భారత్ - పాక్ ఆక్రమిత కశ్మీర్‌ల మధ్య ఉన్న నియంత్రణ రేఖ
న్యూఢిల్లీ : భారత్ - పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ల మధ్యలో గల నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వద్ద హైటెన్షన్ నెలకొంది. ఎల్‌వోసీని దాటి వెళ్లిన భారత ఆర్మీ సైనికుల బృందం ముగ్గురు పాకిస్తాన్ సైనికులను హతమార్చింది. గత శనివారం ఎల్‌వోసీ వద్ద పాకిస్తాన్ ఆర్మీ విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో నలుగురు భారత ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు ప్రతీకారంగానే నియంత్రణ రేఖను దాటి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోకి భారత ఆర్మీ బలగాలు చొచ్చుకెళ్లినట్లు పేరు తెలపడానికి ఇష్టపడని ఇంటిలిజెన్స్ అధికారి ఒకరు చెప్పారు.
భారత్ ఆర్మీ ఎల్‌వోసీలోకి వెళ్లొచ్చిన కొద్దిసేపటికే భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య పుల్వామాలో కాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్‌లో జైషే ఈ మహ్మద్ టాప్ కమాండర్ నూర్ మహ్మద్‌ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పుల్వామాలోనే నక్కిన మరో ముగ్గురు ఉగ్రవాదుల కోసం దళాలు జల్లెడ పడుతున్నాయి. కాగా, భారత ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్‌పై పాకిస్తాన్ మీడియా ప్రకటనను వెలువరించింది. నియంత్రణ రేఖ వద్ద ముగ్గురు పాకిస్తాన్ సైనికులను చంపినట్లు పేర్కొంది. మరొకరికి కాల్పుల్లో తీవ్ర గాయాలయ్యాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment