వాటి తీవ్రతను తగ్గించడానికి పాకిస్తాన్ ప్రయత్నించినా చివరకు భారత్ యుద్ధ విమానాలు భూభాగంలోకి చొచ్చుకొచ్చి దాడులు జరిపాయని అది అంగీకరించక తప్పలేదు. పొరుగు దేశం యుద్ధ విమానాలు విరుచుకుపడితే వైమానిక దళం నిద్రపోతున్నదా అంటూ అక్కడి పౌరులు నిలదీస్తుంటే సైన్యానికి, ఇమ్రాన్ ప్రభుత్వానికి ఊపిరాడటం లేదు. ఎందుకంటే పాక్ సైనిక దళాల చీఫ్ రావల్పిండిలోని ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారని, అధీన రేఖలో దళాల సంసిద్ధత, సన్నాహాల గురించి సంతృప్తి వ్యక్తం చేశారని దాడులకు ముందురోజు... అంటే సోమవారం పాక్ సైన్యానికి చెందిన మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు. తీరా మెరుపు దాడులు విరుచుకుపడేసరికి సత్తా ఏమిటో తేలిపోయింది. ఈ మాదిరి దాడులకు జవాబు చెప్పడం దొంగచాటు దాడులకు ఉసిగొల్పి, ఏం ఎరగనట్టు నటించడమంత సులభం కాదు మరి. స్వీయ ప్రతిష్ట కాపాడుకోవడం కోసం సరి హద్దుల్లోని వేర్వేరు సెక్టార్లలో పాక్ సైన్యం రోజంతా కాల్పుల మోత మోగించిందని, మన జవాన్లు దీటైన జవాబిచ్చారని సమాచారం అందుతోంది. మన వాయుసేన గురిచూసి దాడిచేసిన బాలాకోట్ పాకిస్తాన్ సైన్యానికి అత్యంత కీలకమైన ప్రాంతం. అక్కడి ఉగ్రవాద శిబిరాలకు తరచు మసూద్ అజర్ వచ్చి ఉపన్యాసాలివ్వడం బహిరంగ రహస్యం. దాడులపై మన దేశం చేసిన ప్రకటన పాకిస్తాన్‌ను ఇరకాటంలో పడేసింది. ఇవి ‘సైనికే తరమైనవని, ముందస్తు నిరోధక చర్యల’ని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే చెప్పారు. ఇవి పాకిస్తాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని లేదా పౌరులకు నష్టం కలిగేలా జరిపిన దాడులు కాదని, కేవలం ఉగ్రవాద శిబిరాలపైనే గురిపెట్టామని ఆయన అనడంతో పాకిస్తాన్‌కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. అక్కడ భారీయెత్తున ఉగ్రవాదులు మరణించారని ఒప్పుకుంటే ఉగ్రవాద శిబి రాలు ఇన్నేళ్లుగా కొనసాగుతున్నట్టు అది అంగీకరించక తప్పదు. అందుకే దాడుల్లో ఎవరూ మర ణించలేదని, తమ విమానాలు సకాలంలో స్పందించి తరిమికొట్టాయని చెప్పుకుంటోంది. తాజా దాడులు సాధారణమైనవి కాదు. దాదాపు 50 ఏళ్ల తర్వాత తొలిసారి మన సైన్యం అధీన రేఖను దాటి దాడులకు సిద్ధపడింది. తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన 1999నాటి కార్గిల్ యుద్ధంలో సైతం అధీన రేఖ దాటి వెళ్లొద్దని నాటి ప్రధాని వాజపేయి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. తాజా దాడులతో ఉగ్రవాదం విషయంలో మన దేశం వైఖరి అత్యంత కఠినంగా మారిందని అర్ధమవుతుంది. అయితే యుద్ధం కేవలం ఆయుధాలతో మాత్రమే జరగదు. అది బహుముఖాలుగా ఉంటుంది. అవసరమనుకున్నప్పుడు దాడులకు సిద్ధపడుతూనే ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాక్ తీరును ప్రపంచ దేశాలకు తెలియజెప్పడం కొనసాగించాలి. అదీ ఒక రకమైన యుద్ధమే. ఏ సమస్య అయినా అంతిమంగా చర్చల ద్వారా పరిష్కారం కావాల్సిందే. దాన్ని దృష్టిలో ఉంచుకునే మన ప్రతి చర్యా ఉండాలి. తాజా దాడుల నేపథ్యంలో ఇకపై సరిహద్దుల్లో మరింత అప్రమత్తత అవసరం. ఈ దాడులవల్ల అఫ్ఘాన్‌లో జరిగే శాంతియత్నాలకు విఘాతం కలుగుతుందని చెప్పడం ద్వారా అమెరికాను బుట్టలో వేసుకునేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. మరోపక్క యూరప్ యూని యన్(ఈయూ)తోపాటు బ్రిటన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ వంటివి మన వైఖరిని సమర్థించాయి. ఆఖ రికి పాక్ మిత్ర దేశం చైనా సైతం దాడుల ఊసెత్తకుండా ఉగ్రవాదం ప్రపంచ సమస్యని పేర్కొనడం, రెండు దేశాలూ చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాలని సూచించడం గమ నించదగ్గ విషయం. మొత్తానికి ఈ వైమానిక దాడులు పాక్‌కు కనువిప్పు కలిగిస్తే అది ఆ దేశానికే మేలు చేస్తుంది. -
‘ఇదే 56 అంగుళాల ఛాతీ’
చండీగఢ్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన 56 అంగుళాల ఛాతీని పాకిస్తాన్ ఉగ్రమూకలకు చూయించాడని భారత వాయిసేన మంగళవారం వేకువజామున జరిపిన సర్జికల్ దాడుల అనంతరం హర్యానా బీజేపీ ఎమ్మెల్యే అంజి విజ్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షనేతలకు చెప్పారు. ‘ మోదీ ఏం చెప్తారో అదే చేస్తారు. ఉగ్రవాదాన్ని సహించేది లేదని మోదీ ఎప్పుడూ చెబుతారు. పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పారు. వాళ్లను(పాకిస్తాన్) వాళ్ల ఇంట్లోనే కొట్టాం. ఇదే 56 అంగుళాల ఛాతీ అంటే. ఇదే సింహం ఛాతీ అంటే’ అంటూ బీజేపీ ఎమ్మెల్యే అంజి విజ్, మోదీని ఆకాశానికెత్తేశారు. బీజేపీ అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత ప్రతిపక్షాలను విమర్శించడానికి మోదీ తన 56 అంగుళాల ఛాతీని ఎన్నికల ప్రచార ఆయుధంగా తరచూ వాడేవారు. 2014కు ముందు సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్ యాదవ్‌ను విమర్శించాల్సి వచ్చినపుడు కూడా ఛాతీ గురించి ప్రస్తావించారు. యూపీని, గుజరాత్‌లా తీర్చిదిద్దాలంటే మీకు(ములాయం) 56 అంగుళాల ఛాతీ ఉండాలని అప్పట్లో వ్యాక్యానించిన విషయాన్ని అంజివిజ్ గుర్తు చేశారు. హర్యానా కాంగ్రెస్ నాయకుల తీరును కూడా బీజేపీ ఎమ్మెల్యే అంజివిజ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇండియా పాకిస్తాన్ భూభాగంలో రెండో సారి సర్జికల్ దాడులు చేయడం యావత్ భారత్ గర్వించదగ్గ విషయమని అభిప్రాయపడ్డారు. నియంత్రణ రేఖ దాటి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌కు 80 కి.మీ దూరంలో ఉన్న జైషే మహ్మద్ సంస్థ ఉగ్రవాద శిబిరంపై వేకువజామున 3 గంటల సమయంలో 12 మిరాజ్ యుద్ధ విమానాలతో రెప్పపాటులో దాడి సుమారు 1000 కిలోల లేజర్ బాంబులను జారవిడిచిన సంగతి తెల్సిందే. మిరాజ్ యుద్ధ విమానాల ద్వారా సర్జికల్ దాడులకు దిగడంతో దాదాపు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలిసింది. -
ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
కశ్మీర్: బారాముల్లా జిల్లా సోపోర్ పట్టణంలో ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు మృతిచెందారు. ఈ ఘటనలో ఎటువంటి ఆస్తినష్టం జరగలేదని, అలాగే జవాన్లు ఎవరికీ గాయాలు కాలేదని దక్షిణ కశ్మీర్ డీఐజీ అతుల్ కుమార్ గోయల్ తెలిపారు. చనిపోయిన వారిని ఇంకా గుర్తించాల్సి ఉంది. అలాగే సంఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలోనికి జవాన్లు చెప్పేంతవరకు ప్రజలు ఎవరూ రావద్దని ఓ ప్రకటనలో డీఐజీ తెలిపారు. కార్డన్ సెర్చ్‌లో భాగంగా ఇళ్లను తనిఖీ చేస్తుండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా జవాన్లపైకి కాల్పులు జరిపారని, రెప్పపాటులో జవాన్లు స్పందించి ఎదురు కాల్పులకు దిగడంతో జవాన్లు మట్టికరిచారని డీఐజీ వివరించారు. -
పాక్ సైనికులను వేటాడిన భారత ఆర్మీ
న్యూఢిల్లీ : భారత్ - పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ల మధ్యలో గల నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వద్ద హైటెన్షన్ నెలకొంది. ఎల్వోసీని దాటి వెళ్లిన భారత ఆర్మీ సైనికుల బృందం ముగ్గురు పాకిస్తాన్ సైనికులను హతమార్చింది. గత శనివారం ఎల్వోసీ వద్ద పాకిస్తాన్ ఆర్మీ విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో నలుగురు భారత ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు ప్రతీకారంగానే నియంత్రణ రేఖను దాటి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోకి భారత ఆర్మీ బలగాలు చొచ్చుకెళ్లినట్లు పేరు తెలపడానికి ఇష్టపడని ఇంటిలిజెన్స్ అధికారి ఒకరు చెప్పారు. భారత్ ఆర్మీ ఎల్వోసీలోకి వెళ్లొచ్చిన కొద్దిసేపటికే భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య పుల్వామాలో కాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్‌లో జైషే ఈ మహ్మద్ టాప్ కమాండర్ నూర్ మహ్మద్‌ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పుల్వామాలోనే నక్కిన మరో ముగ్గురు ఉగ్రవాదుల కోసం దళాలు జల్లెడ పడుతున్నాయి. కాగా, భారత ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్‌పై పాకిస్తాన్ మీడియా ప్రకటనను వెలువరించింది. నియంత్రణ రేఖ వద్ద ముగ్గురు పాకిస్తాన్ సైనికులను చంపినట్లు పేర్కొంది. మరొకరికి కాల్పుల్లో తీవ్ర గాయాలయ్యాయని తెలిపింది. -
చైనాను కార్నర్ చేయనున్న భారత్!
న్యూఢిల్లీ: చైనాను భారత్ కార్నర్ చేయనుంది. పాకిస్థాన్‌ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టినట్లుగానే చైనాను ఇక తప్పుబట్టనుంది. చైనా తాను చేసిన పొరపాటును ఇప్పుడు సరిదిద్దుకోకపోతే నిజంగానే ఇక చైనాతో సత్సంబంధాల విషయంలో భారత్ దూరం జరగనుంది. జైషే ఈ మహ్మద్ ఉగ్రవాద సంస్థ అని, దానిపై నిషేధం విధించి, దాని చీఫ్ మౌలానా మసూద్ అజర్‌ను దోషిగా నిలబెట్టాలని భారత్ ఈ ఏడాది (2016) మార్చి 31న ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో ప్రవేశపెట్టింది. అయితే, ఐదుగురు శాశ్వత సభ్యులు, పదిమంది తాత్కాలిక సభ్యులు ఉన్న ఈ మండలిలో ఒక్క చైనా మాత్రమే భారత్ ప్రతిపాదనను తోసిపుచ్చింది. అప్పటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న భారత్ తాజాగా పఠాన్ కోట్‌పై దాడి ఘటనకు సంబంధించి ఎన్ఐఏ జరిపిన విచారణలో జైషే ఈ మహ్మద్ సంస్థకు చెందిన వారే ఈ ఉగ్రదాడికి పాల్పడినట్లు గుర్తించింది. పలు ఆధారాలు సేకరించింది. ఇప్పుడు వాటిని మరోసారి భారత్ ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా ఈసారి కచ్చితంగా భారత్ గతంలో చేసిన ప్రతిపాదనను ఆమోదించి తీరాలి. అలా కాకుండా విబేధిస్తే ఇక చైనాను అంతర్జాతీయ సమాజం ముందు ఎండగట్టాలని భారత్ వ్యూహం. భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌కు ముందునుంచే చైనా మద్దతిస్తోందని ఇప్పటికే పలు సందర్భాల్లో బయటపడిన విషయం తెలిసిందే. -
మళ్లీ దోవల్-మసూద్ ఫేస్ టు ఫేస్!
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లో జైషే మహమ్మద్ ఉగ్రవాద గ్రూప్ స్థాపకుడు మౌలానా మసూద్ అజార్‌ను రౌండప్ చేయడం, అతని కార్యాలయాలు మూసివేస్తుండటం.. తప్పకుండా ఒక వ్యక్తికి ఆనందం కలిగించి ఉండాలి. ఆయనే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. 1994లో శ్రీనగర్‌లో మసూద్ అజార్‌ను తొలిసారి పట్టుకున్నప్పుడు అతడో చిన్న చేప అని భద్రతా సంస్థలు కొట్టిపారేశాయి. అప్పట్లో 26 ఏళ్ల అజార్ వద్ద ఓ నకిలీ పోర్చుగీసు పాస్పోర్టుతో, హర్కతుల్ ముజాహిద్దీన్ మ్యాగజీన్ ప్రతులు దొరికాయి. కానీ అజిత్ దోవల్ రంగంలోకి దిగిన తర్వాతే తెలిసింది మసూద్ పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో.. అతనికి పాకిస్థాన్‌లో భారీ ఎత్తున ఉగ్రవాద నెట్వర్క్ ఉంది. కశ్మీర్ లోయలోని ఉగ్రవాద గ్రూపులు హర్కతుల్ అన్సర్, హర్కతుల్ ముజాహిద్దీన్ మధ్య సయోధ్య కుదిర్చి.. కశ్మీర్‌తోపాటు భారత్ అంతటా భారీ ఎత్తున దాడులు జరిపేందుకు మసూద్‌ను పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ పంపింది. అజిత్ దోవల్, ఆయన బృందం ఎంతో శ్రమించి ఈ విషయాలను వెలుగులోకి తేవడంతో మసూద్ గురించి వెల్లడైంది. ఆ తర్వాత 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐసీ 814 నేపాల్‌లోని కట్మాండు నుంచి ఢిల్లీ బయలుదేరుతుండగా.. దానిని హైజాక్ చేసి కాందహార్ తరలించారు. దీంతో బందీలుగా ఉన్న ప్రయాణికులను విడిపించేందుకు దోవల్ ఉగ్రవాదులతో చర్చలు జరిపారు. ఆ తర్వాత ముగ్గురు ఉగ్రవాదులను తీసుకొని అప్పటి విదేశాంగ జశ్వంత్ సిన్హాను వెంటబెట్టుకొని కాందహార్ వెళ్లి బందీలను విడిపించుకొచ్చారు. మసూద్‌తోపాటు అప్పుడు విడుదలైన ఉగ్రవాదులు ఒమర్ షైక్ (ప్రస్తుతం జర్నలిస్టు హత్యకేసులో పాక్‌లో అరెస్టయాడు), ముస్తాక్ జార్గర్. అప్పుడు అజిత్ దోవల్ బృందంలో ఉన్న అసిఫ్ ఇబ్రహీం ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉగ్రవాదంపై ప్రత్యేక రాయబారిగా వ్యవహరిస్తూ.. దోవల్తోపాటే ఉండగా, మరో సభ్యుడు అవినాశ్ మోహనానీ సిక్కీం డీజీపీగా వ్యవహరిస్తున్నారు. పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి, ఆఫ్ఘనిస్థాన్‌లోని మజర్ ఎ షహర్లో భారత రాయబార కార్యాలయంపై దాడులకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మసూద్ అరెస్టు నేపథ్యంలో భారత్ తీసుకోవాల్సిన చర్యలపై దోవల్ బృందం ఇప్పుడు మరోసారి కేంద్రానికి మార్గనిర్దేశనం చేస్తోంది. -
లష్కరే తాయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులా?
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా దీనానగర్ పోలీసు స్టేషన్‌పై దాడిచేసి, మొత్తం 13 ప్రాణాలు పోయేందుకు కారణమైన ఉగ్రవాదులు ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చారన్న ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి. వీళ్లు లష్కరే తాయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద గ్రూపులకు చెందినవారు అయి ఉంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో కూడా ముంబై ఉగ్రదాడుల సమయంలో లష్కరే తాయిబా వద్ద శిక్షణ పొందిన ఉగ్రవాదులు వచ్చి ఇక్కడ దాడులు చేసిన విషయం తెలిసిందే. అదే దారిలో మరోసారి లష్కరే తాయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఇప్పుడూ ప్రవేశించి ఉంటారని అనుమానిస్తున్నారు. మొత్తం ఉగ్రవాదులందరూ 15 నుంచి 54 ఏళ్ల మధ్య వయసున్నవారేనని అంటున్నారు. వారిలో ఒక తీవ్రవాది హతం కాగా, మరో తీవ్రవాదికి తీవ్ర గాయాలయ్యాయి. 2007 తర్వాత పంజాబ్‌లో ఉగ్రవాద ఘటన చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి. దీనానగర్ ప్రాంతంలో స్కూళ్లు, కాలేజీలను అధికారులు పూర్తిగా బంద్ చేశారు. పంజాబ్ రాజధాని చండీగఢ్ నగరానికి 260 కిలోమీటర్ల దూరంలో ఈ దీనానగర్ ఉంది. తీవ్రవాదుల ఎన్కౌంటర్లో పంజాబ్ పోలీసు కమాండోలు ముమ్మరంగా పాల్గొన్నారు.