పల్లె ప్రగతికి ప్రణాళిక..! | The rural development plan | Sakshi
Sakshi News home page

పల్లె ప్రగతికి ప్రణాళిక..!

Published Tue, Mar 1 2016 4:36 AM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM

పల్లె ప్రగతికి ప్రణాళిక..! - Sakshi

పల్లె ప్రగతికి ప్రణాళిక..!

గ్రామీణాభివృద్ధికి రూ. 87 వేల కోట్లు  గతేడాదికన్నా 8,200 కోట్లు అధికం
 
 రైతు, పేదల సంక్షేమం లక్ష్యంగా సాగిన బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా గ్రామీణ రంగానికీ సముచిత ప్రాధాన్యత ఇచ్చారు. ఈ బడ్జెట్లో గ్రామీణాభివృద్ధికి మొత్తంగా రూ.87,765 కోట్లను ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కేటాయించారు. ఇది గత ఏడాది కేటాయింపు రూ. 79,526 కోట్ల కన్నా రూ.8200 కోట్లు అధికం.  గ్రామీణ రంగానికి బడ్జెట్లో కేటాయింపులు ఇలా..
 
♦ పంచాయతీలు, మున్సిపాలిటీలకు రూ. 2.87  లక్షల కోట్ల గ్రాంట్స్ ఇన్ ఎయిడ్
♦ రూ. 2.87  లక్షల కోట్ల గ్రాంట్స్ ఇన్ ఎయిడ్
♦ ఒక్కో పంచాయతీకి(సగటున) రూ. 80 లక్షలు
♦ ఒక్కో మున్సిపాలిటీకి(సగటున) రూ. 21 కోట్లు
♦ విద్యుదీకరణకు 8,500 కోట్లు
♦ భూ రికార్డుల ఆధునీకరణకు 150 కోట్లు
 
► 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలకు రూ. 2.87 లక్షల కోట్లను సహాయ నిధి(గ్రాంట్ ఇన్ ఎయిడ్)గా అందించనున్నారు. గత ఐదేళ్ల కాలానికి కేటాయించిన మొత్తం కన్నా ఇది 228% అధికం కావడం విశేషం. ఈ నిధుల్లో సగటున ఒక్కో గ్రామ పంచాయతీకి రూ. 80 లక్షలు, పట్టణ స్థానిక సంస్థకు రూ. 21 కోట్లు అందనున్నాయి. ఈ నిధులకు సంబంధించిన నిబంధనలను ఆయా రాష్ట్రాలను సంప్రదించి.. పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ రూపొందిస్తుంది.
► {పత్యామ్నాయ జీవన వనరులను ప్రోత్సహించేందుకు స్వయం సహాయ బృందాల ఏర్పాటును వేగవంతం చేయాలని నిర్ణయించారు.
► ఉపాధి హామీ పథకం కింద జలసంరక్షణ, సహజ వనరుల నిర్వహణ కోసం ప్రత్యేక సహాయక బృందాల (క్లస్టర్ ఫెసిలిటేషన్ టీమ్స్) ఏర్పాటు.
► శ్యామా ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్‌లో భాగంగా 300 రూరల్ - అర్బన్ క్లస్టర్ల ఏర్పాటు. ఇవి రైతులకు మౌలిక వసతులు, మార్కెట్ సదుపాయాలు తదితరాల్లో సహకారం అందిస్తాయి. గ్రామీణ యువతకు ఉపాధి కల్పనకు కృషి చేస్తూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రగతి చోదకాల పాత్ర పోషిస్తాయి.
► 2015 ఏప్రిల్ 1 నాటికి 18,542 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 23 నాటికి వాటిలో 5,542 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించగలిగామని, గత మూడేళ్లలో మొత్తంగా కూడా ఇంత విద్యుదీకరణ జరగలేదని జైట్లీ ప్రకటించారు. మే 1, 2018 నాటికి 100% విద్యుదీకరణకు కట్టుబడి ఉన్నామన్న జైట్లీ.. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన, సమీకృత విద్యుదీకరణ పథకాలకు రూ. 8,500 కోట్లు కేటాయించారు.
► మొత్తం 16.8 కోట్ల గ్రామీణ కుటుంబాల్లో దాదాపు 12 కోట్ల గృహాల్లో కంప్యూటర్లు కానీ, డిజిటల్ పరిజ్ఞానం ఉన్నవారు కానీ లేరు. డిజిటల్ పరిజ్ఞానాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఇప్పటికే నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్, డిజిటల్ సాక్షరత అభియాన్(దిశ)లను ప్రారంభించాం. త్వరలో మరో కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. దీనిద్వారా రానున్న మూడేళ్లలో మరో 6 కోట్ల గృహాలకు డిజిటల్ పరిజ్ఞానాన్ని అందిస్తారు. ఈ కార్యక్రమ వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
► భూమి రికార్డుల ఆధునీకరణలో భాగంగా.. 2016 ఏప్రిల్ 1 నుంచి జాతీయ భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమం కేంద్ర పథకంగా కొనసాగుతుంది. ఇందుకోసం రూ. 150 కోట్లను కేటాయించారు.
► సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలను సాధించేలా పంచాయతీరాజ్ వ్యవస్థల్లో పాలనాపరమైన అభివృద్ధి కోసం ‘రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్’ను ప్రారంభించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 665 కోట్లను కేటాయించినట్లు తెలిపింది.
 
