ప్రపంచానికి తెలియని మరో తాజ్..
సాక్షి: ఆగ్రాలో ఉన్న అందమైన తాజ్‌మహల్ ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటి. ఈ అద్భుత కట్టడం గురించి అందరికీ తెలిసిందే. అయితే మన దేశంలో చాలా మందికి తెలియని మరో తాజ్‌మహల్ కూడా ఉంది. అదే భోపాల్ తాజ్‌మహల్. ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజప్రాసాదంగా పేరుగాంచిన ఈ చారిత్రక కట్టడం విశేషాలు మీ కోసం!
ఎవరు నిర్మించారు?
భోపాల్ రాజ్యాన్ని పాలించిన 11వ పరిపాలకురాలు నవాబ్ షాజహాన్ బేగమ్ ఎన్నో అందమైన కట్టడాలను నిర్మించారు. 1868 నుంచి 1901 వరకు ఆమె భోపాల్‌ను పరిపాలించారు. ఈ సమయంలో నిర్మించిన కట్టడాల్లో తాజ్‌మహల్ కూడా ఒకటి. ఇది భోపాల్‌లోని అతిపెద్ద మసీదు తాజ్ ఉల్ మజీద్ పక్కన ఉంది.
ఎందుకు నిర్మించారు?
షాజహాన్ తన ప్రియురాలి కోసం ఆగ్రాలో తాజ్‌మహల్‌ను కట్టించాడు. కానీ భోపాల్ తాజ్‌మహల్ బేగమ్ నివాసంగా రూపుదిద్దుకుంది. ఆ కాలంలో దీన్ని నిర్మాణానికి రూ.70 లక్షలు ఖర్చు చేశారు. 1871 నుంచి 1884 వరకు 13 ఏళ్లపాటు ఈ నిర్మాణం కొనసాగింది. ఆ కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద రాజప్రాసాదంగా దీన్ని నిర్మించడం విశేషం. మొదట దీన్ని 'రాజ్‌మహల్' అని పిలిచేవారు. తర్వాత భోపాల్‌లో నివసించిన బ్రిటిష్ పాలకులకు దీని నిర్మాణ పనితనం నచ్చి దీన్ని కూడా తాజ్‌మహల్‌గా పిలవడం మొదలు పెట్టారు.
చారిత్రక వారసత్వ సంపదగా..
1947లో స్వాతంత్య్రం వచ్చి పాకిస్తాన్ నుంచి దేశం విడిపోయిన తర్వాత నవాబ్ హమీదుల్లా ఖాన్ సింధీ కాందిశీకులను ఈ ప్యాలెస్‌లో నివసించేందుకు ఏర్పాట్లు చేశారు. వారు నాలుగేళ్లపాటు ఇందులో నివసించారు. ఆ సమయంలో ఈ రాజప్రాసాదం కొంత మేర దెబ్బతింది. 2008లో ఈ రాజ్‌మహల్‌లోని పలు భవనాలు కూలిపోయాయి. 2005లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని రాష్ట్ర చారిత్రక వారసత్వ సంపదగా ప్రకటించింది.
పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా..
దీనిపై పరిశోధనలు చేసిన హుస్సేన్ అనే చరిత్రకారుడు ‘ది రాయల్ జర్నీ ఆఫ్ భోపాల్’ అనే పుస్తకాన్ని రాశారు. అందులో భోపాల్‌లోనే అతిపెద్ద ప్యాలెస్‌గా దీన్ని అభివర్ణించారు.ఇక్కడకు వచ్చే పర్యాటకులకు ఇది ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఏటా దేశవిదేశాలకు చెందిన వేలాది మంది ఈ అద్భుత కట్టడాన్ని సందర్శిస్తున్నారు.
ప్రత్యేకతలు..
భోపాల్ తాజ్‌మహల్‌ను చాలా మంది శిల్పులు వారి శిల్పకళాపనితనంతో అందంగా తీర్చిదిద్దారు. బ్రిటిష్, ఫ్రెంచ్, మొఘల్, అరబిక్, హిందూ వాస్తు నిర్మాణ పద్ధతుల్లో దీన్ని నిర్మించారు. ఇందులో 120 గదులున్నాయి. వీటిలో శీష్ మహల్ (అద్దాల ప్యాలెస్), అతిపెద్దదైన సావన్ బడో పెవిలియన్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రధాన ద్వారం వద్ద నిర్మించిన ఏడు అంతస్తుల భవనం చూడదగింది.