 ఇక ‘పొగ’ చూర ని వంటిళ్లు!
 ♦ పేద మహిళలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు
 ♦ బడ్జెట్‌లో రూ.2 వేల కోట్ల కేటాయింపు
 ♦ 1.50 కోట్ల బీపీఎల్ కుటుంబాలకు లబ్ధి
 
 న్యూఢిల్లీ: పేద మహిళలకు వంటింటి పొగ కష్టాలు తీరుస్తామని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. వంటచెరుకు ఉపయోగించి పొయ్యిలపై వంట చేసే మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి పొయ్యిల వినియోగం ఒక గంటలో 400 సిగరెట్లు కాల్చడంతో సమానమని నిపుణులు పేర్కొంటున్నారని తెలిపారు. ఈ పరిస్థితిని మార్చేందుకు పేద మహిళలకు వారి పేరిటే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు అందిస్తామని ప్రకటించారు. ఇందుకు బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించారు. దీనివల్ల 2016-17 సంవత్సరంలో దారిద్య్ర రేఖ (బీపీఎల్)కు దిగువన ఉన్న 1.50 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

బీపీఎల్ దిగువన ఉన్న మొత్తం 5 కోట్ల కుటుంబాలు దీనిద్వారా లబ్ధిపొందేందుకు ఈ పథకాన్ని మూడేళ్లపాటు కొనసాగిస్తామని వెల్లడించారు. దీనివల్ల వంటింటి శ్రమ త గ్గడమేగాకుండా మహిళల ఆరోగ్యం కాపాడిన ట్లవుతుందన్నారు. అలాగే గ్యాస్ సరఫరా ప్రక్రియలో గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉపాధి అందుతుందన్నారు. ప్రధాని పిలుపు మేరకు దేశంలో 75 లక్షల మధ్య తరగతి కుటుంబాలు గ్యాస్ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకున్నాయని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. మరోవైపు కొత్తగా ఇవ్వనున్న గ్యాస్ కనెక్షన్లలో ఒక్కో లబ్ధిదారుడికి రూ.1,600 రాయితీ అందిస్తామని చమురుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు.
 
 కరెంటు చార్జీల మోత!
 న్యూఢిల్లీ/కోల్‌కతా: విద్యుత్ చార్జీల మోత మోగనుంది. ఒక్కో యూనిట్‌పై దాదాపు 16 పైసల వరకు పెరిగే అవకాశముంది. శుద్ధ ఇంధనం సెస్‌ను రెట్టింపు చేస్తామని బడ్జెట్‌లో ప్రతిపాదించడంతో బొగ్గు ధరలు సుమారు 20 శాతం వరకు పెరగనున్నాయి. బొగ్గు, లిగ్నైట్, పీట్‌పై టన్నుకు రూ.400 సెస్‌ను ప్రతిపాదించారు. వీటిపై వసూలు చేస్తున్న ‘శుద్ధ ఇంధన సెస్’ పేరును ‘శుద్ధ పర్యావరణ సెస్’గా మారుస్తున్నట్లు ఆర్థికమంత్రి జైట్లీ తన బడ్జెట్‌లో ప్రసంగంలో ప్రకటించారు. మెట్రిక్ టన్నుకు ప్రస్తుతం రూ.200 ఉందని, దీన్ని రూ.400 కు పెంచుతున్నట్లు చెప్పారు. దీనిపై కేపీఎంజీ సంస్థ ఇంధన, సహజ వనరుల విభాగం అధిపతి మనీశ్ అగర్వాల్ స్పందిస్తూ.. ఒక్కో యూనిట్‌పై సుమారు 12-16 పైసలు పెరిగే అవకాశముందన్నారు. భారత్ అల్యూమినియం కంపెనీ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎస్‌కే రూంగ్టా స్పందిస్తూ.. ఈ ప్రతిపాదిత పన్ను వల్ల విద్యుత్ ధరలు పెరుగుతాయని, ధరలను వినియోగదారులకే బదలాయించాల్సి ఉంటుందన్నారు.
 
 మహిళా, శిశు అభివృద్ధికి రూ.17,408 కోట్లు
 న్యూఢిల్లీ: దేశంలోని చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా నివారించడం, అదేసమయంలో మహిళలు, చిన్నారులకు తగిన భద్రత కల్పించడం ధ్యేయంగా మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ అమలు చేస్తున్న పథకాలకు తాజా బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేటాయింపులను గణనీయంగా పెంచారు. 2016-17 ఆర్థిక సంవత్సరంకోసం ఈ శాఖకు రూ.17,408 కోట్లను కేటాయిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇందులో రూ.15,860 కోట్లను చిన్నారుల అభివృద్ధికి వెచ్చిస్తారు. ఐసీడీఎస్‌కోసం ప్రపంచబ్యాంక్ సాయంతో చేపడుతున్న కార్యక్రమం కింద వెచ్చించే రూ.415 కోట్లు, జాతీయ పౌష్టికాహార మిషన్ కింద వెచ్చించే రూ.300 కోట్ల అదనపు నిధులు ఇందులో ఉన్నాయి. అలాగే ఆహార, పౌష్టికాహార ల్యాబొరేటరీల ఏర్పాటుకోసం కూడా అదనపు నిధులను కేటాయించారు.

► బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమానికి బడ్జెట్ కేటాయింపులను తాజా బడ్జెట్‌లో రూ.75 కోట్ల నుంచి రూ.వంద కోట్లకు పెంచారు. 
► అదేవిధంగా మహిళలకోసం షెల్టర్ హోమ్స్ ఏర్పాటుకు సంబంధించి కేటాయింపులనూ పెంచారు. 2015-16 బడ్జెట్‌లో రూ.52 కోట్లు కేటాయించగా.. 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.వంద కోట్లు కేటాయించారు.
► ఇక మహిళలకోసం ఏకీకృత సేవా కేంద్రాల(ఒన్‌స్టాప్ సెంటర్స్) ఏర్పాటుకు చేసిన కేటాయింపుల్లో 500 శాతం పెంపుదల చోటు చేసుకుంది. గత బడ్జెట్‌లో కేవలం రూ.13 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.75 కోట్లు ఇచ్చారు.
► మరోవైపు మహిళల భద్రతకోసం అదనపు పథకాలను చేపట్టడానికి వీలుగా నిర్భయ నిధికి రూ.500 కోట్లను ఆర్థికమంత్రి తాజా బడ్జెట్‌లో కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement